మరో పరుగుల విందు! | Indias third T20 match against West Indies today | Sakshi
Sakshi News home page

మరో పరుగుల విందు!

Oct 11 2026 4:03 AM | Updated on Oct 11 2026 4:03 AM

Indias third T20 match against West Indies today

నేడు వెస్టిండీస్‌తో భారత్‌ మూడో టి20 మ్యాచ్‌

రాత్రి 7 గం నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారం

ఇండోర్‌: భారత్, వెస్టిండీస్‌ మధ్య మరో సారి పరుగుల వరదకు రంగం సిద్ధమైంది. గత రెండు మ్యాచ్‌లలో విజృంభించిన బ్యాటర్లు... ఇండోర్‌లోని చిన్న మైదానంలో మరోసారి చెలరేగేందుకు రెడీ అయ్యారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్, వెస్టిండీస్‌ మధ్య మూడో టి20 జరగనుంది. గత మ్యాచ్‌లో 250 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన విండీస్‌ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా... సిరీస్‌లో పైచేయి సాధించాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉంది. 

ఈ సిరీస్‌లో పిచ్‌లు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చి... ఆటలోనే అసలు మజాను తగ్గిస్తున్నారని భారత హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ చెబుతున్నా... ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు చేసే అవకాశమైతే లేదు. దీంతో ఈ మైదానంలో మరోసారి పరుగుల పండగ ఖాయమే. గత రెండేళ్లలో ఇక్కడ టి20 మ్యాచ్‌ జరగకపోయినా... చివరి మూడు వన్డేల్లో మూడొందల పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. రోహిత్‌ శర్మ, హాషిమ్‌ ఆమ్లా, పుజారా, శ్రేయస్, రూసో వంటి వాళ్లు ఇక్కడ టి20 సెంచరీలు చేయగా... సెహ్వాగ్‌ వన్డేల్లో ద్విశతకం నమోదు చేశాడు. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. 

బౌలర్లపైనే భారం
అభిషేక్‌ శర్మ, సంజూ సామ్సన్, ఇషాన్‌ కిషన్, శ్రేయస్‌ అయ్యర్, తిలక్‌ వర్మ, నమన్‌ ధీర్‌తో భారత బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయిన శివమ్‌ దూబే స్థానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి అవకాశం దక్కుతుందో చూడాలి. అక్షర్‌ పటేల్, కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనుండగా... గత మ్యాచ్‌లో మూడు వికెట్లతో ఆకట్టుకున్న మయాంక్‌ యాదవ్‌తో పాటు అర్ష్ దీప్‌ సింగ్‌ పేస్‌ భారం మోయనున్నారు. బ్యాటింగ్‌లో భారత జట్టుకు పెద్దగా ఇబ్బందులు లేకున్నా... బౌలింగ్‌తోనే అసలు సమస్య వచ్చింది. 

రాంచీ మ్యాచ్‌లో కొండంత స్కోరు చేసినా... దాన్ని కాపాడుకోలేకపోయిన మన బౌలర్లు... ఇండోర్‌లో ఏమాత్రం ప్రభావం చూపుతారనేది అసలు సమస్య. ఇక వెస్టిండీస్‌ కెప్టెన్‌ షై హోప్‌ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు. టీమిండియాతో చివరి వన్డేలో భారీ సెంచరీ చేసిన అతడు... గత మ్యాచ్‌లో అజేయ శతకంతో జట్టుకు రికార్డు విజయాన్ని అందించాడు. హెట్‌మైర్, పావెల్‌ స్థాయికి తగ్గ రీతిలో రాణించాల్సి ఉండగా... షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెఫర్డ్‌ ఏం చేయగలరో గత మ్యాచ్‌లో నిరూపించారు. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎలాంటి ఉదాసీనతకు తావివ్వకుండా చెలరేగితేనే సిరీస్‌లో పైచేయి సాధించవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement