IPL 2021: ఈసారి టైటిల్‌ నెగ్గేది మేమే: డీసీ స్టార్‌ ప్లేయర్‌

IPL 2021: Steve Smith Believes Delhi Capitals Can Reach Final - Sakshi

దుబాయ్‌: సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచ్‌ల కోసం దుబాయ్‌ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ఆటగాడు, ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. ఇటీవలే క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రస్తుత ఎడిషన్‌లో ఢిల్లీ విజయావకాశాలపై ఆయన స్పందిస్తూ.. ఈసారి తమ జట్టు కచ్చితంగా ఫైనల్‌కు చేరి టైటిల్‌ చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. అయితే, ఇందుకోసం తాము అత్యుత్తమ క్రికెట్‌ను ఆడాల్సి ఉందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అతను శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీపై కూడా స్పందించాడు. అయ్యర్‌ లాంటి నాణ్యమైన ఆటగాడు జట్టులో ఉండడం సానుకూలాంశమని, అతని చేరికతో ఢిల్లీ టాపార్డర్‌కు మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

ఐపీఎల్‌లో ఆడే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమన్నాడు. కాగా, గాయం కారణంగా తొలి దశ ఐపీఎల్‌ 2021కు శ్రేయస్‌ అయ్యర్‌ దూరమవ్వడంతో అతడి స్థానంలో స్మిత్ ఆడిన విషయం తెలిసిందే. మరోవైపు, రిషబ్ పంత్‌ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి దశ మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించింది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టిన పంత్ ఆకట్టుకున్నాడు. దీంతో గాయం నుంచి కోలుకుని అయ్యర్‌ తిరిగి జట్టులోకి వచ్చినా.. అతడికి కెప్టెన్సీ దక్కలేదు. కాగా, అయ్యర్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ గతేడాది ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. డీసీ జట్టు సెకెండ్‌ లెగ్‌ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 22న సన్‌రైజర్స్‌తో ఆడనుంది.
చదవండి:  ప్రేయసి కోసం కష్టపడ్డాడు.. ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించాడు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top