
10 వికెట్లతో గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు చేరిన టైటాన్స్
గుజరాత్ గెలుపుతో బెంగళూరు, పంజాబ్ కూడా ‘ప్లే ఆఫ్స్’కు అర్హత
సాయి సుదర్శన్ సూపర్ సెంచరీ
రాణించిన శుబ్‌మన్ గిల్
కేఎల్ రాహుల్ శతకం వృథా
200 పరుగుల లక్ష్యం. ఛేదించే జట్టుకు ఏమాత్రం సులువు కానేకాదు. కానీ ఇద్దరే ఇద్దరు... గుజరాత్ ఓపెనర్లు దంచేశారు. అంతపెద్ద లక్ష్యాన్ని సులువుగా కరిగించేశారు. సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ పోటీపడ్డారు. పరుగు పెట్టేందుకు... ఫోర్లు బాదేందుకు... సిక్సర్లు కొట్టేందుకు ఇలా ప్రతిదానికి ఆఖరుదాకా పోటీపడి మరీ సాధించడంతో కఠిన లక్ష్యం కూడా ఓ ఓవర్‌కు ముందే కరిగిపోయింది.
అంత చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమితో కుంగిపోయింది. అంతేకాదు గుజరాత్ దర్జాగా సాధించిన విజయంతో తమతోపాటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లను కూడా ‘ప్లే ఆఫ్స్’కు తీసుకెళ్లింది. ఇక మిగిలింది ఒకే ఒక్క బెర్త్. దీని కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కాచుకున్నాయి. మరి ఆఖరి బెర్త్ ఎవరిని వరిస్తుందో చూడాలి.
న్యూఢిల్లీ: ఓపెనర్ల గర్జనతో గుజరాత్ టైటిల్స్ దర్జాగా ఐపీఎల్ 18వ సీజన్‌లో ప్లే ఆఫ్స్ దశకు అర్హత సంపాదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఢిల్లీ బౌలింగ్‌ను దంచికొట్టారు. దీంతో టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. అర్షద్, ప్రసిధ్‌కృష్ణ, సాయికిషోర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 205 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ అజేయంగా, ఆకాశమే హద్దుగా చెలరేగారు. నెల నిషేధం ముగియడంతో గుజరాత్ తరఫున రబడ ఈ మ్యాచ్ బరిలోకి దిగాడు.
రాహుల్ 112 నాటౌట్
క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభం నుంచి ఆఖరుదాకా నడిపించింది... పరుగులు రాబట్టింది ఒకే ఒక్కడు రాహుల్. డుప్లెసిస్ (5)తో ఓపెనింగ్ వికెట్ ఎంతోసేపు నిలబడలేదు. ఆరంభంలో స్కోరులో ఏమాత్రం జోరు లేదు. 5 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 28/1. పవర్‌ప్లేలో కనీసం బంతికో పరుగైనా చేయలేదు. అయితే ఆరో ఓవర్లో రాహుల్ రెండు సిక్స్‌లు, ఓ బౌండరీ బాదడంతో క్యాపిటల్స్ 45/1 స్కోరుతో కోలుకుంది. అభిషేక్ పొరెల్ (19 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అడపాదడపా భారీషాట్లు బాదాడు. రాహుల్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. రబడ 11వ ఓవర్లో పొరెల్, రాహుల్ చెరో సిక్సర్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి.
దీంతో మరుసటి ఓవర్లోనే క్యాపిటల్స్ 100 మార్క్‌ను దాటింది. కానీ ఆఖరి బంతికి పొరెల్ వికెట్‌ను కోల్పోయింది. దీంతో రెండో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి కెపె్టన్ అక్షర్ పటేల్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) రాగా... రాహుల్ ధాటిని పెంచాడు. 14వ ఓవర్లో వరుసగా 3 బౌండరీలు కొట్టాడు. అక్షర్ కూడా 4, 6తో దంచేపనిలో పడ్డాడు కానీ మరుసటి ఓవర్లోనే ప్రసి«ద్‌కృష్ణకు వికెట్ సమరి్పంచుకున్నాడు. 19వ ఓవర్లో 6, 4 బాదిన రాహుల్ 60 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. స్టబ్స్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్స్‌లు) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు.
ఆరంభం నుంచే ధనాధన్
తొలి ఓవర్లో సాయి సుదర్శన్ బౌండరీతో శుబ్‌మన్ సిక్స్‌తో తమ ఖాతా తెరవడం ద్వారా లక్ష్యానికి దీటైన ఆరంభమిచ్చారు. నటరాజన్ వేసిన రెండో ఓవర్‌ను సుదర్శన్ 6, 4, 4, 0, 2, 4లతో చితగ్గొట్టాడు. దీంతో 20 పరుగులు వచ్చాయి. అక్షర్ మూడో ఓవర్లో మరో రెండు బౌండరీలు బాదాడు. టైటాన్స్ 6 ఓవర్లలో 59/0 స్కోరు చేసింది. ఆ తర్వాత కూడా ఇద్దరు చక్కని సమన్వయంతో ఆడటంతో పరుగులకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. ఈ క్రమంలో మొదట సుదర్శన్ 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 93/0 స్కోరు చేసింది.
ఇక మిగిలిన 10 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సిన దశలోనూ ఓపెనింగ్ జోడీ పరుగుల పయనం సాఫీగా సాగిపోయింది. దీంతో ఓవర్లు గడిచేకొద్దీ ఢిల్లీ బౌలర్లు కాస్తా డీలా బౌలర్లుగా మారిపోయారు. 33 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ పూర్తవగా జట్టు స్కోరు 15వ ఓవర్లో 150 దాటింది. ఇక 30 బంతుల్లో 46 పరుగుల సమీకరణంతోనే... చేతిలో పది వికెట్లున్న టైటాన్స్ చేతుల్లోకే మ్యాచ్ వచ్చేసింది. ఈ లాంఛనాన్ని మరో బ్యాటర్‌కు ఇవ్వకుండా ఓపెనర్లే పూర్తి చేశారు. భారీ సిక్సర్‌తో సాయి సుదర్శన్ 56 బంతుల్లో సెంచరీ సాధించగా, చూడచక్కని బౌండరీలతో గిల్ కూడా శతకానికి చేరువయ్యాడు. కానీ ఈ లోపే 200 పరుగుల పెద్ద లక్ష్యం 19వ ఓవర్లోనే దిగిరావడంతో అతని సెంచరీకి అవకాశం లేకుండాపోయింది.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 112; డుప్లెసిస్ (సి) సిరాజ్ (బి) అర్షద్ 5; పోరెల్ (సి) బట్లర్ (బి) సాయికిషోర్ 30; అక్షర్ (సి) సాయికిషోర్ (బి) ప్రసిధ్ కృష్ణ 25; స్టబ్స్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199.
వికెట్ల పతనం: 1–16, 2–106, 3–151.
బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, అర్షద్ ఖాన్ 2–0–7–1, రబడా 2–0–34–0, ప్రసిద్‌కృష్ణ 4–0–40–1, రషీద్ ఖాన్ 4–0–32–0, సాయికిషోర్ 4–0–47–1.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (నాటౌట్) 108; శుబ్‌మన్ గిల్ (నాటౌట్) 93; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 205.
బౌలింగ్: అక్షర్ పటేల్ 3–0–35–0, నటరాజన్ 3–0–49–0, ముస్తాఫిజుర్ 3–0–24–0, చమీర 2–0–22–0, విప్రాజ్ 4–0–37–0, కుల్దీప్ 4–0–37–0.