‘సింగిల్‌’ కాంట్రవర్సీపై సంగక్కార

IPL 2021: I Believe Sanju Will Hit 10 Yards Further Next Time, Sangakkara - Sakshi

ముంబై:  పంజాబ్‌ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతిని సిక్స్‌ కొట్టడంలో విఫలమై ఔటైన రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌కు ఆ జట్టు డైరెక్టర్‌ కుమార సంగక్కార మద్దతుగా నిలిచాడు. ప్రధానంగా ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి సింగిల్‌ తీసే అవకాశం ఉన్నా దాన్ని వద్దని తనే స్టైకింగ్‌ తీసుకోవడంపై విమర్శలు  వవ్చాయి. క్రిస్‌ మోరిస్‌కు కూడా బ్యాటింగ్‌ చేయగలడు కదా.. ఆ బంతికి సింగిల్‌ తీసి ఉంటే ఆఖరి బంతిని మోరిస్‌ ఫోర్‌ కొడితే రాజస్తాన్‌ రాయల్స్‌ గెలిచేది కదా అంటూ చాలా మంది పెదవి విరిచారు. సామ్సన్‌ సింగిల్‌కు యత్నించకపోవడాన్ని కామెంటరీ బాక్స్‌లో ఉన్న సైమన్‌ డౌల్‌ కూడా తప్పుబట్టాడు. ‘నేను చూసింది నమ్మలేకపోతున్నా. కనీసం సింగిల్‌ తీసుంటే పరిస్థితి మరోలా ఉండేది.  చివరి బంతిని మోరిస్‌ ఫోర్‌ కొడితే సరిపోయేది’ అంటూ కాస్త సెటైరిక్‌గా మాట్లాడాడు. దానిని అక్కడే ఉన్న సునీల్‌ గావస్కర్‌ ఖండించాడు. 

‘మోరిస్‌ చేయగలడు. కానీ అప్పటివరకూ అతని స్టైక్‌రేట్‌ 50 ఉందనే విషయం గ్రహించాలి. నాలుగు బంతులు ఆడి రెండు పరుగులే తీశాడు’ అని సంజూ నిర్ణయానికి మద్దతుగా నిలిచాడు.  ఇప్పుడు అదే విషయంపై రాజస్తాన్‌ రాయల్స్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ కుమార సంగక్కార మాట్లాడుతూ.. సామ్సన్‌ చేసిన పనిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నాడు. ‘సంజూ తనపై ఉన్న ఆత్మవిశ్వాసంతో అలా చేశాడు. అతను చేయాల్సిందంతా చేశాడు. అతను ఆఖరి బంతికి కొట్టిన షాట్‌ 5-6 యార్డ్‌ల బౌండరీకి ముందు పడింది. నువ్వు ఫామ్‌లో ఉన్నప్పుడు ఆ పని నేను చేయగలను అనే నమ్ముతారు. అందుకే ఆ బాధ్యతను సామ్సన్‌ భుజాన వేసుకున్నాడు.  

ఇక్కడ సంజూ తీసుకున్న నిర్ణయాన్ని నేను  సమర్ధిస్తా. ఆ సింగిల్‌ ఎందుకు తీయలేదనే మనం మాట్లాడుకుంటున్నాం. అది కేవలం ఒక కమిట్‌మెంట్‌తో తీసుకున్న నిర్ణయం. ఎవరి బలం ఏమిటో  వారికి కచ్చితంగా తెలుస్తుంది. ఆ షార్ట్‌ సిక్స్‌కు వెళ్లుంటే పరిస్థితి మరోలా ఉండేది. బౌండరీలైన్‌కు కొద్ది దూరంలోనే  సామ్సన్‌ ఔటయ్యాడు. వచ్చే మ్యాచ్‌ల్లో సామ్సన్‌ ఏమిటో చూపిస్తాడు. ఇప్పుడు ఎలా అయితే ఔటయ్యాడో దాన్ని సరిచేసుకుని  10 యార్డ్‌ల అవతలి పడేలా చేస్తాడు. నాకు సామ్సన్‌పై నమ్మకం ఉంది.. రాజస్తాన్‌కు విజయాలు అందించే సత్తా సామ‍్సన్‌లో ఉంది’ అని సంగక్కార పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top