ఎడారిలో ఒయాసిస్...

Indian Premier League Starts From September 19th 2020 - Sakshi

ఐపీఎల్‌–2020 కోసం అన్నీ సిద్ధం

అవరోధాలు అధిగమించిన బీసీసీఐ

సెప్టెంబర్‌ 19 నుంచి లీగ్‌ షురూ 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ క్రీడల గురించి కనీసం ఆలోచించలేని పరిస్థితిలో కూడా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ బంగారు బాతును బ్రహ్మాండంగా వాడుకునే ప్రయత్నంలో పడింది. ఎలాగైనా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మాత్రం కచ్చితంగా నిర్వహించాలని పట్టుదల కనబర్చి అందుకు తగినట్లుగా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. కోవిడ్‌–19 నేపథ్యంలో అన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొన్న స్థితిలో కూడా ఒయాసిస్‌లా ఆశలు రేపుతున్న ఆదాయాన్ని ఆర్జించేందుకు ఎడారి దేశం బాట పట్టింది. కొన్నాళ్ల క్రితం వరకు అసాధ్యం అనుకున్న లీగ్‌ను ఇప్పుడు సన్నద్ధం చేసి 
బోర్డు తొలి అడుగును విజయవంతంగా వేసింది.

షెడ్యూల్‌ ప్రకారమైతే ఏప్రిల్‌–మే నెలలో ఐపీఎల్‌ జరగాలి. కానీ కరోనా కారణంగా అంతా మారిపోయింది. మార్చిలోనే దక్షిణాఫ్రికా జట్టు తమ వన్డే సిరీస్‌ను రద్దు చేసుకొని స్వదేశం వెళ్లిపోవడంతో మన దేశంలో క్రికెట్‌ ఆగిపోయింది. ఇలాంటి సమయంలో బీసీసీఐ కూడా దాదాపుగా చేతులెత్తేసింది. ఐపీఎల్‌ జరుగుతుందో లేదో అన్నట్లుగానే మొదటి నుంచీ బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాట్లాడుతూనే వచ్చాడు. అయితే బయో బబుల్‌ సెక్యూరిటీలో జరిగిన ఇంగ్లండ్‌–వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌ బీసీసీఐకు ఒక దారి చూపించింది. ప్రేక్షకులు లేకపోవడం సంగతి తర్వాత... ముందు మ్యాచ్‌లు జరిగేదెలాగో చూడమన్నట్లుగా ఒక్కసారిగా బోర్డులో కదలిక వచ్చింది. దాని ఫలితమే ఎలాగైనా లీగ్‌ నిర్వహించాలనే పట్టుదలతో ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించేలా చేసింది.

యూఏఈలోనే ఎందుకు...
ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని భావిస్తే భారత్‌లోనే ఐపీఎల్‌ జరపవచ్చుగా అనేదానిపై ఆరంభంలో బోర్డులో కూడా చర్చ జరిగింది. అయితే దేశంలో కరోనా తీవ్రత ఉండటంతో ఏ నగరం కూడా క్షేమంగా లేదు. ఐపీఎల్‌ గురించి ప్రణాళికలు రూపొందిస్తున్న సమయంలో ఢిల్లీ, ముంబైలు కరోనా కేసుల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. పైగా ఇలాంటి సమయంలోనూ లీగ్‌ జరుగుతుంటే పలు విమర్శలు రావడం సహజం. పైగా భారత్‌లాంటి చోట బయో బబుల్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. ఆటగాళ్లు ఎంత క్రమశిక్షణ పాటించాలని భావించినా... స్థానిక పరిస్థితుల కారణంగా బయటి వ్యక్తులు కూడా భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం చాలా సులువు. ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఏదో ఒక సమస్య సగటు అభిమానుల నుంచి ఎదురైనా లీగ్‌కు దెబ్బ పడవచ్చు. ఇలాంటి కారణాలతో పాటు వసతుల పరంగా చూసినా అత్యుత్తమమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)ని బీసీసీఐ ఎంచుకుంది. స్థానిక బోర్డు, ప్రభుత్వం కూడా సహకరించేందుకు íసిద్ధం కావడంతో సమస్య లేకుండా పోయింది. యూఏఈలో కూడా కరోనా కేసులు ఎక్కువే (మంగళవారం నాటికి మొత్తం సుమారు 80 వేలు, కోలుకున్నవారు 70 వేలు) ఉన్నాయి. కానీ కఠిన చట్టాల వల్ల నియంత్రణలోనే ఉంది.

