MS Dhoni: కొట్టిన బంతిని చూసిన పాపాన పోలేదు.!

IPL 2023: MS Dhoni Hits No-Look Six during CSK Practice Session  - Sakshi

టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని ప్రస్తుతం ఐపీఎల్‌ 2023కి సమాయత్తమవుతున్నాడు. సీఎస్‌కేను ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోని.. తనకిది చివరి ఐపీఎల్‌ అని భావిస్తున్న తరుణంలో సీఎస్‌కే టైటిల్‌ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న ధోని తన ప్రాక్టీస్‌పై దృష్టి సారించాడు.

జట్టులో ఉన్న ఆటగాళ్ల కంటే ముందే వచ్చిన ధోని క్రమం తప్పకుండా మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. గత మూడు సీజన్లుగా బ్యాటర్‌గా విఫలమవుతున్న ధోని చివరి సీజన్‌ అని భావిస్తున్న తరుణంలో ధోని బ్యాట్‌తో మెరవాలని ప్రతీ అభిమాని ఆకాంక్షిస్తున్నాడు. మార్చి 31న మొదలుకానున్న ఐపీఎల్‌ 16వ సీజన్‌లో తొలి మ్యాచ్‌ సీఎస్‌కే , డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరగనుంది. 

ధోని సిక్స్‌ కొడితే గ్రౌండ్‌ అవతల పడడం ఖాయం. ఇప్పటికే ప్రాక్టీస్‌లో భారీ షాట్లతో విరుచుకుపడిన ధోని తాజాగా సిక్స్‌ కొట్టిన తర్వాత కనీసం బంతిని చూసిన పాపాన పోలేదు. అతను తాను కొట్టిన సిక్సర్‌పై ఎంత నమ్మకంగా ఉన్నాడనేది దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. మార్చి 14న(మంగళవారం) చెన్నై స్టేడియంలో సాయంత్రం ప్రాక్టీస్‌ చేసిన ధోని బంతి పడిందే ఆలస్యం.. బ్యాట్‌ ఎడ్జ్‌ను ఆనించి భారీ షాట్‌ ఆడాడు. అయితే బంతి పైకి వెళ్లిన తరుణంలో అతని కళ్లు మాత్రం కిందనే ఉన్నాయి. ఆ తర్వాత కాసేపటికి పైకి చూశాడు. అప్పటికే బంతి గ్రౌండ్‌ బయట పడింది. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్‌కే తన ట్విటర్‌లో షేర్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక గతేడాది ఐపీఎల్‌లో సీఎస్‌కే అంతగా ఆకట్టుకోలేకోపోయింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచిన సీఎస్‌కే పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే సీజన్‌ మొదట్లో జడేజా జట్టును నడిపించాడు. అయితే కెప్టెన్సీ ఒత్తిడిని భరించలేని జడ్డూ.. పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో సీఎస్‌కే మరోసారి ధోనికే బాధ్యతలు అప్పగించింది. అయితే అప్పటికే జట్టుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈసారి కొత్తగా ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ జట్టులోకి రావడంతో సీఎస్‌కే బలంగా కనిపిస్తుంది. అయితే ఈసారి ధోని స్థానంలో బెన్‌ స్టోక్స్‌ జట్టును నడిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

చదవండి: వైరల్‌గా మారిన రిషబ్‌ పంత్‌ చర్య

వరుస ఓటములు బాధిస్తున్నా.. ఆకట్టుకున్న ఆసీస్‌ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top