
Photo Courtesy: BCCI
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారధుల్లో ఒకడైన శ్రేయస్ అయ్యర్ మరో కలికితురాయిని తన కీర్తి కిరీటంపై అమర్చుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన తొలి, ఏకైక కెప్టెన్‌గా రికార్డు సాధించాడు. 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను రన్నరప్‌గా నిలబెట్టిన శ్రేయస్.. గత సీజన్‌లో (2024) కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.
ఈ సీజన్‌లో పంజాబ్ ఫ్రాంచైజీ శ్రేయస్‌పై భారీ అంచనాలతో ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక ధర (రూ. 26.75 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టుగానే శ్రేయస్ తన తొలి ప్రయత్నంలోనే పంజాబ్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.
నిన్న (మే 18) రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించడంతో పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఆ జట్టు 11 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించింది. చివరిగా 2014 సీజన్‌లో పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఇప్పుడు తిరిగి శ్రేయస్ నేతృత్వంలో మరోసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. శ్రేయస్ తనుకు మాత్రమే సాధ్యమైన వైవిధ్యభరితమైన కెప్టెన్సీతో పంజాబ్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.
ఈ సీజన్‌లో పంజాబ్ శ్రేయస్ నేతృత్వంలో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు (ఓ మ్యాచ్ రద్దు) సాధించి 17 పాయింట్లతో (0.389) పట్టికలో మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు ముందు ఆ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు పట్టికలో పంజాబ్ స్థానాన్ని డిసైడ్ చేస్తాయి. పంజాబ్ తమ చివరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (మే 24), ముంబై ఇండియన్స్‌తో (మే 26) తలపడాల్సి ఉంది.
కాగా, నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్‌లో ఎనిమిదో విజయం నమోదు చేసింది. ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌ల్లో లాగే రాజస్థాన్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచే స్థితిలో ఉండి ఓటమిపాలైంది. చివరి రెండు ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా.. 19 పరుగులకు మాత్రమే పరిమితమైంది.
బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోర్ (219/5) చేసింది. నేహల్ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచి కొట్టారు. ప్రభ్‌సిమ్రన్ (21), శ్రేయస్ అయ్యర్ (30), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (21 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ప్రియాంశ్ ఆర్య (9), మిచెల్ ఓవెన్ (0) విఫలమయ్యారు. రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 2, మపాకా, రియాన్ పరాగ్, ఆకాశ్ మధ్వాల్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్ జురేల్ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాయల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. జన్సెన్, ఒమర్‌జాయ్ తలో రెండు వికెట్లు తీసి రాయల్స్‌ను దెబ్బకొట్టడంలో తమవంతు పాత్ర పోషించారు.