ఆటగాళ్ల పరిస్థితేంటి...
కోవిడ్‌–19 కారణంగా సుదీర్ఘ కాలం ఇళ్లకే పరిమితమైపోయిన క్రికెటర్ల దృష్టిలో మాత్రం ఇప్పుడు ఐపీఎల్‌ పెద్ద పండగలా మారిపోయింది. అందుకే వారంతా టోర్నీ కోసం ఉత్సాహంగా సిద్ధమయ్యారు. యూఏఈ రావడానికి ముందు, వచ్చిన తర్వాత విధించిన కఠిన ఆంక్షలు, కరోనా నిబంధనలు ఆరంభంలో కొంత ఇబ్బందికి గురి చేసినా... ఇప్పుడు వారంతా పరిస్థితులకు అలవాటు పడిపోయారని ఆయా జట్ల ప్రాక్టీస్‌ ఫొటోలు, వీడియోలు చూస్తే తెలుస్తోంది. మాస్క్‌లు, పీపీఈ కిట్లతో ప్రత్యేక విమానం ఎక్కిన వీరంతా బయో బబుల్‌లోఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం సానుకూలాంశం. గతంలోలాగా స్వేచ్ఛగా బయట విహరించే అవకాశం లేకపోయినా, సహచర క్రికెటర్లతో మైదానంలో ఆటను ఆస్వాదిస్తున్న కారణంగా ఆ లోటు తెలియకపోవచ్చు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ బృందంలో ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మంది కరోనా సోకి కొంత ఆందోళన రేగింది. అయితే ఇప్పడు పరిస్థితులు చక్కబడగా, ఆ ఉదంతం తర్వాత మళ్లీ ఐపీఎల్‌లో ‘పాజిటివ్‌’ మాట వినిపించలేదు. బయో సెక్యూర్‌ బబుల్‌లో ఆటగాళ్లు సమర్థంగా నిబంధనలు పాటిస్తున్నారనే దీన్ని బట్టి అర్థమవుతోంది. దాదాపు 80 రోజులు ఈ తరహాలో బందీగా ఉండాల్సి రావడం ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నా... ఇప్పుడైతే అలాంటిది కనిపించడం లేదు. ఒకవేళ టోర్నీ సాగినకొద్దీ తెలుస్తుందని అనుకున్నా... ప్రొఫెషనల్‌ క్రీడాకారులు అంత బలహీనంగా ఉండరని, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడతారని కూడా భావించవచ్చు. మీడియా సమావేశాలు కూడా లేవు కాబట్టి ఆటగాళ్లపై ఆ ఒత్తిడి కూడా తగ్గినట్లే.

అభిమానులూ ఇంటినుంచే...
కరోనా కష్టకాలంలో ఐపీఎల్‌ జరుగుతున్నా... ఆటపరంగా లీగ్‌ ప్రమాణాల్లో ఎలాంటి లోటూ ఉండకపోవచ్చు. అభిమానుల ముందు ఆడే అవకాశం లేకపోవడం కొందరు ఆటగాళ్లను నిరుత్సాహపరిచే అంశం. అయితే అన్ని రకాల పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే క్రికెటర్ల లక్షణం కాబట్టి ఫ్యాన్స్‌ ప్రోత్సాహం లేకపోవడంవంటివి వారిపై పెద్దగా ప్రభావం చూపవు. ఇక వీరాభిమానులు ఎప్పటిలాగే టీవీల్లో మ్యాచ్‌లతో వినోదాన్ని పొందవచ్చు.

మరోవైపు మొబైల్‌లో మ్యాచ్‌లు చూపించే హాట్‌స్టార్‌ మాత్రం ఐపీఎల్‌ కోసం రారమ్మంటూ భారీ ప్రచారం మొదలు పెట్టడంతో పాటు ‘నో సబ్‌స్క్రిప్షన్‌ నో ఐపీఎల్‌’ అంటూ ప్రత్యేకంగా సబ్‌స్క్రయిబ్‌ చేసుకోమంటూ ఒక రకమైన హెచ్చరిక పంపించింది. స్పాన్సర్ల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అభిమానులతో సరదా ముచ్చట్లు, ఆటోగ్రాఫ్‌లు, ఫోటోల సందడిలాంటి మాత్రం ఈసారి పూర్తిగా మిస్‌. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గానే అన్నట్లు ఐపీఎల్‌–2020 కూడా క్రికెట్‌ అభిమానులకు పసందైన విందు భోజనం అందిస్తుందనడంలో సందేహం లేదు.

చివరగా... వేదికలు మారాయి, ఏర్పాట్లు, ఇతర ఖర్చులు పెరిగాయి, చైనా దెబ్బతో టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ విలువలో సగం డబ్బులే వచ్చాయి, అనుబంధ స్పాన్సర్లు బేరమాడుతున్నారు.... అయినా సరే బోర్డు మాత్రం లీగ్‌ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అసలు ఐపీఎల్‌ జరగకపోవడంకంటే ఇలాగైనా నిర్వహిస్తే చాలంటూ ఫ్రాంచైజీ యాజమాన్యాలు కూడా బోర్డుకు మద్దతు పలికాయి. ఆర్థికంగా లాభాలకంటే ఆట జరగడం ముఖ్యమని దీంతో సంబంధం ఉన్న అందరూ భావించడంతో లీగ్‌ వాస్తవరూపం దాలుస్తోంది. గత 12 సీజన్లతో పోలిస్తే పూర్తి భిన్నంగా జరగబోతున్న ఈ ఐపీఎల్‌–2020ని ఈ శనివారం నుంచి ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధం కండి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top