Salman Butt: శుభ్‌మన్‌ గిల్‌ను ఫెదరర్‌తో పోల్చిన పాక్‌ మాజీ కెప్టెన్‌

Its Like Watching Federer Play, Salman Butt On Shubman Gill Batting - Sakshi

టీమిండియా యంగ్‌ డైనమైట్‌, రైజింగ్‌ స్టార్‌ శుభ్‌మన్‌ గిల్‌పై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ ప్రోగ్రాం సందర్భంగా భట్‌ మాట్లాడుతూ.. గిల్‌తో పాటు టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌, టెన్నిస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ రోజర్‌ ఫెదరర్‌ పేర్లను ప్రస్తావించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో గిల్‌ చేసిన విధ్వంసకర శతకాన్ని కొనియాడిన భట్‌.. ఇదే సందర్భంగా గిల్‌ సహచరుడు, సహ ఓపెనర్‌ ఇషాన్‌ను తక్కువ చేసి మాట్లాడాడు.

గిల్‌ బ్యాటింగ్‌ స్టయిల్‌ను ఆకాశానికెత్తుతూనే, ఇషాన్‌ స్థాయి ఇంకా మెరుగుపడాలని సూచించాడు. ఇషాన్‌తో పోలిస్తే గిల్‌ స్థాయి చాలా ఎక్కువ అని, ఈ ఒక్క ఇన్నింగ్స్ ఆధారంగా తాను ఈ కామెంట్‌ చేయట్లేదని అన్నాడు. గిల్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే టెన్నిస్‌లో ఫెదరర్‌ ఆట చూసిన ఫీలింగ్‌ కలుగుతుందని, ఫెదరర్‌లా గిల్‌ కూడా ఆటను చాలా క్లాస్‌గా ఆడతాడని ప్రశంసించాడు. పవర్‌ హిట్టింగ్‌ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో గిల్‌ కష్టపకుండా, టెక్నిక్‌ ఉపయోగించి సునాయాసంగా షాట్లు ఆడుతున్నాడని కొనియాడాడు.

గిల్‌ ఆడిన ప్రతి షాట్‌ కూడా అచ్చమైన క్రికెటింగ్‌ షాట్‌ అని, టెన్నిస్‌లో ఇదే ఫార్ములా ఫాలో​ అయిన ఫెదరర్‌ ఎలా సక్సెస్‌ అయ్యాడో గిల్‌ కూడా అలాగే సక్సెస్‌ అవుతాడని జోస్యం చెప్పాడు. టెక్నిక్‌ విషయంలో ప్రస్తుత తరం క్రికెటర్లలో గిల్‌ మించిన బ్యాటర్‌ లేడని, ఇతను కచ్చితంగా టీమిండియా భవిష్యత్‌ ఆశాకిరణమని ప్రశంసల వర్షం కురింపించాడు. పాక్‌ మాజీలు సహజంగా టీమిండియా ఆటగాళ్లను విమర్శించడమే పనిగా పెట్టుకుంటుంటారు. కానీ, భట్‌ గిల్‌ను పొగడ్తలతో ముంచెత్తడం ఆశ్చర్యకరంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, న్యూజిలాండ్‌తో మూడో టీ20లో గిల్‌ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో  126 నాటౌట్‌ పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా టీమిండియా మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన గిల్‌.. అంతకుముందు కివీస్‌తోనే జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ, డబుల్‌ సెంచరీ బాదాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top