
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. ఈ సీజన్‌లో ఆ జట్టు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో వరుస విజయాలతో దూసుకుపోతూ ప్లే ఆఫ్స్‌కు చేరువైంది.
ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు (15 పాయింట్లు) సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉన్నా ఇప్పటివరకు టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కింగ్స్ కూడా ఒకటి. ఈ జట్టు 2014 సీజన్‌లో అత్యుత్తమంగా ఫైనల్‌కు చేరింది. 17 ఏళ్ల ప్రస్తానంలో పంజాబ్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఏకైక సారి.
కాగా, 2014 సీజన్ తరహాలోనే పంజాబ్ ఈ సీజన్‌లోనూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ సీజన్ తర్వాత తొలిసారి ఈ సీజన్‌లోనే 15 పాయింట్లు సాధించింది. నాడు (2014) టేబుల్ టాపర్‌గా నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరిన పంజాబ్.. ఫైనల్లో కేకేఆర్ చేతిలో పరాజయంపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఆ సీజన్‌లోలాగే పంజాబ్ ఈ సీజన్‌లోనూ పటిష్టంగా కనిపిస్తూ సామర్థ్యం మేరకు రాణిస్తుంది. ఇదే ఊపును మున్ముందు జరుగబోయే మ్యాచ్‌ల్లో కొనసాగిస్తే పంజాబ్ తమ తొలి టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.
శ్రేయస్ అయ్యర్ రాకతో ఈ సీజన్‌లో పంజాబ్ ఫేట్ మారినట్లు స్పష్టమవుతుంది. గతంలో ఎన్నడూ లేనట్లు ఆ జట్టు ప్రతి మ్యాచ్‌లో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. పంజాబ్ ఈ సీజన్‌లో సక్సెస్ సాధించడంలో ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.
పాంటింగ్ ఆథ్వర్యంలో ప్రతి పంజాబ్ ఆటగాళ్లు ఉరకలేస్తున్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ బ్యాటింగ్ విభాగం అన్ని జట్ల కంటే పటిష్టంగా ఉంది. మెగా వేలంలో పాంటింగ్ కీలకంగా వ్యవహరించి ప్రియాంశ్ ఆర్య లాంటి యువ టాలెంట్‌ను అక్కున చేర్చుకున్నాడు. ఈ సీజన్‌లో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ విశేషంగా రాణిస్తున్నాడు. మెగా వేలానికి ముందు పంజాబ్ సిమ్రన్‌ను అట్టిపెట్టుకుంది. ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకానికి సిమ్రన్ న్యాయం చేస్తున్నాడు.
మెగా వేలంలో రికార్డు ధర పెట్టి సొంతం చేసుకున్న శ్రేయస్ అయ్యర్ వ్యక్తిగతంగా రాణించడమే కాకుండా కెప్టెన్‌గా కూడా విజయవంతమవుతున్నాడు. పంజాబ్ యాజమాన్యం ఎంతో నమ్మకంతో అట్టిపెట్టుకున్న శశాంక్ సింగ్, నేహల్ వధేరా ఓ మోస్తరు చేస్తూ పర్వాలేదనిపిస్తున్నారు.
ఈ సీజన్‌లో పంజాబ్ విజయాల్లో బౌలర్లు ప్రధానపాత్ర పోషించారు. అర్షదీప్ పైసా వసూల్ ప్రదర్శనలు చేస్తుండగా.. చహల్, జన్సెన్ సామర్థ్యం మేరకు రాణిస్తున్నారు.మొత్తంగా చూస్తే ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఛాంపియన్ అయ్యేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
ఫామ్ లేమితో బాధపడుతున్న మ్యాక్స్‌వెల్ గాయం కారణంగా వైదొలగడం కూడా పంజాబ్‌కు కలిసొచ్చే అంశమే. అతడి స్థానంలో మరో విధ్వంసకర బ్యాటర్ మిచెల్ ఓవెన్‌ను అక్కున చేర్చుకుంది పంజాబ్ మేనేజ్‌మెంట్. ఆసీస్ ఆటగాళ్లు స్టోయినిస్, ఇంగ్లిస్ సామర్థ్యం మేరకు రాణిస్తే ఈ సీజన్‌లో పంజాబ్ టైటిల్ గెలవడాన్ని ఎవరూ ఆపలేరు.
2014 తర్వాత సీజన్ల వారీగా పంజాబ్ పాయింట్లు
2015- 6 పాయింట్లు
2016- 8
2017- 14
2018- 12
2019- 12
2020- 12
2021- 12
2022- 14
2023- 12
2024- 10
2025- 15*