
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 20) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ చెలరేగిపోయింది. కేవలం 57 బంతుల్లో శతకం పూర్తి చేసి, వన్డేల్లో రెండో వేగవంతమైన శతకాన్ని సమం చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 75 బంతులు ఎదుర్కొని 23 ఫోర్లు, సిక్స్ సాయంతో 138 పరుగులు చేసింది.
మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు (టాప-5)
మెగ్ లాన్నింగ్ (ఆస్ట్రేలియా)- 2012లో న్యూజిలాండ్‌పై 45 బంతుల్లో
బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 2025లో భారత్‌పై 57 బంతుల్లో
కరెన్ రోల్టన్ (ఆస్ట్రేలియా)- 2000లో సౌతాఫ్రికాపై 57 బంతుల్లో
సోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 2018లో ఐర్లాండ్‌పై 59 బంతుల్లో
స్మృతి మంధన (భారత్)- 2025లో ఐర్లాండ్‌పై 70 బంతుల్లో
మూనీ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ రికార్డు స్కోర్ చేసింది. 47.5 ఓవర్లలో ఆ జట్టు 412 పరుగులు చేసి ఆలౌటైంది. మూనీతో పాటు జార్జియా వాల్ (81), ఎల్లిస్ పెర్రీ (68) సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ చేసిన స్కోర్ మహిళల వన్డే క్రికెట్‌లో ఆరో అత్యధికం. అత్యధిక స్కోర్ రికార్డు న్యూజిలాండ్ (491/4) పేరిట ఉంది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు (50) ఆడి ఉంటే మరింత భారీ స్కోర్ చేసేది. ఓ దశలో స్కోర్ ఈజీగా 450 పరుగులు దాటుతుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు చివర్లో మేల్కోవడంతో అది కుదరలేదు. దీప్తి శర్మ వేసిన ఇన్నింగ్స్ 45వ ఓవర్‌లో ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది.
ఆతర్వాత 47వ ఓవర్‌లో ఒకటి, 48వ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ కోటా ఓవర్లు ఆడకుండానే ఇన్నింగ్స్‌ను ముగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 413 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే చరిత్రే అవుతుంది.
కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరొకటి గెలిచాయి. ప్రస్తుతం జరుగుతున్నది నిర్ణయాత్మకమైన మూడో వన్డే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.