నాలుగోసారి ‘కింగ్స్‌’

IPL 2021: Chennai Super Kings Win Fourth IPL Title - Sakshi

ఐపీఎల్‌–2021 విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌

నాలుగో టైటిల్‌ గెలుచుకున్న ధోని సేన

ఫైనల్లో కోల్‌కతాపై 27 పరుగులతో గెలుపు

రూ. 20 కోట్లు ప్రైజ్‌మనీ సొంతం

డు ప్లెసిస్‌ మెరుపు బ్యాటింగ్‌

ఐపీఎల్‌లో మళ్లీ ‘విజిల్‌ పొడు’... పసుపు మయమైన దుబాయ్‌ మైదానంలో తమ ఆరాధ్య ఆటగాడు మాహి మళ్లీ ఐపీఎల్‌ ట్రోఫీతో చిరునవ్వులు చిందిస్తుంటే... దసరా రోజున చెన్నై క్రికెట్‌ అభిమానుల పండగ ఆనందం రెట్టింపైంది... అనుభవం, అద్భుత నాయకత్వం వెరసి చెన్నై మరోసారి ధనాధన్‌ లీగ్‌లో తమ విలువేంటో చూపించింది. తుది పోరులో అన్ని రంగాల్లో మెరిసి నాలుగోసారి ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచింది. మెరుపు బ్యాటింగ్‌తో మొదటి భాగంలోనే విజయానికి బాటలు వేసుకున్న జట్టు, బౌలింగ్‌లో కీలక సమయంలో సత్తా చాటి ప్రత్యర్థిని పడగొట్టింది. ఫైనల్‌ పోరులో తమదైన పాత్ర పోషించిన ప్రతీ ప్లేయర్‌ హీరోలుగా నిలిచారు. అటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆరంభంలోనే భారీగా పరుగులు సమరి్పంచుకొని పట్టు కోల్పోయింది. నమ్ముకున్న బౌలర్లంతా విఫలం కాగా... బ్యాటింగ్‌లో టోర్నీ ఆసాంతం వెంటాడిన మిడిలార్డర్‌ వైఫల్యం అసలు సమయంలో పెద్ద దెబ్బ కొట్టింది. ఫలితంగా తమ మూడో ఫైనల్‌ను ఓటమితో ముగించాల్సి వచి్చంది.   

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) నాలుగో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో చెన్నై 27 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (59 బంతుల్లో 86; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా, మొయిన్‌ అలీ (20 బంతుల్లో 37 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రాబిన్‌ ఉతప్ప (15 బంతుల్లో 31; 3 సిక్సర్లు) కీలక ప్రదర్శన చేశారు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌ (43 బంతుల్లో 51; 6 ఫోర్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఒకదశలో 91/0తో లక్ష్యం దిశగా సాగిన జట్టు... 34 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. విజేతగా నిలిచిన చెన్నై జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్‌ కోల్‌కతా జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.  

మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు...
సీజన్‌ మొత్తంలో ఆడిన తరహాలోనే చెన్నైకి మరోసారి ఓపెనర్లు రుతురాజ్, డు ప్లెసిస్‌ శుభారంభం అందించారు. షకీబ్‌ ఓవర్లో రుతురాజ్‌ వరుసగా 4, 6 కొట్టగా, అదృష్టం కలిసొచ్చిన డు ప్లెసిస్‌ ఆ తర్వాత చెలరేగిపోయాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. నరైన్‌ ఈ జోడీని విడదీసిన సమయంలో కోల్‌కతా స్పిన్నర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు అనిపించింది. అయితే మూడో స్థానంలో వచి్చన రాబిన్‌ ఉతప్ప ఉన్న కొద్దిసేపు మెరుపు బ్యాటింగ్‌తో ఆట గమనాన్ని మార్చేశాడు.

మరోవైపు ఫెర్గూసన్‌ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టిన 35 బంతుల్లోనే డు ప్లెసిస్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్‌ బౌలింగ్‌లో ఉతప్ప వెనుదిరిగినా అలీ దూకుడుతో చెన్నై ఇన్నింగ్స్‌లో జోరు తగ్గలేదు. శివమ్‌ మావి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన అలీ, వరుణ్‌ చక్రవర్తి ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్‌ కొట్టాడు. ఫెర్గూసన్‌ ఓవర్లో 19 పరుగులు రాబట్టి కింగ్స్‌ పండగ చేసుకుంది. ఇన్నింగ్స్‌ చివరి బంతికి డు ప్లెసిస్‌ అవుటైనా... మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాల్లో (61, 63, 68) అతను తన పాత్రను సమర్థంగా పోషించాడు.  

ఓపెనర్లు మినహా...
చెన్నైతో పోలిస్తే ఛేదనలో కోల్‌కతా మరింత దూకుడు కనబర్చింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ వరుస బౌండరీలతో జోరును ప్రదర్శించగా, గిల్‌ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహర్, శార్దుల్‌ ఓవర్లలో వెంకటేశ్‌ రెండేసి ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లేలో 55 పరుగులు రాగా, జడేజా ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో సగం ఇన్నింగ్స్‌ ముగిసేసరికి స్కోరు 88 పరుగులకు చేరింది. అయితే ఈ దశలో శార్దుల్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

అతని ఓవర్లో భారీ షాట్‌కు ప్రయతి్నంచిన వెంకటేశ్‌... జడేజా అద్భుత క్యాచ్‌కు వెనుదిరగడంతో తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడగా, అదే ఓవర్లో రాణా (0) అవుటయ్యాడు. నరైన్‌ (2), కార్తీక్‌ (9), షకీబ్‌ (0), గాయంతో బ్యాటింగ్‌కు దిగిన త్రిపాఠి (2), పేలవ ఫామ్‌లో ఉన్న కెపె్టన్‌ మోర్గాన్‌ (4) వరుసగా విఫలమయ్యారు. దాంతో కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ వేగంగా పతనమైంది. చివర్లో 21 బంతుల్లో 68 పరుగులు చేయాల్సిన స్థితిలో జత కలిసిన శివమ్‌ మావి (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఫెర్గూసన్‌ (18 నాటౌట్‌) కొన్ని మెరుపు షాట్లు ఆడి 39 పరుగులు జోడించినా అది వృథా ప్రయాసే అయింది.  

