
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిన్న (మే 19) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊరట పొందే విజయం సాధించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్‌కు ఒరిగిందేమీ లేనప్పటికీ.. లక్నో ప్లే ఆఫ్స్ ఆశలను మాత్రం ఆవిరి చేసింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్
లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఎల్‌ఎస్‌జీతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సన్‌రైజర్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఈ స్టేడియంలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లక్నో నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ స్టేడియంలో 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటిసారి (నాలుగు ప్రయత్నాల్లో).
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఎయిడెన్ మార్క్రమ్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో పూరన్ (26 బంతుల్లో 45) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. రిషబ్ పంత్ (7) తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మిగతా బ్యాటర్లలో ఆయుశ్ బదోని 3, అబ్దుల్ సమద్ 3, శార్దూల్ ఠాకూర్ 4, ఆకాశ్‌దీప్ (6 నాటౌట్) పరుగులు చేశారు.
ఓపెనర్లు అందించిన శుభారంభానికి ఈ మ్యాచ్‌లో లక్నో ఇంకాస్త భారీ స్కోర్ సాధించి ఉండాల్సింది. అయితే చివరి ఓవర్లలో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు కోల్పోయారు. నితీశ్ రెడ్డి వేసిన చివరి ఓవర్‌లో లక్నో మూడు వికెట్లు (2 రనౌట్లు) కోల్పోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2, నితీశ్ రెడ్డి, హర్షల్ పటేల్, హర్ష్ దూబే తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అభిషేక్ శర్మ తన సహజ శైలిలో ఊచకోత (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కోసి సన్‌రైజర్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్ కిషన్ (35), క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32 రిటైర్డ్ హర్ట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. అనికేత్ వర్మ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) మ్యాచ్‌లను లాంఛనంగా ముగించారు.
లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ 2, విలియమ్ ఓరూర్కీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా గొడవ పడిన అభిషేక్, దిగ్వేశ్ మ్యాచ్ పూర్తయ్యాక ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. రాజీవ్ శుక్లా ఈ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చాడు.