
మహిళల వరల్డ్ కప్‌లో నేడు కీలక పోరు
వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు ఢీ
విజయంపై హర్మన్ సేన గురి
మ.గం.3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
మహిళల క్రికెట్‌లో భారత జట్టు స్థాయిని చూపించే మ్యాచ్‌కు నేడు విశాఖ వేదిక అవుతోంది. దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమి తర్వాత అత్యంత పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు భారత్ సై అంటోంది. ఇటీవల ఇదే జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోయినా... పోరు హోరాహోరీగా సాగింది.
అయితే వరల్డ్ కప్‌కు ముందు అసాధారణంగా కనిపించిన హర్మన్ సేన మెగా టోర్నీలో ఒక్కసారిగా ఫామ్ కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. ఇప్పటికే సఫారీల చేతిలో ఓడిన నేపథ్యంలో సెమీస్ రేసులో నిలవాలంటే పెద్ద జట్టుపై గెలుపు తప్పనిసరి. మరో వైపు అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న ఆసీస్ తమ ఎనిమిదో టైటిల్ వేటలో భారీ విజయాన్ని ఆశిస్తోంది.
విశాఖపట్నం, సాక్షి క్రీడా ప్రతినిధి: వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు నేడు కీలక మ్యాచ్‌కు సన్నద్ధమైంది. వైజాగ్‌లోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో నేడు జరిగే లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత మహిళల బృందం తలపడుతుంది. రెండు విజయాల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చవి చూడగా...రెండు మ్యాచ్‌లు గెలిచిన కంగారూలు శ్రీలంకతో మ్యాచ్ రద్దు కావడంతో కీలకమైన రెండు పాయింట్లు సాధించే అవకాశం కోల్పోయారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ముందు ఒక స్టాండ్‌కు మిథాలీ రాజ్ పేరు పెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈ ముగ్గురు చెలరేగితేనే...
వరల్డ్ కప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో స్మృతి చేసిన స్కోర్లు 8, 23, 23...హర్మన్ ప్రీత్ వరుసగా 21,19, 9 పరుగులు చేయగా...ఒక మ్యాచ్‌లో 32 పరుగులు చేసిన జెమీమా మరో రెండు సార్లు డకౌటైంది. మన జట్టులోని ముగ్గురు స్టార్ బ్యాటర్ల స్కోర్లను కలిపి చూస్తే 9 ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాలేదు. వరల్డ్ కప్ టైటిల్‌పై భారీ ఆశలు పెట్టుకున్న భారత జట్టుకు ఈ స్థితి ఆందోళనకరంగా మారింది.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో పూర్తిగా తడబడ్డ హర్మన్ 9 పరుగుల కోసం 23 బంతులు ఆడగా, స్మృతి తొలి బౌండరీ కొట్టేందుకు 21 బంతులు తీసుకుంది. జెమీమా 3 సార్లూ లెఫ్టార్మ్ స్పిన్నర్ బౌలింగ్‌లోనే అవుట్ కావడం ఆమె బలహీనతను చూపిస్తోంది. ఈ ముగ్గురితో పాటు ప్రతీక, హర్లీన్ కూడా అంతంతమాత్రం ప్రదర్శనే చేశారు. ప్రతీసారి లోయర్ ఆర్డర్ జట్టును ఆదుకోవడం సాధ్యం కాకపోవచ్చు.
దక్షిణాఫ్రికాతో ఇన్నింగ్స్ రిచాలో ఆత్మవిశ్వాసం పెంచగా... దీప్తి, అమన్‌జోత్ కూడా కీలకం కానున్నారు. గత మ్యాచ్ చివర్లో డి క్లెర్క్ చెలరేగే వరకు మన బౌలర్లంతా చక్కటి బౌలింగ్ చేశారు. ఐదుగురు రెగ్యులర్ బౌలర్లతో పాటు హర్మన్ కూడా నాలుగు ఓవర్లు వేసింది. అందుకే ప్రత్యా మ్నాయంగా ఆరో బౌలర్ అవసరం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో తుది జట్టులో మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసిన ఆంధ్ర బౌలర్ శ్రీచరణి నిరూపించుకునేందుకు ఇది మరో మంచి అవకాశం.
ఒకరిని మించి మరొకరు...
ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం ఆస్ట్రేలియాకు ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ అందుకు ఉదాహరణ. పాక్ బలహీన జట్టే అయినా 76 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా 200పైగా పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో చెలరేగి భారీ విజయం సాధించడం ఆసీస్‌కే చెల్లింది.
కివీస్‌పై 326 పరుగులు చేసిన ఆ జట్టు...అంతకు ముందు భారత్‌పై చివరి వన్డేలో ఏకంగా 412 పరుగులు నమోదు చేసిన విషయం మరచిపోవద్దు. టోర్నీలో ఇప్పటికే మూనీ, గార్డ్‌నర్ శతకాలు నమోదు చేశారు. మిగతా ప్రధాన బ్యాటర్లు ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. హీలీ, పెరీ తమ స్థాయికి తగినట్లుగా చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పవు. సదర్లాండ్ రూపంలో చక్కటి ఆల్‌రౌండర్ జట్టులో ఉంది.
పిచ్, వాతావరణం
గత మ్యాచ్ తరహాలోనే బ్యాటింగ్‌కు అనుకూలం. మంచి బౌన్స్ కూడా ఉండటంతో షాట్లకు అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. ఆదివారం కూడా కావడంతో స్టేడియం పూర్తి సామర్థ్యం మేరకు నిండే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి, ప్రతీక, హర్లీన్, జెమీమా, దీప్తి, అమన్‌జోత్, రిచా ఘోష్, స్నేహ్, క్రాంతి, శ్రీచరణి.
ఆస్ట్రేలియా: అలీసా హీలీ (కెప్టెన్), లిచ్‌ఫీల్డ్, ఎలైస్ పెరీ, మూనీ, సదర్లాండ్, గార్డ్‌నర్, తాహిలా, వేర్‌హామ్, గార్త్, అలానా కింగ్, మెగాన్ షుట్.