డు ప్లెసిస్‌కు అవకాశం ఇచి్చ...
సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ చేసిన పెద్ద తప్పు చెన్నైకి ఊపిరి పోసింది. షకీబ్‌ బౌలింగ్‌లో డు ప్లెసిస్‌ ముందుకు దూసుకు రాగా, సునాయాస స్టంపింగ్‌ అవకాశాన్ని కార్తీక్‌ వదిలేశాడు. ఆ సమయంలో ప్లెసిస్‌ స్కోరు 4 మాత్రమే! ఆ తర్వాత అతనే భారీ స్కోరుకు కారణమయ్యాడు. కోల్‌కతా ఆటగాడు వెంకటేశ్‌ ‘0’ వచి్చన ఇచ్చిన క్యాచ్‌ను అనూహ్యంగా ధోని వదిలేసి అతని అర్ధ సెంచరీకి అవకాశం ఇచి్చనా... చివరకు అది నష్టం కలిగించలేదు. మరోవైపు 27 పరుగుల వద్ద గిల్‌ క్యాచ్‌ను రాయుడు అందుకున్నా... బంతి స్పైడర్‌ క్యామ్‌ వైర్‌కు తగిలి రావడంతో అంపైర్లు డెడ్‌బాల్‌గా ప్రకటించడం ధోనికి అసహనం తెప్పించింది.

స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) మావి (బి) నరైన్‌ 32; డు ప్లెసిస్‌ (సి) వెంకటేశ్‌ (బి) మావి 86; ఉతప్ప (ఎల్బీ) (బి) నరైన్‌ 31; మొయిన్‌ అలీ (నాటౌట్‌) 37; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 192.

వికెట్ల పతనం: 1–61, 2–124, 3–192.

బౌలింగ్‌: షకీబ్‌ 3–0–33–0, మావి 4–0–32–1, ఫెర్గూసన్‌ 4–0–56–0, వరుణ్‌ 4–0–38–0, నరైన్‌ 4–0–26–2, వెంకటేశ్‌ 1–0–5–0.  

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గిల్‌ (ఎల్బీ) (బి) దీపక్‌ చహర్‌ 51; వెంకటేశ్‌ (సి) జడేజా (బి) శార్దుల్‌ 50; రాణా (సి) డు ప్లెసిస్‌ (బి) శార్దుల్‌ 0; నరైన్‌ (సి) జడేజా (బి) హేజల్‌వుడ్‌ 2; మోర్గాన్‌ (సి) చహర్‌ (బి) హేజల్‌వుడ్‌ 4; దినేశ్‌ కార్తీక్‌ (సి) రాయుడు (బి) జడేజా 9; షకీబ్‌ (ఎల్బీ) (బి) జడేజా 0; త్రిపాఠి (సి) అలీ (బి) శార్దుల్‌ 2; ఫెర్గూసన్‌ (నాటౌట్‌) 18; మావి (సి) చహర్‌ (బి) బ్రేవో 20; వరుణ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165.

వికెట్ల పతనం: 1–91, 2–93, 3–97, 4–108, 5–119, 6–120, 7–123, 8–125, 9–164. 

బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–32–1, హేజల్‌వుడ్‌ 4–0–29–2, శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–38–3, బ్రావో 4–0–29–1, జడేజా 4–0–37–2.

ఐపీఎల్‌–2021 అవార్డులు
ఆరెంజ్‌ క్యాప్‌
(అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌) రుతురాజ్‌ గైక్వాడ్‌ 635 పరుగులు
చెన్నై సూపర్‌ కింగ్స్‌
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌
రుతురాజ్‌ గైక్వాడ్‌ –ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

పర్పుల్‌ క్యాప్‌
(అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌)
హర్షల్‌ పటేల్‌–32 వికెట్లు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌
హర్షల్‌ పటేల్‌ – ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
గేమ్‌ చేంజర్‌ ఆఫ్‌ ద సీజన్‌
హర్షల్‌ పటేల్‌ – ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

పర్‌ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద సీజన్‌
రవి బిష్ణోయ్‌ (పంజాబ్‌ కింగ్స్‌)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

సూపర్‌ స్ట్రయికర్‌ ఆఫ్‌ ద సీజన్‌
హెట్‌మైర్‌ – ఢిల్లీ క్యాపిటల్స్‌
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

పవర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌
వెంకటేశ్‌ అయ్యర్‌
కోల్‌కతా నైట్‌రైడర్స్‌
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌
కేఎల్‌ రాహుల్‌ (30  సిక్స్‌లు)
పంజాగ్‌ కింగ్స్‌
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

ఫెయిర్‌ ప్లే టీమ్‌ ఆఫ్‌ ద సీజన్‌: రాజస్తాన్‌ రాయల్స్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top