IPL 2023 Mini Auction: యువ బ్యాటర్‌ కోసం సంజూ శాంసన్‌ ప్లాన్‌! కేరళ ఆటగాడిపై రాజస్తాన్‌ కన్ను!

IPL 2023 Mini Auction: Sanju Samson Big Heart Comes to Kunnummal Aid - Sakshi

IPL 2023 Mini Auction- Sanju Samson: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్కసారి ఈ లీగ్‌లో ప్రతిభ నిరూపించుకుంటే చాలు జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించవచ్చనే నమ్మకాన్ని ఇచ్చింది. దినేశ్‌ కార్తిక్‌ వంటి వెటరన్‌ ప్లేయర్ల పునరాగమనానికైనా.. ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ వంటి యువ ఆటగాళ్ల ఎంట్రీకైనా మార్గం సుగమం చేసింది. అందుకే ఈ మెగా ఈవెంట్‌లో ఆడే అవకాశం రావాలని చాలా మంది ఆటగాళ్లు కోరుకుంటారు. 


ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌

కేరళ యువ సంచలనం
కేరళ బ్యాటర్‌ రోహన్‌ కన్నుమ్మల్ కూడా ఈ కోవకు చెందినవాడే. దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న ఈ యువ ప్లేయర్‌.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో భాగం కావాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ విషయంలో అతడికి అండగా నిలబడ్డాడు టీమిండియా ఆటగాడు, రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌.


రోహన్‌ కన్నుమ్మల్

వరుస సెంచరీలు
దేశవాళీ టోర్నీల్లో కేరళ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగే రోహన్‌.. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. అదే విధంగా సౌత్‌ జోన్‌ తరఫున దులీప్‌ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చిన 24 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌ మరో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా సంప్రదాయ క్రికెట్‌లో 414 పరుగులతో కేరళ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. తద్వారా బంగ్లాదేశ్‌తో తలపడనున్న ఇండియా- ఏ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

ఇదిలా ఉంటే.. డిసెంబరు 23న ఐపీఎల్‌ 2023 మినీ వేలం నేపథ్యంలో ఇప్పటికే పలు జట్లు ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో రోహన్‌ రాజస్తాన్‌ ట్రయల్‌ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ విషయం గురించి అతడు ఓ స్పోర్ట్స్ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ.. సంజూ శాంసన్‌ తనకు సాయం చేశాడని పేర్కొన్నాడు.


సంజూ శాంసన్‌

‘‘కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి నాకు రెండుమూడు సార్లు కాల్స్‌ వచ్చాయి. అయితే, రాష్ట్ర స్థాయి ఈవెంట్ల కారణంగా నేను ట్రయల్స్‌కు హాజరుకాలేకపోయాను. అయితే, సంజూ శాంసన్‌ పట్టుబట్టి మరీ నాతో పాటు మరికొంత మంది కేరళ ఆటగాళ్లను రాజస్తాన్‌ రాయల్స్‌ ట్రయల్స్‌కు తీసుకెళ్లాడు.

రాజస్తాన్‌, ఢిల్లీ జట్ల ట్రయల్‌ ఈవెంట్‌లో సంతృప్తికర ప్రదర్శన ఇచ్చాను. ఇక వేలంలో నన్ను ఎవరైనా కొంటారా లేదా అన్న విషయం తెలియదు. మన చేతుల్లో లేని అంశాల గురించి నేను పెద్దగా ఆలోచించను’’ అని రోహన్‌ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ ఏడాది తనకు సానుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా రాజస్తాన్‌ కెప్టెన్‌గా సంజూ ఉన్న నేపథ్యంలో యువ సంచలనం రోహన్‌ను ఆ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ రాణించగల ఈ యంగ్‌ టాలెంట్‌ను దక్కించుకునేందుకు ఆర్‌ఆర్‌ భారీ మొత్తం వెచ్చించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చదవండి: IPL 2023: 'వచ్చే ప్రపంచకప్‌ టోర్నీలోనైనా గెలవాలంటే ఐపీఎల్‌ ఆడడం మానేయండి'.. లేకుంటే
Abu Dhabi T10: వరల్డ్‌ కప్‌లో తుస్సుమనిపించాడు.. అక్కడ మాత్రం విధ్వంసం! కేవలం 32 బంతుల్లోనే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top