SA Tour Of England: అరివీర భయంకరుడు వచ్చేస్తున్నాడు.. ఇంగ్లండ్‌ను ఆపడం కష్టమే..! 

Jofra Archer Returns To England ODI Squad For South Africa Tour - Sakshi

Jofra Archer Returns To England ODI Squad: ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు శుభవార్త అందింది. గాయం కారణంగా దాదాపు రెండేళ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో (27, 29, ఫిబ్రవరి 1) సౌతాఫ్రికాతో జరిగే 3 వన్డేల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఎంపిక చేసిన 14 మంది సభ్యుల బృందంలో జోఫ్రా చోటు దక్కించుకున్నాడు.

జోఫ్రా.. 2021 మార్చిలో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ (ఇండియాపై) ఆడాడు. మోచేయి, వెన్నెముక సర్జరీలు చేయించుకున్న జోఫ్రా.. సుదీర్ఘకాలం తర్వాత ఇటీవలే ఓ వార్మప్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఇంగ్లండ్‌ లయన్స్‌-ఇంగ్లండ్‌ టెస్ట్‌ టీమ్‌ మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో లయన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జోఫ్రా మునుపటి వేగాన్ని కొనసాగిస్తూ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా ఈసీబీ జోఫ్రాను సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసింది. 

కాగా, జోఫ్రా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో ముంబై ఇండియన్స్‌ జట్టు కూడా సంబురాల్లో మునిగిపోయింది. 2022 ఐపీఎల్‌ మెగా వేలంలో ముంబై ఫ్రాంచైజీ.. జోఫ్రా గాయం కారణంగా అందుబాటులో ఉండడని తెలిసినా 8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. జోఫ్రా గాయాల నుంచి కోలుకోవడంతో ఐపీఎల్‌ 2023 సీజన్‌ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. 

ఇదిలా ఉంటే, ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లండ్‌.. జోఫ్రా చేరికతో మరింత బలపడుతుంది. ఇదివరకే పటిష్టమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌ కలిగిన ఇంగ్లండ్‌ టీమ్‌.. జోఫ్రా ఎంట్రీతో పట్టపగ్గాల్లేకుండా పోతుంది.  ఫార్మాట్‌ ఏదైనా ఇకపై ఇంగ్లండ్‌ను ఆపడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బెన్‌ స్టోక్స్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ టెస్ట్‌ టీమ్‌ తాజాగా పాక్‌ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించింది. అంతకుముందు జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో బట్లర్‌ సేన.. ఇదే పాక్‌ను ఫైనల్లో మట్టికరిపించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది.    

సౌతాఫ్రికా టూర్‌కు ఇంగ్లండ్‌ జట్టు..
జోస్ బట్లర్ (కెప్టెన్‌), జోఫ్రా ఆర్చర్‌, మొయిన్ ఆలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డక్కెట్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, ఫిలిప్ సాల్ట్, ఓల్లీ స్టోన్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్‌

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top