
8 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు ఓటమి
వరుణుడి ప్రభావంతో సిరీస్ సమం
మంగళవారం నిర్ణయాత్మక పోరు
లండన్: బ్యాటర్ల వైఫల్యంతో ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం వర్షం అంతరాయం మధ్య జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఫలితంగా సిరీస్ 1–1తో సమమైంది. భారీ వర్షం కారణంగా ఆట నిర్ణీత సమయం కంటే నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో... మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 29 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (51 బంతుల్లో 42; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (34 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు) కీలక పరుగులు చేసింది. మేఘావృతమైన వాతావరణంలో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (7), ప్రతీక రావల్ (3), జెమీమా రోడ్రిగ్స్ (3), రిచా ఘోష్ (2) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఎకెల్‌స్టోన్ 3 వికెట్లు పడగొట్టగా... ఎల్ అర్లాట్, లిన్సీ స్మిత్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 18.4 ఓవర్లలో 102/1తో ఉన్న సమయంలో మరోసారి వరుణుడు ఆటకు అడ్డుపడటంతో డక్‌వర్త్ ప్రకారం ఆతిథ్య జట్టు లక్ష్యాన్ని 24 ఓవర్లలో 115 పరుగులకు కుదించారు.
ఛేదనలో ఇంగ్లండ్ 21 ఓవర్లలో 2 వికెట్లకు 116 పరుగులు చేసింది. అమీ జోన్స్ (57 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు), బ్యూమౌంట్ (35 బంతుల్లో 34; 5 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు. ఎకెల్‌స్టోన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం జరగనుంది.
స్మృతి, దీప్తి మాత్రమే...
మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. పేస్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించగా... రెండో ఓవర్‌లో ప్రతీక రావల్ ఓ చక్కటి యార్కర్‌కు అవుట్ అయింది. ఈ దశలో హర్లీన్ డియోల్ (16)తో కలిసి స్మృతి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 40 పరుగులు జోడించడంతో ఇక కుదురుకున్నట్లే అనుకుంటే... ఆ తర్వాతే టీమిండియాకు అసలు కష్టాలు ఎదురయ్యాయి. ఎకెల్‌స్టోన్ వరుస ఓవర్లలో హర్లీన్, హర్మన్‌ప్రీత్‌ను ఔట్ చేసింది.
జెమీమా కీలక దశలో చార్లీ డీన్‌కు రిటర్న్ క్యాచ్ ఇవ్వగా... రిచా ఘోష్ వికెట్ల ముందు దొరికిపోయింది. దీంతో భారత జట్టు 72/5తో కష్టాల్లో పడింది. అంతసేపు పోరాడిన స్మృతి కూడా వెనుదిరగగా... చివర్లో దీప్తి శర్మ కీలక పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో చక్కటి పోరాటంతో జట్టును గెలిపించిన దీప్తి అదే జోరు ఇక్కడ కూడా కొనసాగించింది. హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి (14; 2 ఫోర్లు)తో కలిసి జట్టుకు ఓ మాదిరి స్కోరు అందించింది.
ఆదినుంచే జోరు...
ఏ క్షణమైన మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉండటంతో... ఇంగ్లండ్ ఛేదనలో ముందు నుంచే ధాటిగా ఆడింది. ఇంగ్లండ్ పేసర్లు ప్రభావం చూపిన చోట మన స్పిన్నర్లు ఆకట్టుకోలేకపోయారు. దీంతో ఓపెనర్లు అమీ జోన్స్, బ్యూమౌంట్ సులువుగా పరుగులు రాబట్టారు. తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించిన అనంతరం బ్యూమౌంట్ అవుటైనా... కెప్టెన్ నటాలియా సీవర్ బ్రంట్ (21; 2 ఫోర్లు) అండతో అమీ జోన్స్ జట్టును విజయానికి చేరువ చేసింది. చివర్లో మరోసారి వర్షం ముంచెత్తడంతో ఇంగ్లండ్ లక్ష్యం మరింత కుచించుకుపోవడంతో ఆతిథ్య జట్టు సిరీస్ సమం చేసింది.
స్కోరు వివరాలు
భారత మహిళల ఇన్నింగ్స్: ప్రతీక (బి) అర్లాట్ 3; స్మృతి (సి) చార్లీ డీన్ (బి) లిన్సీ 42; హర్లీన్ (సి అండ్ బి) ఎకెల్‌స్టోన్ 16; హర్మన్‌ప్రీత్ (బి) ఎకెల్‌స్టోన్ 7, జెమీమా (సి అండ్ బి) డీన్ 3; రిచా (ఎల్బీ) (బి) ఎకెలస్టోన్ 2; దీప్తి శర్మ (నాటౌట్) 30; అరుంధతి (ఎల్బీ) (బి) లిన్సీ 14; స్నేహ్ రాణా (బి) అర్లాట్ 6; క్రాంతి గౌడ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (29 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–6, 2–46, 3–57, 4–69, 5–72, 6–98, 7–124, 8–135. బౌలింగ్: లారెన్ బెల్ 6–0–29–0; ఎమ్ అర్లాట్ 6–1–26–2; చార్లీ డీన్ 6–0–31–1; సోఫీ ఎకెల్‌స్టోన్ 6–0–27–3; లిన్సీ స్మిత్ 5–0–28–1
ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: అమీ జోన్స్ (నాటౌట్) 46; బ్యూమౌంట్ (ఎల్బీ) (బి) స్నేహ్ రాణా 34; సీవర్ బ్రంట్ (బి) క్రాంతి గౌడ్ 21; డంక్లి (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (21 ఓవర్లలో 2 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–54, 2–102. బౌలింగ్: అరుంధతి 5–0–21–0; క్రాంతి గౌడ్ 3–0–29–1; శ్రీ చరణి 5–0–28–0; దీప్తి శర్మ 5–0–23–0; స్నేహ్ రాణా 3–0–12–1.