
Photo Courtesy: BCCI
సంజూ శాంసన్ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 4000 పరుగుల మార్కును తాకిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2013లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సంజూ ఈ ఫ్రాంచైజీ తరఫున 148 మ్యాచ్‌లు ఆడి 141.24 స్ట్రయిక్‌రేట్‌తో 4027 పరుగులు చేశాడు. సంజూ తర్వాత జోస్ బట్లర్ (3055), అజింక్య రహానే (2810), షేన్ వాట్సన్ (2372) రాజస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా ఉన్నారు.
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 20) సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసిన సంజూ ఈ ఘనత సాధించాడు. మధ్యలో రెండు సీజన్లు (2016, 2017) మినహాయించి ఐపీఎల్ కెరీర్ మొత్తం రాజస్థాన్‌కే ఆడిన సంజూ ఇప్పటివరకు 176 మ్యాచ్‌లు ఆడి 139.05 స్ట్రయిక్‌రేట్‌తో 4704 పరుగులు చేశాడు. ఇందులో 26 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు ఉన్నాయి.
2016, 2017 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌పై వేటు పడటంతో ఆ రెండు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సంజూ, ఆ ఫ్రాంచైజీ తరఫున 28 మ్యాచ్‌లు ఆడి ఓ శతకం సాయంతో 677 పరుగులు చేశాడు. 2021 సీజన్‌లో రాజస్థాన్ కెప్టెన్‌గా నియమితుడైన సంజూ ఐదు సీజన్లలో ఆ జట్టుకు సారధిగా వ్యవహరించాడు.
ఈ సీజన్‌లో సంజూ గాయం కారణంగా చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉండటంతో అతని స్థానంలో రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. మొత్తంగా ఈ సీజన్‌లో రాజస్థాన్ పేలవ ప్రదర్శన కనబర్చి లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు కేవలం నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. నిన్న సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ఊరట పొందే విజయం సాధించి సీజన్‌ను ముగించింది.
నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (43), డెవాల్డ్ బ్రెవిస్ (42), శివమ్ దూబే (39) ఓ మోస్తరు స్కోర్లు చేసి సీఎస్‌కేకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. రాయల్స్ బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్, యుద్ద్‌వీర్ సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్‌పాండే, హసరంగ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం నామమాత్రపు లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్..యశస్వి జైస్వాల్ (36), వైభవ్ సూర్యవంశీ (57), సంజూ శాంసన్ (41), ధృవ్ జురెల్ (31 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.