
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు ఎంపిక
సెప్టెంబర్ 26 నుంచి ఆస్ట్రేలియా పర్యటన
న్యూఢిల్లీ: భారత జూనియర్ మహళల హాకీ జట్టుకు జ్యోతి సింగ్ సారథిగా ఎంపికైంది. ఈ నెలాఖరులో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. కాన్‌బెర్రా జాతీయ హాకీ సెంటర్ వేదికగా జరిగే ఈ సిరీస్ కోసం హాకీ ఇండియా శనివారం 23 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో చిలీ వేదికగా ఎఫ్‌ఐహెచ్ జూనియర్ మహిళల ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భారత జట్టు భావిస్తోంది.
ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రో లీగ్ సందర్భంగా భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన డిఫెండర్ జ్యోతి సింగ్ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించనుంది. నిధి, హర్ష రాణి గోల్ కీపింగ్ బాధ్యతలు మోయనుండగా... జ్యోతి, మనీషా, మమిత ఓరమ్, సాక్షి శుక్ల, పూజ సాహు, నందినితో డిఫెన్స్ బలంగా ఉంది. మిడ్‌ఫీల్డ్‌లో ప్రియాంక యాదవ్, సాక్షి రాణా, శైలిమా చాను, రజని, ఇషిక, సునేలితా టొప్పో, అనిషా సాహు కీలకం కానున్నారు.
లాల్‌రిన్‌పుయి, నిషా మింజ్, పూర్ణిమ యాదవ్, సోనమ్, కనిక సివాచ్, సుఖ్‌వీర్ కౌర్ ఫార్వర్డ్‌లుగా వ్యవహరించనున్నారు. ‘ఇది మంచి బృందం. జట్టులో ప్రతి ఒక్కరూ శిక్షణ శిబిరంలో కఠోర సాధన చేశారు. అన్నీ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. పరిస్థితులను అర్థం చేసుకొని బాధ్యతలు నిర్వర్తించే ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. ఆ్రస్టేలియా పర్యటన ద్వారా తగిన అనుభవం వస్తుంది. అది ఎఫ్‌ఐహెచ్ జూనియర్ మహిళల ప్రపంచకప్‌లో ఉపయోగపడుతుంది.
వరల్డ్‌కప్‌నకు ముందు ప్రపంచ అత్యుత్తమ జట్టుతో తలపడే అవకాశం దక్కింది. ఈ సిరీస్ మన ప్లేయర్లకు చాలా ఉపయోగ పడుతుంది. ఈ మ్యాచ్‌ల ద్వారా మెరుగవ్వాల్సిన అంశాలను గుర్తిస్తాం. వాటి ఆధారంగా జూనియర్ ప్రపంచకప్ వరకు జట్టును మరింత బలంగా తీర్చిదిద్దుతాం’ అని భారత కోచ్ తుషార్ ఖండేకర్ అన్నాడు.