
క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్
రోమ్: నిషేధం గడువు పూర్తయ్యాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో ప్రపంచ పురుషుల టెన్నిస్ నంబర్‌వన్ యానిక్ సినెర్ జోరు కొనసాగిస్తున్నాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 18వ ర్యాంకర్ ఫ్రాన్సిస్కో సెరున్‌డోలో (అర్జెంటీనా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సినెర్ 7–6 (7/2), 6–3తో విజయం సాధించాడు. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ రెండు ఏస్‌లు సంధించాడు.
తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఏడుసార్లు నెట్ వద్దకు దూసుకొచి్చన సినెర్ నాలుగుసార్లు పాయింట్లు గెలిచాడు. సెరున్‌డోలో 14 సార్లు నెట్ వద్దకు వచ్చి ఎనిమిది సార్లు పాయింట్లు సొంతం చేసుకున్నాడు. 17 విన్నర్స్ కొట్టిన సినెర్ 30 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు సెరున్‌డోలో 29 విన్నర్స్ కొట్టి ఏకంగా 53 అనవసర తప్పిదాలు చేశాడు.
91 సర్వీస్ పాయింట్లలో సినెర్ 51 పాయింట్లు... 86 సర్విస్ పాయింట్లలో సెరున్‌డోలో 47 పాయింట్లు సాధించారు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే)తో సినెర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో సినెర్ 3–0తో రూడ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్ జాక్ డ్రేపర్ (బ్రిటన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్‌కరాజ్ 6–4, 6–4తో విజయం సాధించాడు.
సెమీస్‌లో కోకో గాఫ్
రోమ్ ఓపెన్ మహిళల టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంకర్, అమెరికా స్టార్ కోకో గాఫ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ మీరా ఆంద్రియెవా (రష్యా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ 6–4, 7–6 (7/5)తో గెలుపొందింది. ఒక గంట 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కోకో గాఫ్ తన సర్విస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది.