మనోళ్ల ప్రాక్టీస్‌ ముగిసింది

India Vs County Select XI Practice Match Ended In Draw - Sakshi

భారత్, కౌంటీ సెలెక్ట్‌ ఎలెవన్‌ మ్యాచ్‌ ‘డ్రా’

టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 192/3 డిక్లేర్డ్‌

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: కౌంటీ సెలెక్ట్‌ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను భారత్‌ ‘డ్రా’గా ముగించింది. గురువారం ఆట ఆరంభించిన భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 55 ఓవర్లలో మూడు వికెట్లకు 192 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. రవీంద్ర జడేజా (77 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మ్యాచ్‌లో రెండో అర్ధ సెంచరీని సాధించాడు. అనంతరం రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో సారథి రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌కు దిగలేదు. దాంతో భారత ఇన్నింగ్స్‌ను మయాంక్‌ అగర్వాల్‌ (81 బంతుల్లో 47; 7 ఫోర్లు), పుజారా (58 బంతుల్లో 38; 5 ఫోర్లు) ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు.

మయాంక్, పుజారా అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన హనుమ విహారి (105 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు), జడేజా నిలకడగా బ్యాటింగ్‌ చేశారు. జాక్‌ కార్సన్‌ రెండు వికెట్లు తీశాడు. భారత్‌ ప్రత్యర్థి ముందు 284 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన కౌంటీ జట్టు 15.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 31 పరుగులు చేసిన దశలో ఫలితం తేలదనే ఉద్దేశంతో ఇరు జట్ల కెప్టెన్‌లు కూడా ‘డ్రా’కు అంగీకరించారు. దాంతో రోజు ఆటలో మరో 19 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ ముగిసింది. హసీబ్‌ అహ్మద్‌ (48 బంతుల్లో 13 నాటౌట్‌; 1 ఫోర్‌), జేక్‌ లిబీ (48 బంతుల్లో 17 నాటౌట్‌; 1 ఫోర్‌) అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన హసీబ్‌ అహ్మద్‌ ఇంగ్లండ్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్‌తో జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం 17 మందితో కూడిన జట్టును ఇంగ్లండ్‌ గురువారం
ప్రకటించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top