
కాన్‌బెర్రా: ఆ్రస్టేలియా పర్యటనలో భారత జూనియర్ మహిళల హాకీ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 0–5 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా అండర్–21 జట్టు చేతిలో ఓడింది.
గత మ్యాచ్‌లో గట్టి పోటీనిచ్చి పరాజయం పాలైన భారత అమ్మాయిలు... ఈ పోరులో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ప్రత్యర్థికి కనీసం పోటీనివ్వలేక వెనుకబడింది. భారత్ ఒక్క గోల్ కూడా చేయలేకపోగా... ఆ్రస్టేలియా జట్టు తరఫున మకేలా జోన్స్ (10వ, 11వ, 52వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించింది. సమీ లవ్ (38వ నిమిషంలో), మిగాలియా హవెల్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గత మ్యాచ్‌లో కేవలం ఒక్క గోల్ తేడాతో ఓడిన భారత్... ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేయడంలో విఫలమైంది.
మ్యాచ్ ఆరంభం నుంచి అటాకింగ్ గేమ్ ఆడిన ఆ్రస్టేలియా అమ్మాయిలు... పదేపదే భారత గోల్‌పోస్ట్‌పై దాడులు చేస్తూ ఒత్తిడి కొనసాగించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో చిలీ వేదికగా ఎఫ్‌ఐహెచ్ జూనియర్ మహిళల ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు ఈ సిరీస్‌ను సన్నాహకంగా వినియోగించుకోవాలనుకున్న భారత్‌కు నిరాశ ఎదురవుతోంది. ఇరు జట్ల మధ్య సోమవారం ఇక్కడే మూడో మ్యాచ్ జరగనుంది.