Ind Vs Eng: ‘లార్డ్స్‌’ సమరం.. ఇటు శార్దూల్‌, అటు స్టువర్ట్‌ బ్రాడ్‌ అవుట్‌!

India vs England 2nd Test in Lords Stadium on thursday - Sakshi

నేటి నుంచి భారత్, ఇంగ్లండ్‌ రెండో టెస్టు

సిరీస్‌లో ఆధిక్యం కోసం ఇరు జట్ల పోరు

బ్యాటింగ్‌ వైఫల్యాలను అధిగమించడంపై దృష్టి

మధ్యాహ్నం గం. 3:30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

వర్షం పడకపోతే తొలి టెస్టులో ఎవరు గెలిచేవారు? మంచి అవకాశం కోల్పోయామని కోహ్లి చెప్పగా... ఆ సమయంలో మ్యాచ్‌ తమ చేతుల్లోనే ఉందని రూట్‌ కూడా వ్యాఖ్యానించాడు. సిరీస్‌లో శుభారంభం చేసే అవకాశం చేజారినా... సుదీర్ఘ సిరీస్‌లో మరోసారి సత్తా చాటి ముందంజలో నిలిచేందుకు ఇరు జట్లకు రెండో అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక లార్డ్స్‌ క్రికెట్‌ మైదానంలో భారత్, ఇంగ్లండ్‌ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు టీమ్‌లలోనూ బ్యాటింగ్‌ బలహీనతలు గత మ్యాచ్‌లో కనిపించగా... వాటిని ఎవరు అధిగమిస్తారనేది చూడాలి.   

లండన్‌: ఇంగ్లండ్‌ గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్‌ గెలవాలని పట్టుదలగా ఉన్న భారత క్రికెట్‌ జట్టు మరో సమరానికి తమ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. గురువారం నుంచి ‘లార్డ్స్‌’లో జరిగే రెండో టెస్టులో కోహ్లి సేన... ఆతిథ్య ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఒకే ఒక మార్పు మినహా టీమిండియా బృందంలో సమస్యలేమీ లేకపోగా... ఇద్దరు ప్రధాన పేసర్ల గాయాలతో ఇంగ్లండ్‌ ఇబ్బంది పడుతోంది. స్వల్ప బ్యాటింగ్‌ సమస్యను మినహాయిస్తే మొత్తంగా ఇంగ్లండ్‌పై ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది.

శార్దుల్‌ అవుట్‌
నాటింగ్‌హామ్‌లో ‘డ్రా’గా ముగిసిన తొలి టెస్టు నుంచి భారత  తుది జట్టులో ఒక మార్పు ఖాయమైంది. పేస్‌ బౌలర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ గాయంతో మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో మరో పేస్‌ బౌలర్‌ ఇషాంత్‌ లేదా ఉమేశ్‌లకు అవకాశం ఇవ్వాలనేది టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ముందున్న ఒక ప్రత్యా మ్నాయం. అయితే ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంతో పోలిస్తే కొంత పొడిగా ఉండే లార్డ్స్‌ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుంటే సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ తుది జట్టులోకి సరిగ్గా సరిపోతాడు. పైగా కొంత బ్యాటింగ్‌ను బలంగా మార్చాలనే కారణంతోనే శార్దుల్‌కు తొలి టెస్టులో అవకాశం దక్కింది. అలా చూస్తే మంచి బ్యాటింగ్‌ చేయగల నైపుణ్యం ఉన్న అశ్విన్‌వైపే మొగ్గు ఎక్కువగా ఉంది.

ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌  తలకు తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే అతని స్థానంలో గత మ్యాచ్‌ ఆడిన కేఎల్‌ రాహుల్‌ చక్కటి బ్యాటింగ్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దాంతో మయాంక్‌ తన చాన్స్‌ కోసం మళ్లీ వేచి చూడాల్సిందే. మరోవైపు భయపడినట్లుగానే భారత ప్రధాన బ్యాటింగ్‌ త్రయం పుజారా, కోహ్లి, రహానే గత టెస్టులోనూ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో వీరు వరుసగా 4, 0, 1 పరుగులు చేశారు. ఈ ముగ్గురిలో కనీసం ఇద్దరు రాణిస్తే తప్ప భారత్‌ భారీ స్కోరుకు అవకాశం ఉండదు. జడేజా ఆదుకోవడంతో సరిపోయింది కాబట్టి భారత్‌ కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఇక్కడ వీరు ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూ టీసీ) ఫైనల్లో విఫలమైన బుమ్రా 9 వికెట్లతో మళ్లీ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. షమీ కూడా కీలక వికెట్లతో సత్తా చాటాడు. వీరికి అశ్విన్‌ పదునైన స్పిన్‌ జత కలిస్తే భారత్‌కు ఎదురుండదు.

