IPL 2022: ముంబైతో తలపడనున్న సీఎస్‌కే.. నిలవాలంటే గెలవాలి..!

IPL 2022: CSK VS MI Match Prediction - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లే​ ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇవాళ (మే 12) ముంబై ఇండియన్స్‌తో జరిగే కీలక పోరులో తప్పక గెలవాల్సి ఉంది. ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచినా, ఓడినా ఒరిగేదేమీ లేకపోగా, సీఎస్‌కే ఓడితే మాత్రం ప్యాకప్‌ చెప్పాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 9 పరాజయాలతో లీగ్‌ నుంచి ఇదివరకే నిష్క్రమించగా, సీఎస్‌కే.. 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. 

ప్లే ఆఫ్స్‌కు చేరబోయే 4 జట్లలో గుజరాత్‌ టైటాన్స్‌ తొలి బెర్తు కన్ఫర్మ్‌ చేసుకోగా, మిగిలిన 3 స్థానాల కోసం లక్నో సూపర్ జెయింట్స్ (12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు), రాజస్థాన్ రాయల్స్ (12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు), ఆర్సీబీ (12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు), ఢిల్లీ క్యాపిటల్స్ (12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు), సన్ రైజర్స్ హైదరాబాద్ (11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొనగా.. పంజాబ్‌ (11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), కేకేఆర్‌ (12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), సీఎస్‌కే (11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) జట్లకు సైతం అవకాశాలు లేకపోలేదు. 
 
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 91 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడంతో ప్లే ఆఫ్స్ ఆవకాశాలను సజీవంగా ఉంచుకున్న సీఎస్‌కే.. ముంబై ఇండియన్స్‌తో పాటు మిగిలిన మ్యాచ్‌ల్లో గుజరాత్, రాజస్థాన్ రాయల్స్‌పై భారీ తేడాతో విజయం సాధించగలిగితే సమీకరణలు మారే​ ఛాన్స్‌ ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే భారీ తేడాతో నెగ్గి.. మిగతా జట్లంతా కనీసం రెండు మ్యాచ్‌ల్లో ఓడితే అప్పుడు సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంటుంది. 

ఇక నేటి మ్యాచ్‌ కోసం సీఎస్‌కే ఎలాంటి ప్రయోగాలు చేసే ఆస్కారం లేదు. ఢిల్లీని మట్టికరిపించిన జట్టునే యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. ఓపెనర్లు రుతురాజ్, కాన్వే భీకర ఫామ్‌లో ఉండటం సీఎస్‌కేకు కలిసొచ్చే అంశం. మిడిలార్డర్‌లో ఉతప్ప, రాయుడు, శివం దూబే, మొయిన్‌ అలీ, ధోని చెలరేగితే సీఎస్‌కే ఆపడం ఎవరి తరం కాదు. ముకేశ్‌ చౌదరీ, మహీశ్‌ తీక్షణ, ప్రిటోరియస్‌, మొయిన్‌ అలీ, బ్రావో, సిమ్రన్‌జీత్‌ సింగ్‌లతో ఆ జట్టు బౌలింగ్‌ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. 

తుది జట్లు (అంచనా)..
చెన్నై సూపర్ కింగ్స్‌: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, శివం దూబే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డ్వేన్ బ్రావో, సిమ్రన్‌జీత్‌ సింగ్, మహీశ్‌ తీక్షణ, ముకేష్ చౌదరి. 

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రమణ్‌దీప్ సింగ్, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్‌.
చదవండి: IPL 2022: వచ్చే సీజన్‌కు జడేజా సీఎస్‌కేలో ఉండకపోవచ్చు..!

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top