India vs South Africa 3rd T20: చివరిది వదిలేశారు.. పోరాడకుండానే..

India vs South Africa 3rd T20I Highlights: India Defeated By 49 Runs - Sakshi

మూడో టి20లో భారత్‌ పరాజయం

49 పరుగులతో నెగ్గిన దక్షిణాఫ్రికా

రిలీ రోసో సెంచరీ   

ఇండోర్‌: టీమిండియా టి20 ప్రపంచకప్‌ సన్నాహకం పరాజయంతో ముగిసింది. మెగా టోర్నీకి ముందు ఆడిన చివరి పోరులో భారత్‌ ఓటమి పాలైంది. ఇప్పటికే సిరీస్‌ చేజార్చుకున్న దక్షిణాఫ్రికా మూడో టి20లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చి 49 పరుగులతో భారత్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.

రిలీ రోసో (48 బంతుల్లో 100 నాటౌట్‌; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ టి20ల్లో తొలి సెంచరీ సాధించగా... డికాక్‌ (43 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. అనంతరం భారత్‌ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. దినేశ్‌ కార్తీక్‌ (21 బంతుల్లో 46; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), దీపక్‌ చహర్‌ (17 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. భారత్‌ ఈ సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది.  

భారీ భాగస్వామ్యాలు... 
కెప్టెన్‌ బవుమా (3) పేలవ ఫామ్‌ కొనసాగగా, మరో ఓపెనర్‌ డికాక్‌ మొదటి నుంచే ధాటిగా ఆడాడు. మూడో స్థానంలో వచ్చి రోసో కూడా దూకుడు కనబర్చడంతో దక్షిణాఫ్రికా వేగంగా పరుగులు రాబట్టింది. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 48 పరుగులకు చేరింది. అశ్విన్‌ బౌలింగ్‌లో రోసో (వ్యక్తిగత స్కోరు 24) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీపై సిరాజ్‌ అందుకోలేకపోగా, అది సిక్స్‌గా మారింది.

మరోవైపు ఉమేశ్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో 33 బంతుల్లో డికాక్‌ అర్ధసెంచరీ పూర్తయింది. రెండో వికెట్‌కు 47 బంతుల్లో 89 పరుగులు జోడించిన తర్వాత డికాక్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం రోసో 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చహర్, హర్షల్‌ ఓవర్లలో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన 90ల్లోకి చేరిన రోసో... చివరి ఓవర్‌ రెండో బంతికి సింగిల్‌ తీసి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. చహర్‌ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు బాది డేవిడ్‌ మిల్లర్‌ (5 బంతుల్లో 19 నాటౌట్‌; 3 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌కు ఘనమైన ముగింపునిచ్చాడు.    

పోరాడకుండానే... 
8 ఓవర్లు ముగిసేసరికి ఐదుగురు బ్యాటర్లు పెవిలియన్‌కు... క్రీజ్‌లో ఇద్దరు బౌలర్లు అక్షర్, హర్షల్‌! ఛేదనలో భారత జట్టు పరిస్థితి ఇది. ఓపెనర్‌గా వచ్చిన ‘బర్త్‌డే బాయ్‌’ పంత్‌ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కార్తీక్‌ క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు (20 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యం) టీమిండియాకూ విజయవకాశాలు ఉన్నాయని అనిపించింది. గత మ్యాచ్‌లో భారీ లక్ష్యమే అయినా దక్షిణాఫ్రికా పోరాడిన తరహాలో భారత్‌ కూడా చెలరేగవచ్చని భావించినా అది సాధ్యం కాలేదు.  

స్కోరు వివరాలు 
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (రనౌట్‌) 68; బవుమా (సి) రోహిత్‌ (బి) ఉమేశ్‌ 3; రోసో (నాటౌట్‌) 100; స్టబ్స్‌ (సి) అశ్విన్‌ (బి) చహర్‌ 23; మిల్లర్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–30, 2–120, 3–207. బౌలింగ్‌: చహర్‌ 4–0–48–1, సిరాజ్‌ 4–0–44–0, అశ్విన్‌ 4–0– 35–0, ఉమేశ్‌ 3–0–34–1, హర్షల్‌ 4–0–49–0, అక్షర్‌ 1–0–13–0.  

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) రబడ 0; పంత్‌ (సి) స్టబ్స్‌ (బి) ఇన్‌గిడి 27; శ్రేయస్‌ (ఎల్బీ) (బి) పార్నెల్‌ 1; కార్తీక్‌ (బి) మహరాజ్‌ 46; సూర్యకుమార్‌ (సి) స్టబ్స్‌ (బి) ప్రిటోరియస్‌ 8; అక్షర్‌ (సి) డి కాక్‌ (బి) పార్నెల్‌ 9; హర్షల్‌ (సి) మిల్లర్‌ (బి) ఇన్‌గిడి 17, అశ్విన్‌ (సి) రబడ (బి) మహరాజ్‌ 2, చహర్‌ (సి) మిల్లర్‌ (బి) ప్రిటోరియస్‌ 31; ఉమేశ్‌ (నాటౌట్‌) 20; సిరాజ్‌ (సి) మిల్లర్‌ (బి) ప్రిటోరియస్‌ 5; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్‌) 178.  వికెట్ల పతనం: 1–0, 2–4, 3–45, 4–78, 5–86, 6–108, 7–114, 8–120, 9–168, 10–178. బౌలింగ్‌: రబడ 4–0–24–1, పార్నెల్‌ 4–0–41–2, ఇన్‌గిడి 3–0–51–2, మహ రాజ్‌ 4–0–34–2, ప్రిటోరియస్‌ 3.3–0–26–3. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top