IPL 2023: నేను చూసుకుంటాను.. శ్రీలంక క్రికెటర్‌ కుటుంబానికి భరోసా ఇచ్చిన ధోని

IPL 2023: MS Dhoni Meets Matheesha Pathirana Family - Sakshi

ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన యువ పేసర్‌, జూనియర్‌ మలింగగా పిలువబడే శ్రీలంక చిన్నోడు మతీష పతిరణకు, అతని కుటుంబానికి జట్టు సారధి మహేంద్ర సింగ్‌ ధోని భరోసా ఇచ్చాడు. గురువారం (మే 25) పతిరణ, అతని కుటుంబ సభ్యులు చెన్నైలో ధోనిని కలిసిన సందర్భంగా ఈ హామీ ఇచ్చాడు. ఈ విషయాన్ని పతిరణ సోదరి, ధోనికి వీరాభిమాని అయిన విషుక పతిరణ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. మల్లి (పతిరణను కుటుంబ సభ్యులు ముద్దుగా పిలుచుకునే పేరు) సేఫ్‌ హ్యాండ్స్‌లో ఉన్నాడని ఆమె కామెంట్‌ చేసింది. ధోనిని కలిసిన క్షణాలు నేను కలలుగన్న దానికి మించి ఉన్నాయని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

కాగా, పతిరణ అతని కుటుంబ సభ్యులు ధోనిని చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో కలిసారు. ఈ సందర్భంగా పతిరణ తన కుటుంబ సభ్యులను ధోనికి పరిచయం చేశాడు. ఐపీఎల్‌ కోసం పతిరణ (20) కుటుంబాన్ని వదిలి భారత్‌లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు గమనించిన ధోని వారికి భరోసా ఇచ్చాడు. పతిరణ గురించి మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతనెప్పుడూ నాతోనే ఉంటాడు. నేను చూసుకుంటాను అంటూ ధైర్యం చెప్పాడు. 

ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. మే 28న జరిగే ఫైనల్లో ధోని సేన.. గుజరాత్‌ వర్సెస్‌ముంబై మ్యాచ్‌ (క్వాలిఫయర్‌ 2) విజేతతో తలపడుతుంది. ఫైనల్లో సీఎస్‌కే గెలిస్తే ముంబైతో సమానంగా ఐదు ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచిన జట్టుగా చరిత్రలో నిలుస్తుంది. రికార్డు స్థాయిలో 10వ సారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన ధోని అండ్‌ కో ఫైనల్లో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ధోనికి ఇది చివరి సీజన్‌ అని ప్రచారం జరుగుతుండటంతో కోట్లాది మంది అభిమానులు ఆసారి సీఎస్‌కేనే టైటిల్‌ గెలవాలని కోరుకుంటున్నారు.

చదవండి: కేఎస్‌ భరతా.. ఇషాన్‌ కిషనా..? డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్‌కీపర్‌ ఎవరు..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top