Sakshi News home page

ముంబై ‘మూడు’పోయింది

Published Tue, Apr 2 2024 12:47 AM

IPL 2024: MI vs RR: Pressure piles up on Hardik Pandya as Mumbai lose 3 in a row - Sakshi

వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమి

రాజస్తాన్‌ ‘హ్యాట్రిక్‌’ విజయం

గెలిపించిన బౌల్ట్, చహల్, పరాగ్‌

ముంబై ఇన్నింగ్స్‌... తొలి 21 బంతుల్లో 20 పరుగులు, 4 వికెట్లు... ఇందులో రోహిత్‌ శర్మ సహా ముగ్గురు తొలి బంతికే డకౌట్‌... ముంబై ఇన్నింగ్స్‌ మొదలవడంతోనే ముగిసినట్లు అనిపించింది... బౌల్ట్‌ కొట్టిన ఈ దెబ్బ తర్వాత కొంత కోలుకున్నా 125 పరుగుల స్కోరు ఏమాత్రం సరిపోలేదు... రాజస్తాన్‌ రాయల్స్‌ అలవోకగా మరో 27 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించేసింది... సొంతగడ్డపై కూడా బోణీ చేయలేకపోయిన ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో ఇంకా గెలుపు ఖాతా తెరవని ఏకైక జట్టుగా నిలిచింది.  

అభిమానులు...అదే తీరు! 
హార్దిక్‌ పాండ్యాకు ముంబై సొంత మైదానం వాంఖెడేలోనూ ఫ్యాన్స్‌ నుంచి నిరసన ఎదురైంది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ఆగ్రహంగా ఉన్న అభిమానులు గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే ఈసారి కూడా పాండ్యా పేరు వినిపించినప్పుడల్లా గేలి చేశారు. టాస్‌కు వచ్చినప్పుడు మాట్లాడకుండా అంతరాయం కలిగించారు. చివరకు వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ ‘మర్యాద పాటించండి’ అని చెప్పినా జనం పట్టించుకోలేదు. అనంతరం ముంబై ఫీల్డింగ్‌ సమయంలో ఒక అభిమాని నేరుగా గ్రౌండ్‌లో రోహిత్‌ వద్దకు వెళ్లి కౌగిలించుకోవడం భద్రతా సిబ్బంది వైఫల్యాన్ని చూపించింది. అనూహ్యంగా దూసుకొచి్చన ఫ్యాన్‌ రోహిత్‌ కూడా ఒక్కసారిగా భయపడిపోయాడు!   

ముంబై: ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో పరాజయాల ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమి పాలైంది. సోమవారం జరిగిన పోరులో రాజస్తాన్‌ రాయల్స్‌ 6 వికెట్ల తేడాతో ముంబైను ఓడించి విజయాల ‘హ్యాట్రిక్‌’ సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. హార్దిక్‌ పాండ్యా (21 బంతుల్లో 34; 6 ఫోర్లు), తిలక్‌ వర్మ (29 బంతుల్లో 32; 2 సిక్స్‌లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ట్రెంట్‌ బౌల్ట్‌ (3/22) పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఆరంభంలోనే దెబ్బ తీయగా... చహల్‌కు కూడా 3 వికెట్లు దక్కాయి. అనంతరం రాజస్తాన్‌ 15.3 ఓవర్లలో 4 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. రియాన్‌ పరాగ్‌ (39 బంతుల్లో 54 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో గెలిపించాడు. 

