
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన రెండో వన్డేలో టీమిండియా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌటైంది.
ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. భారత ఇన్నింగ్స్‌లో మంధన మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29), ప్రతిక రావల్ (25), స్నేహ్ రాణా (24) పర్వాలేదనిపించారు.
హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17), రాధా యాదవ్ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచారు.
ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ 3, ఆష్లే గార్డ్‌నర్ 2, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, తహ్లియా మెక్‌గ్రాత్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.
అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రాంతి గౌడ్ (9.5-1-28-3), దీప్తి శర్మ (6-0-24-2), రేణుకా సింగ్ ఠాకూర్ (6.3-0-28-1), స్నేహ్ రాణా (6-0-35-1), అరుంధతి రెడ్డి (7.3-0-46-1), రాధా యాదవ్ (5-0-27-1) ధాటికి 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో సదర్‌ల్యాండ్ (45), ఎల్లిస్ పెర్రీ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో వన్డే న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 20న జరుగనుంది.