ఎనిమిదేళ్ల తర్వాత దాయాదుల క్రికెట్‌ పోరు..?

Indo Pak Bilateral Cricket Series To Be Held This Year Says PCB Source - Sakshi

న్యూఢిల్లీ:  క్రికెట్‌ ప్రేమికులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దాయాదుల క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్‌లో వివిధ దేశాల మధ్య నిత్యం ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతున్నప్పటికీ.. భారత్‌-పాక్‌ల మధ్య జరిగే సిరీస్‌లో వచ్చే మజానే వేరన్నది క్రీడాభిమానుల అభిప్రాయం. కొన్నేళ్లుగా ఇరు దేశాల మ‌ధ్య నెలకొన్న  ఉద్రిక్త ప‌రిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌ జరగడానికి సాధ్యపడలేదు. అప్పుడ‌ప్పుడూ ఐసీసీ టోర్నీల్లో ఎదురుపడటమే తప్ప.. ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జ‌రిగింది లేదు. అయితే చాలాకాలం తర్వాత ఆ అవకాశం రానే వచ్చింది. భారత్‌-పాక్ మధ్య టీ20 సిరీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇరు దేశాల క్రికెట్ అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది.

ఈ ఏడాది చివ‌ర్లో భారత్‌, పాక్‌ల మ‌ధ్య టీ20 సిరీస్ జ‌ర‌గ‌నున్న‌ట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి వెల్ల‌డించారు. ఈ చారిత్ర‌క‌ సిరీస్ కోసం సిద్ధంగా ఉండాల‌ని త‌మ‌కు ఆదేశాలు అందినట్లు ఆయ‌న ప్రకటించాడు. ఈ వార్త‌ను పాక్‌ మీడియా సైతం దృవీకరించింది. అయితే ఈ అంశంపై ఇరు దేశాల క్రికెట్‌ బోర్డు మ‌ధ్య చ‌ర్చ‌లు మాత్రం జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది. పాక్‌ ప్రకటించిన విధంగా ఈ సిరీస్ సాధ్యపడితే.. టీమిండియా పాక్‌లో పర్యటించాల్సి ఉంటుంద‌ని పీసీబీ వ‌ర్గాలు తెలిపాయి. ఎందుకంటే చివ‌రిసారి ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్ జ‌రిగినప్పుడు పాక్‌ జట్టు భారత్‌లో పర్యటించింది. కాగా, చివ‌రిసారి భారత్‌-పాక్‌ మ‌ధ్య క్రికెట్‌ సిరీస్‌ 2012-13లో జ‌రిగింది. ఈ సిరీస్‌లో 2 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌లు జరగ్గా.. పాక్‌ వన్డే సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్లు చెరో టీ20 గెలవడంతో ఆ సిరీస్‌ డ్రాగా ముగిసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top