టపటపా... 
రాజస్తాన్‌ బౌలింగ్‌ ధాటికి ముంబై బ్యాటింగ్‌ ఆరంభంలోనే కకావికలమైంది. బౌల్ట్‌ ధాటికి రోహిత్‌ శర్మ (0) తొలి బంతికే అవుట్‌ కాగా, తర్వాతి బంతికే నమన్‌ ధీర్‌ (0) వెనుదిరిగాడు. ఐపీఎల్‌లో అతి ‘తొందరగా’ రెండో ఓవర్లోనే ఇంపాక్ట్‌ సబ్‌గా వచ్చిన బ్రెవిస్‌ (0) కూడా తన తొలి బంతికే పెవిలియన్‌ చేరాడు. మరోవైపు ఇషాన్‌ కిషన్‌ (16) వికెట్‌ బర్గర్‌ ఖాతాలో పడింది. స్కోరు 20/4కు చేరిన దశలో తిలక్, పాండ్యా కొద్దిసేపు నిలిచి జట్టును ఆదుకున్నారు. బర్గర్‌ ఓవర్లో 3 ఫోర్లతో పాండ్యా ధాటిని ప్రదర్శించాడు. అయితే ఐదో వికెట్‌కు 36 బంతుల్లో 56 పరుగులు జోడించిన తర్వాత ముంబైని చహల్‌ దెబ్బ తీశాడు. తక్కువ వ్యవధిలో అతను పాండ్యా, తిలక్‌లను అవుట్‌ చేయడంతో ముంబై పరిస్థితి మరింత దిగజారింది. తిలక్‌ వెనుదిరిగాక జట్టు కోలుకోలేకపోయింది. అతను అవుటైన తర్వాత 40 బంతుల్లో 30 పరుగులే వచ్చాయి. టిమ్‌ డేవిడ్‌ (17) కూడా ప్రభావం చూపలేకపోయాడు.  

రాణించిన పరాగ్‌... 
లక్ష్యం చిన్నదే అయినా రాయల్స్‌ ఇన్నింగ్స్‌ కాస్త తడబాటుకు లోనైంది. తొలి ఓవర్లోనే యశస్వి (10) వెనుదిరగ్గా... సంజూ సామ్సన్‌ (12), బట్లర్‌ (13) కూడా విఫలమయ్యారు. అయితే పరాగ్‌ జాగ్రత్తగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. అశి్వన్‌ (16)తో కలిసి అతను ఐదో వికెట్‌కు 40 పరుగులు జత చేశాడు. విజయానికి 15 పరుగులు కావాల్సిన దశలో పరాగ్‌ వరుసగా 6, 6, 4 బాది ముగించాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. 

స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి) సామ్సన్‌ (బి) బర్గర్‌ 16; రోహిత్‌ (సి) సామ్సన్‌ (బి) బౌల్ట్‌ 0; నమన్‌ (ఎల్బీ) (బి) బౌల్ట్‌ 0; బ్రెవిస్‌ (సి) బర్గర్‌ (బి) బౌల్ట్‌ 0; తిలక్‌ (సి) అశ్విన్‌ (బి) చహల్‌ 32; పాండ్యా (సి) (సబ్‌) పావెల్‌ (బి) చహల్‌ 34; చావ్లా (సి) హెట్‌మైర్‌ (బి) అవేశ్‌ 3; డేవిడ్‌ (సి) బౌల్ట్‌ (బి) బర్గర్‌ 17; కొయెట్జీ (సి) హెట్‌మైర్‌ (బి) చహల్‌ 4; బుమ్రా (నాటౌట్‌) 8; ఆకాశ్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–14, 4–20, 5–76, 6–83, 7–95, 8–111, 9–114. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–22–3, బర్గర్‌ 4–0–32–2, అవేశ్‌ ఖాన్‌ 4–0–30–1, చహల్‌ 4–0–11–3, అశ్విన్‌ 4–0–27–0. 

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) డేవిడ్‌ (బి) మఫాకా 10; బట్లర్‌ (సి) చావ్లా (బి) ఆకాశ్‌ 13; సామ్సన్‌ (బి) ఆకాశ్‌ 12; పరాగ్‌ (నాటౌట్‌) 54; అశ్విన్‌ (సి) తిలక్‌ (బి) ఆకాశ్‌ 16; శుభమ్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (15.3 ఓవర్లలో 4 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–10, 2–42, 3–48, 4–88. బౌలింగ్‌: మఫాకా 2–0–23–1, బుమ్రా 4–0–26–0, ఆకాశ్‌ మధ్వాల్‌ 4–0–20–3, కొయెట్జీ 2.3–0–36–0, పీయూష్‌ చావ్లా 3–0–18–0.

Advertisement
Advertisement