
Photo Courtesy: BCCI
'అపరేషన్ సిందూర్' తర్వాత భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సజావుగా కొనసాగడం అనుమానంగా మారింది. షెడ్యూల్ ప్రకారం లీగ్ కొనసాగుతుందని బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చెబుతున్నా.. అభిమానుల్లో ఏదో తెలీని గందరగోళం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు జరగాలంటే జట్లు వేర్వేరు వేదికలు తిరుగుతూ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
అయితే పాక్ దాడులకు పాల్పడవచ్చన్న అనుమానంతో భారత ప్రభుత్వం దేశంలో పలు విమానాశ్రయాలను మూసి వేయించింది. ఇందులో ఐపీఎల్ మ్యాచ్‌లకు వేదికలైన చండీఘడ్, ధర్మశాల ఉన్నాయి. ఈ క్రమంలో మే 11న ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ అహ్మదాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది.
తాజాగా ఓ వార్త ఐపీఎల్ వర్గాల్లో కలకలం రేపుతుంది. మే 16న జైపూర్‌లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరగాల్సిన పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సువాయ్ మాన్ సింగ్ స్టేడియంను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు. ఈ ఈ-మెయిల్ ఇవాళ (మే 8) ఉదయం 9:13 గంటల సమయంలో వచ్చింది.
వెంటనే అలర్ట్ అయిన రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్ పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు స్టేడియంను ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్‌లు, తనిఖీ యూనిట్లతో స్టేడియంను జల్లెడ పట్టారు. స్టేడియంలో ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, నిన్న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు కూడా ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. స్టేడియంను పేల్చి వేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. అయితే పోలీసులు వెంటనే అలర్టై మ్యాచ్‌ను సజావుగా సాగేలా చూశారు. నిన్న ఈడెన్ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్, సీఎస్‌కే తలపడ్డాయి. వరుసగా రెండు రోజులు ఐపీఎల్ వేదికలకు బాంబు బెదిరింపులు రావడాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సీరియస్‌గా తీసుకుంది. మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కలగకుండా సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంది.
మరోవైపు భారత దళాలు పాక్‌లోని రావల్పిండి స్టేడియంపై చేసిన డ్రోన్ దాడి కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. లీగ్‌లో భాగంగా ఇవాళ బాబర్ ఆజం కెప్టెన్సీలోని పెషావర్ జల్మీ- డేవిడ్ వార్నర్ సారథ్యంలోని కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. డ్రోన్ దాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. పాక్ క్రికెట్ బోర్డు క్రికెటర్లను రావల్పిండి విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలుస్తుంది.
కాగా, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి బదులుగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భారత దళాలు పాక్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేస్తున్నాయి. మంగళవారం జరిగిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతూ ఉంది.