నేటి నుంచి అఫ్గానిస్తాన్‌తో భారత్ ఏకైక టెస్టు
ఫేవరెట్‌గా టీమిండియా
పోరాడేందుకు అఫ్గాన్ సిద్ధం
ఉ. గం.9:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
ఐపీఎల్ సందడి ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ టెస్టు క్రికెట్‌కు సిద్ధమైంది. గత నవంబర్‌లో తమ చివరి టెస్టు ఆడిన టీమిండియా ఇప్పుడు సొంతగడ్డపై బలహీన ప్రత్యర్థి అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. ఎలాంటి ప్రమాణాల ప్రకారం చూసినా అఫ్గాన్‌కంటే ఎంతో పెద్ద స్థాయిలో ఉన్న మన టెస్టు జట్టును నిలువరించడం ప్రత్యర్థికి అసాధ్యం కావచ్చు. ఎనిమిదేళ్ల క్రితం తమ తొలి టెస్టులో భారత్‌నే ఎదుర్కొన్న అఫ్గాన్ టీమ్ రెండు రోజుల్లోనే చిత్తుగా ఓడింది. ఇప్పుడు ఈ టెస్టు ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి.
న్యూ చండీగఢ్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగం కాదు... ఇరు జట్ల మధ్య ఆటలో, అనుభవంలో ఎంతో అంతరం ఉంది... పైగా భారత్ తమ స్వదేశంలో ఆడుతోంది. ఇలాంటి స్థితిలో సహజంగానే భారత్, అఫ్గానిస్తాన్ మధ్య టెస్టు మ్యాచ్‌పై ఆసక్తి తక్కువగా కనిపిస్తోంది. వారం రోజుల క్రితం వరకు ఆరు ఐపీఎల్ మ్యాచ్‌లతో ఇంద్రధనుస్సులా కనిపించిన ముల్లాన్‌పూర్ స్టేడియంలో ఆకర్షణ తగ్గిపోయింది.
38 వేల సామర్థ్యం గల మైదానం తొలి టెస్టుకు వేదిక అవుతున్నా... ఐదు రోజులకు రూ. 250తో టికెట్లు నిర్ణయిస్తే టెస్టు మ్యాచ్ ఆరంభానికి రెండు రోజుల ముందు 1700 టికెట్లు అమ్ముడుపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్థితిలో నేటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్ ఏకైక టెస్టులో ఢీకొంటున్నాయి.
సుదర్శన్‌కు మరో చాన్స్...
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీ భారత్‌కు శుభారంభం అందిస్తే భారీ స్కోరుకు పునాది పడుతుంది. మూడో స్థానంలో ఇప్పటి వరకు సాయి సుదర్శన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వకపోయినా (6 టెస్టుల్లో కలిపి 302 పరుగులు)... కోచ్ గంభీర్ అతనిపై నమ్మకం ఉంచాడు. సుదర్శన్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తామని స్పష్టంగా చెప్పడంతో అతని స్థానానికి కూడా ఢోకా లేదు కాబట్టి పడిక్కల్‌కు చాన్స్ లేదు. కెప్టెన్ గిల్, పంత్, జురేల్, సుందర్‌లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది.
ఇప్పటికే వన్డేలు, టి20ల్లో దాదాపుగా జట్టుకు దూరమైన పంత్ ఈ ఫార్మాట్‌లోనైనా చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. పేసర్లు సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఖాయం కాగా... ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌పై భారం ఉంది. సుందర్ రెండో స్పిన్నర్ కాగా, స్వదేశంలో భారత్ సాధారణంగా ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతుంది. కొత్త ఆటగాళ్లు మానవ్ సుతార్, హర్ష్దూబేలలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. అశ్విన్, జడేజాలు ఇద్దరూ లేకుండా సొంతగడ్డపై చివరిగా భారత్ 2010లో టెస్టు ఆడింది!
వారిద్దరిపైనే భారం...
టెస్టుల్లో అడుగు పెట్టి ఎనిమిదేళ్లు దాటినా... అఫ్గానిస్తాన్ ఇప్పటి వరకు 12 టెస్టులే ఆడగలిగింది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలాంటి పెద్ద జట్లతో ఒక్కసారి కూడా తలపడలేదు. ఈ ఫార్మాట్‌లో టీమ్ పరిస్థితిని ఇది సూచిస్తోంది. అఫ్గాన్ తరఫున రెండు డబుల్ సెంచరీలు సాధించిన కెప్టెన్ హష్మతుల్లా, ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన రహ్మత్ షా బ్యాటింగ్‌పైనే జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. అజ్మతుల్లా కీలక ఆల్‌రౌండర్ కాగా, గుర్బాజ్ ఓపెనింగ్‌లో దూకుడుగా ఆడగలడని జట్టు ఆశిస్తోంది. రషీద్ ఖాన్ లేకపోవడంతో టీమ్ బౌలింగ్ బలహీనంగా మారింది. ఇలాంటి టీమ్ భారత్‌తో ఎంత వరకు పోరాడగలదనేది ఆసక్తికరం.
50 రిషభ్ పంత్‌కు ఇది 50వ టెస్టు. భారత్ తరఫున వికెట్ కీపర్లుగా ధోని (90), సయ్యద్ కిర్మాణీ (88) మాత్రమే
ఇంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడారు.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. దాదాపు 40 డిగ్రీలతో ఉత్తరాదిలో తీవ్ర ఎండలు ఉండటం ఆటగాళ్లను బాగా ఇబ్బంది పెడుతోంది.


