RR VS KKR: అంతా డికాకే చేశాడు.. తప్పులు ఒప్పుకుంటాం.. రిపీట్‌ చేయం: రియాన్‌ పరాగ్‌ | "Team Will Work On Their Mistakes...": Rajasthan Royals Captain Riyan Parag Comments After 8 Wicket Loss To KKR In IPL 2025 | Sakshi
Sakshi News home page

RR VS KKR: అంతా డికాకే చేశాడు.. తప్పులు ఒప్పుకుంటాం.. రిపీట్‌ చేయం: రియాన్‌ పరాగ్‌

Published Thu, Mar 27 2025 9:32 AM | Last Updated on Thu, Mar 27 2025 10:58 AM

IPL 2025: Rajasthan Royals Captain Riyan Parag Comments After Losing To KKR

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా కేకేఆర్‌తో నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో ఘెర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌లో చేతులెత్తేసింది. ఆతర్వాత స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్‌ అతి కష్టం మీద 151 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేయగలిగింది. బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌పై కేకేఆర్‌ బౌలర్లు చెలరేగిపోయారు. మొయిన్‌ అలీ (4-0-23-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్‌ రాణా (4-0-36-2), వైభవ్‌ అరోరా (4-0-33-2) అద్భుతంగా బౌలింగ్‌ చేసి రాయల్స్‌ బ్యాటర్లను కట్టడి చేశారు.

రాయల్స్‌ బ్యాటర్లలో ధృవ్‌ జురెల్‌ (33) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. జైస్వాల్‌ 29, రియాన్‌ పరాగ్‌ 25, సంజూ శాంసన్‌ 13, జోఫ్రా ఆర్చర్‌ 16 పరుగులు చేశారు. ఇన్నింగ్స్‌ చివర్లో ఆర్చర్‌ 2 సిక్సర్లు బాదడంతో రాయల్స్‌ 150 పరుగుల మార్కును తాకగలిగింది.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్‌ను క్వింటన్‌ డికాక్‌ ఒంటిచేత్తో గెలిపించాడు. డికాక్‌ 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 97 పరుగులు (నాటౌట్‌) చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. డికాక్‌ మరో ఎండ్‌ నుంచి రహానే (18), రఘువంశీ (22 నాటౌట్‌) సహకారం తీసుకుని మ్యాచ్‌ను ముగించాడు. 

డికాక్‌ రెచ్చిపోవడంతో మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు రాయల్స్‌ ఏ ఒక్క అవకాశం రాలేదు. డికాక్‌ బాధ్యతాయుతంగా ఆడి రాయల్స్‌ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. రాయల్స్‌ కెప్టెన్‌ ఏడుగురు బౌలర్లను ప్రయోగించినా ఎలాంటి ఉపయోగం​ లేదు. ఒక్కరు కూడా డికాక్‌ను కంట్రోల్‌ చేయలేకపోయారు.

వాస్తవానికి రాయల్స్‌ బ్యాటింగ్‌ చేసే సమయంలోనే మ్యాచ్‌ను కోల్పోయింది. ఆ జట్టు కనీసం 170-180 పరుగులు చేసుండాల్సింది. కేకేఆర్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, వరుణ్‌ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. కేకేఆర్‌ గెలుపుకు వీరు ఆదిలోనే బీజం వేశారు.

మ్యాచ్‌ అనంతరం లూజింగ్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 170 పరుగులు స్కోర్‌ చేసుంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. వ్యక్తిగతంగా నాకు ఈ వికెట్ (గౌహతి పిచ్‌) గురించి తెలుసు కాబట్టి కాస్త తొందరపడ్డాను. వేగంగా పరుగులు సాధించే క్రమంలో నేను చేయాల్సిన దాని కంటే 20 పరుగులు తక్కువ చేశాను. నేను అదనంగా 20 పరుగులు చేసుంటే బౌలర్లకు ఫైటింగ్‌ చేసే అవకాశం ఉండేది.

డికాక్‌ అద్భుతంగా ఆడాడు. అతన్ని త్వరగా ఔట్‌ చేయాలన్నదే మా ప్రణాళిక. కానీ అది జరగలేదు. మిడిల్ ఓవర్లలోనైనా మ్యాచ్‌ను మా నియంత్రణలోకి తెచ్చుకుందామనుకున్నాము. అదీ జరగలేదు. డికాక్‌ మాకు ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా ఒంటిచేత్తో మ్యాచ్‌నులాగేసుకున్నాడు. 

3వ స్థానంలో బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. గత సీజన్‌లో జట్టు నన్ను 4వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని కోరింది. అలాగే చేశాను. ఈ సీజన్‌లో మేనేజ్‌మెంట్‌ నన్ను 3వ స్థానంలో బ్యాటింగ్ చేయమంది. జట్టు అవసరాల కోసం ఎక్కడ బ్యాటింగ్‌ చేసేందుకైనా నేను సిద్దంగా ఉండాలి.

గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో మాకు యువ జట్టు ఉంది. మేము చిన్న దశల్లో బాగా రాణిస్తున్నాము. దీన్నే మ్యాచ్‌ మొత్తంలో కొనసాగిస్తే ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయి. ఈ పరాజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాము. మా తప్పులను ఒప్పుకుంటాము. వాటిని మళ్ళీ పునరావృతం చేయకుండా చూసుకుంటాము. కొత్త ఆలోచనలతో చెన్నైతో మ్యాచ్‌లో బరిలో నిలుస్తాము.

కాగా, రియాన్‌ సారథ్యంలో రాయల్స్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ పూర్తిగా ఫిట్‌గా లేకపోవడంతో రియాన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. కెప్టెన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రియాన్‌ను ఇంకో అవకాశం ఉంది. నాలుగో​ మ్యాచ్‌ నుంచి శాంసన్‌ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడు. రాయల్స్‌ మార్చి 30న ఇదే గౌహతిలో సీఎస్‌కేతో తలపడనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement