Ind Vs WI 3rd T20: భారత్‌ 6... విండీస్‌ 0

India vs West Indies 3rd T20: IND beat WI by 17 runs to complete 3-0 clean sweep - Sakshi

ఆఖరి మ్యాచ్‌లో 17 పరుగులతో  గెలుపు

సూర్యకుమార్, వెంకటేశ్‌ మెరుపులు

నిప్పులు చెరిగిన హర్షల్, దీపక్‌

భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు వెస్టిండీస్‌ ఖాళీ అయ్యింది. ట్రోఫీ కాదు కదా కనీస విజయమైనా లేకుండానే రిక్త హస్తాలతో కరీబియన్‌కు పయనం కానుంది. ఆఖరి టి20లోనూ టీమిండియానే గెలిచి సిరీస్‌ను 3–0తో చేజిక్కించుకుంది. ఇంతకుముందు వన్డే సిరీస్‌నూ 3–0తో సొంతం చేసుకున్న భారత్‌ టి20 సిరీస్‌ను కైవసం చేసుకొని ఓవరాల్‌గా ఆరు విజయాలు నమోదు చేసుకోగా... విండీస్‌ గెలుపు రుచి కూడా చూడకుండానే వెనుదిరిగింది.

కోల్‌కతా: ఈ మ్యాచ్‌లో 15 ఓవర్ల దాకా భారత్‌ వంద పరుగులైనా చేయలేదు. కోహ్లికి రెస్ట్‌ ఇస్తే కెప్టెన్‌ ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ అప్పటికే ఔటయ్యాడు. ఈ పరిస్థితిలో జట్టు అనూహ్యంగా ఆఖరి 5 ఓవర్లలో 86 పరుగులతో ఎవరూ ఊహించని భారీస్కోరు చేసింది. తర్వాత అనుభవజ్ఞులే లేని టీమిండియా పేస్‌ దళం వెస్టిండీస్‌ను కూల్చేసింది. చివరకు 17 పరుగుల తేడాతో ఆఖరి టి20లో భారత్‌ జయకేతనం ఎగురవేసింది.

ఆదివారం జరిగిన చివరి పోరులో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ సూర్యకుమార్‌ యాదవ్‌ (31 బంతుల్లో 65; 1 ఫోర్, 7 సిక్స్‌లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (19 బంతుల్లో 35 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. తర్వాత వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది.   

ఈ మ్యాచ్‌లో భారత్‌ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. పేస్‌ బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆరంభంలో భారత బ్యాటర్స్‌ తడబడ్డారు. చెత్తషాట్లతో వికెట్లను సమర్పించుకున్నారు. మొదటి 10 ఓవర్లలో టీమిండియా స్కోరు 68/3 మాత్రమే! 14వ ఓవర్లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అవుటయ్యే సమయానికి భారత్‌ స్కోరు 93/4. ఈ దశలో సూర్యకుమార్‌తో వెంకటేశ్‌ అయ్యర్‌ జత కలిశాడు.

చప్పగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు సూర్యకుమార్‌ భారీ సిక్సర్లతో ఊపు తెచ్చాడు. వెంకటేశ్‌ కూడా దూకుడుగా ఆడటంతో కేవలం 19 బంతుల వ్యవధిలోనే (18.2వ ఓవర్లో) భారత్‌ 150 పరుగులు దాటింది. షెఫర్డ్‌ వేసిన ఆఖరి ఓవర్లో సూర్యకుమార్‌ మూడు సిక్సర్లు బాదాడు. చివరి బంతికి అవుటయ్యాడు. వెంకటేశ్, సూర్యకుమార్‌ ఐదో వికెట్‌కు 41 బంతుల్లోనే 91 పరుగులు జతచేశారు.  

విండీస్‌ విలవిల
లక్ష్యాన్ని ఛేదించేందుకు పరుగుల వేట ప్రారంభిస్తే భారత సీమర్లు వికెట్లు కూల్చేపనిలో పడ్డారు. దీపక్‌ చహర్‌ వరుస ఓవర్లలో ఓపెనర్లు మేయర్స్‌ (6), షై హోప్‌ (8)లను ఔట్‌చేశాడు. అంతలోనే చహర్‌ గాయంతో రెండో ఓవర్‌ పూర్తవకుండానే మైదానం వీడాడు. తర్వాత పూరన్, పావెల్‌ (25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు క్రీజులో నిలిచారు. ఏడో ఓవర్‌ నుంచి హర్షల్‌ పటేల్, వెంకటేశ్‌ అయ్యర్‌ల వికెట్ల వేట మొదలెట్టగానే 100 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. లక్ష్యానికి దూరమైంది. పూరన్‌ బౌండరీలు, షెఫర్డ్‌ (21 బంతుల్లో 29; 1 ఫోర్, 3 సిక్సర్లు) సిక్స్‌లు విండీస్‌ శిబిరాన్ని కాస్త ఊరడించాయి. తప్ప విజయం దాకా తీసుకెళ్లలేదు.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) మేయర్స్‌ (బి) హోల్డర్‌ 4; ఇషాన్‌ (బి) చేజ్‌ 34; శ్రేయస్‌ (సి) హోల్డర్‌ (బి) వాల్‌‡్ష 25; రోహిత్‌ (బి) డ్రేక్స్‌ 7; సూర్యకుమార్‌ (సి) పావెల్‌ (బి) షెఫర్డ్‌ 65; వెంకటేశ్‌ (నాటౌట్‌) 35; ఎక్స్‌ట్రా లు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 184.
వికెట్ల పతనం: 1–10, 2–63, 3–66, 4–93, 5–184.
బౌలింగ్‌: హోల్డర్‌ 4–0–29–1, షెఫర్డ్‌ 4–0–50–1, చేజ్‌ 4–0–23–1, వాల్‌‡్ష 4–0– 30–1, డ్రేక్స్‌ 3–0–37–1, అలెన్‌ 1–0–5–0.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: మేయర్స్‌ (సి) ఇషాన్‌ (బి) చహర్‌ 6; షై హోప్‌ (సి) ఇషాన్‌ (బి) చహర్‌ 8; పూరన్‌ (సి) ఇషాన్‌ (బి) శార్దుల్‌ ఠాకూర్‌ 61; పావెల్‌ (సి) శార్దుల్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 25; పొలార్డ్‌ (సి) రవి బిష్ణోయ్‌ (బి) వెంకటేశ్‌ అయ్యర్‌ 5; హోల్డర్‌ (సి) శ్రేయస్‌ అయ్యర్‌ (బి) వెంకటేశ్‌ అయ్యర్‌ 2; రోస్టన్‌ చేజ్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 12; షెపర్డ్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) హర్షల్‌ పటేల్‌ 29; అలెన్‌ (నాటౌట్‌) 5; డ్రేక్స్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) శార్దుల్‌ ఠాకూర్‌ 4; హేడెన్‌ వాల్‌‡్ష (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 167.
వికెట్ల పతనం: 1–6, 2–26, 3–73, 4–82, 5–87, 6–100, 7–148, 8–158, 9–166.
బౌలింగ్‌: చహర్‌ 1.5–0–15–2, అవేశ్‌ ఖాన్‌ 4–0–42–0, వెంకటేశ్‌ 2.1–0–23–2, శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–33–2, రవి బిష్ణోయ్‌ 4–0– 29–0, హర్షల్‌ పటేల్‌ 4–0–22–3.

అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో ద్వైపాక్షిక సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం భారత్‌కిది ఏడోసారి. స్వదేశంలో నాలుగు సిరీస్‌లు, విదేశాల్లో మూడు సిరీస్‌లను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top