Ind Vs SL 2nd Test: క్లీన్‌స్వీప్‌ చేసే సమయం ఆసన్నమైంది... మూడో రోజే ముగించేందుకు...

India vs Sri Lanka: India set Sri Lanka a massive target of 447 runs to win - Sakshi

శ్రీలంక లక్ష్యం 447; ప్రస్తుతం 28/1

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 303/9 డిక్లేర్డ్‌

చెలరేగిన పంత్, రాణించిన అయ్యర్‌

భారత్‌ టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే సమయం ఆసన్నమైంది...తొలిరోజు బౌలింగ్‌లో కొంతైనా  ప్రతాపం చూపిన శ్రీలంక రెండో రోజు ఇటు బ్యాటింగ్‌లో అటు బౌలింగ్‌లో పూర్తిగా కుదేలైంది. వంద పరుగులు దాటిన కాసేపటికే తొలి ఇన్నింగ్స్‌ను ముగించుకున్న లంక తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయింది. దీంతో కొండంత లక్ష్యం ముందు లంక ఓడేందుకు చేరువవుతోంది. పంత్‌ మెరుపు బ్యాటింగ్, అయ్యర్‌ మరో చక్కటి ఇన్నింగ్స్‌ రెండో రోజు హైలైట్‌గా నిలిచాయి.   

బెంగళూరు: రెండో టెస్టులో విజయానికి అవసరమైన ఏర్పాట్లన్నీ భారత్‌ రెండో రోజే చేసేసింది. ప్రత్యర్థి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే ముగించిన భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యానికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో పటిష్టమైన స్కోరుతో భారీ లక్ష్యాన్ని నిర్మించింది. ఆదివారం హాయిగా స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు రిషభ్‌పంత్‌ (31 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) పసందైన బ్యాటింగ్‌ విందు ఇచ్చాడు.

రెండో రోజుకు సరిపడే వినోదం అతనిదైతే... మొత్తం మ్యాచ్‌లో భారత్‌ను శ్రేయస్‌ అయ్యర్‌ (87 బం తుల్లో 67; 9 ఫోర్లు) పటిష్ట స్థితిలో నిలిపాడు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 303/9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసి శ్రీలంక ముందు 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 28 పరుగులు చేసింది. బుమ్రా వేసిన మూడో బంతికే తిరిమన్నె (0) అవుట్‌ కాగా, కరుణరత్నే (10 బ్యాటింగ్‌), కుశాల్‌ మెండిస్‌ (16 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

శ్రీలంక 109 ఆలౌట్‌
రెండో రోజు లంకను ఆలౌట్‌ చేసేందుకు భారత్‌కు ఎక్కువ సేపు పట్టలేదు. ఆదివారం మరో ఆరు ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయిన ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 35.5 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌ టైంది. ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 23 పరుగులు మాత్రమే జోడించి జట్టు మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. బుమ్రా కెరీర్‌లో 8వ సారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యం లభించింది.  

అయ్యర్‌ మళ్లీ సూపర్‌
రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (79 బంతుల్లో 46; 4 ఫోర్లు), మయాంక్‌ అగర్వాల్‌ (22; 5 ఫోర్లు) నిలకడగా ఆడారు. వీళ్లిద్దరి తర్వాత హనుమ విహారి (35; 4 ఫోర్లు) కాస్త మెరుగనిపించగా, కోహ్లి (13) విఫలమయ్యాడు. మరో వైపు శ్రేయస్‌ అయ్యర్‌ మళ్లీ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఐదో వికెట్‌కు పంత్, అయ్యర్‌ 6.2 ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. జడేజాతో కలిసి శ్రేయస్‌ కుదురుగా బ్యాటింగ్‌ చేశాడు. డిన్నర్‌ బ్రేక్‌ పూర్తయిన వెంటనే జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఆరో వికెట్‌కు వీళ్లిద్దరు 63 పరుగులు జత చేశాక జడేజా (22) అవుటయ్యాడు. ఆ తర్వాత 69 బంతుల్లో అయ్యర్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. వరుసగా రెండు రోజుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను ఫిఫ్టీలతో అదరగొట్టాడు. స్కోరు 300 దాటి 9వ వికెట్‌ పడగానే భారత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.  

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 252; శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 109;

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) ధనంజయ (బి) ఎంబుల్డెనియా 22; రోహిత్‌ (సి) మాథ్యూస్‌ (బి) ధనంజయ 46; విహారి (బి) జయవిక్రమ 35; కోహ్లి (ఎల్బీ) (బి) జయవిక్రమ 13; పంత్‌ (సి) అండ్‌ (బి) జయవిక్రమ 50; అయ్యర్‌ (ఎల్బీ) (బి) ఎంబుల్డెనియా 67; జడేజా (బి) ఫెర్నాండో 22; అశ్విన్‌ (సి) డిక్‌వెలా (బి) జయవిక్రమ 13; అక్షర్‌ (బి) ఎంబుల్డెనియా 9; షమీ నాటౌట్‌ 16; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (68.5 ఓవర్లలో) 303/9 డిక్లేర్డ్‌.
వికెట్ల పతనం: 1–42, 2–98, 3–116, 4–139, 5–184, 6–247, 7–278, 8–278, 9–303.
బౌలింగ్‌: లక్మల్‌ 10–2–34–0; ఎంబుల్డెనియా 20.5–1–87–3, ఫెర్నాండో 10–2–48–1, ధనంజయ 9–0–47–1, జయవిక్రమ 19–2–78–4. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top