పరాభవంతో ముగించిన టీమిండియా | Indian Women's Team Lost final T20I Of South Africa Series | Sakshi
Sakshi News home page

పరాభవంతో ముగించిన టీమిండియా

Apr 27 2026 8:52 PM | Updated on Apr 27 2026 9:26 PM

Indian Women's Team Lost final T20I Of South Africa Series

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం సౌతాఫ్రికాలో పర్యటించిన భారత మహిళల క్రికెట్‌ జట్టు ఓటమితో పర్యటనను ముగించింది. ఈ సిరీస్‌ను ఇదివరకే కోల్పోయిన టీమిండియా.. బెనోని వేదికగా ఇవాళ (ఏప్రిల్‌ 27) జరిగిన నామమాత్రపు చివరి టీ20లో 23 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా 1-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్‌లో భారత్‌కు లభించిన ఏకైక గెలుపు నాలుగో మ్యాచ్‌లో వచ్చింది.

ఐదో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్‌ (92 నాటౌట్‌) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో లారా మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. సూన్‌ లస్‌ 23, తజ్మిన్‌ బ్రిట్స్‌ 2, అన్నెరి డెర్క్‌సన్‌ డకౌట్‌, అన్నెకె బాష్‌ 8, క్లో ట్రయాన్‌ 12, నదినే డి క్లెర్క​్‌ 1, సినాలో జఫ్టా 16 (నాటౌట్‌) పరుగులు చేశారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్‌, శ్రీచరణి, దీప్తి శర్మ తలో 2 వికెట్లు తీశారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో భారత్‌ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ, ఒత్తిడికిలోనై చివరికి టార్గెట్‌ను పెద్దది చేసుకుంది. భారతి ఫుల్మలీ (40), రిచా ఘోష్‌ (25 నాటౌట్‌) భారత్‌ను విజయతీరాలకు చేర్చేందుకు విఫలయత్నం చేశారు. చివర్లో లక్ష్యం పెద్దది కావడంతో చేతులెత్తేశారు. ఫలితంగా భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

భారత ఇన్నింగ్స్‌లో షఫాలీ వర్మ 4, అనుష్క శర్మ 17, జెమీమా రోడ్రిగ్స్‌ 1, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ 22, దీప్తి శర్మ 8, అరుంధతి రెడ్డి 1, క్రాంతి గౌడ్‌ డకౌటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా, డి క్లెర్క్‌ చెరో 2, ఎలిజ్‌ మారి, క్లో ట్రయాన్‌, ఖాకా తలో వికెట్‌ తీశారు. 

Advertisement
 
Advertisement
Advertisement