పిచ్, వాతావరణం: బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌. మంచి ఎండ కాయడంతో పాటు పోలిస్తే వర్ష సూచన లేకపోవడం సానుకూలాంశం. టాస్‌ గెలిచిన టీమ్‌ బ్యాటింగ్‌ ఎంచుకోవడం ఖాయం.  
తుది జట్లు (అంచనా): భారత్‌: కోహ్లి (కెప్టె న్‌), రోహిత్, రాహుల్, పుజారా, రహానే, పంత్, జడేజా, అశ్విన్, షమీ, బుమ్రా, సిరాజ్‌. ఇంగ్లండ్‌: రూట్, బర్న్స్, సిబ్లీ, హసీబ్‌ హమీద్, బెయిర్‌స్టో, బట్లర్, అలీ, స్యామ్‌ కరన్, రాబిన్సన్, వుడ్, ఒవర్టన్‌/సాఖిబ్‌.

స్టువర్ట్‌ బ్రాడ్‌ అవుట్‌
రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్‌కు భారీ దెబ్బ తగిలింది. సీనియర్‌ పేస్‌ బౌలర్, కెరీర్‌లో 150వ టెస్టు ఆడాల్సి ఉన్న స్టువర్ట్‌ బ్రాడ్‌ గాయం కారణంగా మ్యాచ్‌తో పాటు పూర్తిగా సిరీస్‌కే దూరమయ్యాడు. అతని స్థానంలో మార్క్‌ వుడ్‌ను ఇంగ్లండ్‌ ఎంపిక చేసింది. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ అయిన వుడ్‌ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది చెప్పలేం. ఇక మరో సీనియర్‌ అండర్సన్‌ ఫిట్‌నెస్‌పై కూడా సందేహాలున్నాయి. ఈసీబీ అధికారికంగా ప్రకటించలేదు కానీ గాయం తీవ్రంగా ఉండి అండర్సన్‌ కూడా దూరమైతే ఇంగ్లండ్‌ ఒక్కసారిగా బలహీనంగా మారిపోవడం ఖాయం.

అండర్సన్‌ స్థానంలో ముందు జాగ్రత్తగా సాఖిబ్‌ మహమూద్‌ను జట్టులోకి తీసుకున్నారు. బౌలింగ్‌ ఇలా ఉండగా బ్యాటింగ్‌లో ఆ జట్టు పరిస్థితి మరీ పేలవంగా ఉంది. తొలి టెస్టులో రూట్‌ ఆదుకోకపోయుంటే ఇంగ్లండ్‌ ఎప్పుడో కుప్పకూలి సునాయాసంగా ఓడిపోయేది. సరిగ్గా చెప్పాలంటే గత కొన్నేళ్లలో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ బృందం స్వదేశంలో ఇంత బలహీనంగా ఎప్పుడూ లేదు. బర్న్స్, సిబ్లీ, క్రాలీ, లారెన్స్‌... ఇలా అంతా విఫలం కావడంలో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు! ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీకి మళ్లీ టెస్టు టీమ్‌లో స్థానం లభించింది. భారత్‌పై మంచి రికార్డు ఉన్న అలీ అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో కూడా ప్రభావం చూపించగలడు. క్రాలీ స్థానంలో హమీద్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.

తొలి టెస్టులో ‘స్లో ఓవర్‌ రేట్‌’ను నమోదు చేసిన భారత్, ఇంగ్లండ్‌ జట్లపై ఐసీసీ చర్య తీసుకుంది. ఇరు జట్లకు డబ్ల్యూటీసీ పాయింట్లనుంచి చెరో 2 పాయింట్లు కోత విధించారు. అంటే నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయితే దక్కే 4 పాయింట్లలో ఒక్కో జట్టుకు ఇప్పుడు రెండేసి పాయిట్లు మాత్రమే లభిస్తాయి. దీంతో పాటు మ్యాచ్‌ ఫీజులో ఒక్కో జట్టుకు 40 శాతం జరిమానా కూడా ఐసీసీ విధించింది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top