
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 20) నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు ధోని, సంజూ శాంసన్ ఓ భారీ మైలురాయిపై కన్నేశారు.
ధోని ఓ సిక్సర్, సంజూ రెండు సిక్సర్లు బాదితే టీ20ల్లో 350 సిక్సర్ల మార్కును తాకుతారు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 33 మంది మాత్రమే ఈ మైలురాయిని తాకారు. పొట్టి క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు (1056) బాదిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ తర్వాతి స్థానాల్లో పోలార్డ్ (908), రసెల్ (747), పూరన్ (634), అలెక్స్ హేల్స్ (560), మున్రో (557), రోహిత్ (542), జోస్ బట్లర్ (537), మ్యాక్స్‌వెల్ (530) ఉన్నారు (టాప్-10లో).
ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజస్థాన్ ఆటగాళ్లు ఆకాశమే హద్దు అన్న రీతిలో బ్యాటింగ్ చేయవచ్చు. ఈ సీజన్‌లో ఆ జట్టు బ్యాటర్లు మొదటి నుంచి విధ్వంసం సృష్టిస్తున్నప్పటికీ లక్ కలిసి రాలేదు. యశస్వి జైస్వాల్, కుర్ర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరో సారి తెగబడి ఆడే ఛాన్స్ ఉంది. కొత్తగా జట్టులోకి వచ్చిన ప్రిటోరియస్ కూడా బ్యాట్‌కు పని చెప్పవచ్చు
ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌ల్లో రాయల్స్ గెలుపు వాకిట బోల్తా పడింది. ఇలా జరిగినందుకు ఈ సీజన్‌లో ఆ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ సీజన్‌లో రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. నేడు సీఎస్‌కేతో జరుగబోయే మ్యాచ్ రాయల్స్‌కు ఈ సీజన్‌లో చివరిది. కాబట్టి సీజన్‌ను గెలుపుతో ముగించి పరువు కాపాడుకోవాలని రాయల్స్ భావిస్తుంది.
సీఎస్‌కే విషయానికొస్తే.. ఈ జట్టు బ్యాటర్లు కూడా నేటి మ్యాచ్‌లో విజృంభించే అవకాశం ఉంది. ఈ జట్టు బ్యాటర్లు ఎదురుదాడి చేస్తే పోయేదేముందన్న రీతిలో బ్యాటింగ్ చేయవచ్చు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం ఉంది. కుర్ర బ్యాటర్లు ఆయుశ్ మాత్రే, ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్ నుంచి రికార్డు విన్యాసాలు ఆశించవచ్చు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.
ఇరు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటివరకు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్‌కే 16, రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. 2020 నుంచి ఇరు జట్ల మధ్య జరిగిన 9 మ్యాచ్‌ల్లో రాయల్స్ ఏడింట విజయాలు సాధించింది. నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో ఇరు జట్లు ప్రయోగాల బాటపట్టవచ్చు.
తుది జట్లు (అంచనా)..
సీఎస్‌కే: ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, MS ధోని (కెప్టెన్), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్/మతీషా పతిరానా
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, లువాన్-డ్రే ప్రిటోరియస్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తికేయ, నాంద్రే బర్గర్, అశోక్ శర్మ/శుభమ్ దూబే