India vs Bangladesh: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. సిరీస్‌పై కన్నేసిన భారత్‌

India vs Bangladesh 2nd Test 2022:Confident India Eye Clean Sweep - Sakshi

జోరు మీదున్న భారత్‌

నేటి నుంచి బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు

బంగ్లా పోటీనిచ్చేనా!

ఉదయం 9 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించే ప్రయత్నంలో భారత్‌కు మరో సవాల్‌. అందుబాటులో ఉన్న ఆరు టెస్టుల్లో ఐదు గెలిస్తే ఖాయంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరే అవకాశం ఉన్న టీమిండియా ఇందులో మొదటి అంకాన్ని పూర్తి చేసింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ హోరాహోరీగా సాగే అవకాశం ఉండటంతో దానికి ముందు వీలైనన్ని ఎక్కువ పాయింట్లు తమ ఖాతాలో వేసుకోవాలని జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో చివరిదైన రెండో టెస్టులోనూ విజయమే లక్ష్యంగా జట్టు బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌ చివర్లో కాస్త పట్టుదల కనబర్చగలిగిన బంగ్లాదేశ్‌ సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లోనైనా ఎలాంటి పోటీనిస్తుందో చూడాలి. 
 
మిర్పూర్‌:
బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్‌ అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. నేటి నుంచి షేర్‌–ఎ–బంగ్లా స్టేడియంలో జరిగే రెండో టెస్టులో భారత్, బంగ్లాదేశ్‌ తలపడనున్నాయి. బలబలాల దృష్ట్యా చూస్తే మన జట్టు అన్ని రంగాల్లో ప్రత్యర్థి కంటే మెరుగ్గా ఉంది. గత మ్యాచ్‌ తరహాలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిస్తే ఈ మ్యాచ్‌ కూడా టీమిండియా ఖాతాలోకి చేరడం ఖాయం. అయితే ఈ సారైనా కాస్త మెరుగైన ప్రదర్శన ఇస్తే సొంతగడ్డపై బంగ్లా పరువు దక్కించుకోగలదు.  

అదే జట్టుతో...
రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోలుకొని ఈ మ్యాచ్‌కు సిద్ధమై ఉంటే తుది జట్టు ఎంపిక కష్టంగా మారేదేమో! కానీ రోహిత్‌ దూరం కావడంతో మరో మాటకు తావు లేకుండా తొలి టెస్టు ఆడిన టీమ్‌నే భారత్‌ కొనసాగించవచ్చు. ప్రాక్టీస్‌లో రాహుల్‌ గాయపడి కొంత చర్చ మొదలైనా... అది తీవ్రమైంది కాదని, రాహుల్‌ ఆడతాడని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ చెప్పేయడంతో స్పష్టత వచ్చేసింది. నిజానికి ఇప్పుడు అందరికంటే ముందుగా ఆట అవసరం ఉన్నది రాహుల్‌కే. తొలి టెస్టు స్కోరు బోర్డు చూస్తే రాహుల్‌ వైఫల్యమే స్పష్టంగా కనిపిస్తోంది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమైన అతను ఈ సారైనా తన బ్యాటింగ్‌తో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం ఎంతో అవసరం.

గిల్, పుజారా శతకాలతో సత్తా చాటగా శ్రేయస్, పంత్‌ రాణించారు. కోహ్లి కూడా తన స్థాయికి తగినట్లుగా ఆడితే భారత్‌ భారీ స్కోరు సాధించడం ఖాయం. బౌలింగ్‌లో అనూహ్యంగా అశ్విన్‌ నిరాశపర్చాడు. బ్యాటింగ్‌లో రాణించినా, తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన అశ్విన్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌తో సరిపెట్టాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై అతనితో పాటు అక్షర్, కుల్దీప్‌ చెలరేగితే బంగ్లాకు కష్టాలు తప్పవు. పేస్‌ విభాగంలో సిరాజ్, ఉమేశ్‌ల స్థానానికి ఢోకా లేదు. అయితే 12 ఏళ్ల తర్వాత టెస్టు జట్టులోకి ఎంపికైన జైదేవ్‌ ఉనాద్కట్‌ ఆనందం ఎంపికకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. పరిస్థితి చూస్తుంటే తుది జట్టులో అతనికి చోటు కష్టమే!  

తస్కీన్‌కు చోటు...
ఇదే పట్టుదల కాస్త మొదటి ఇన్నింగ్స్‌లో కూడా చూపిస్తే ఎలా ఉండేదో... గత టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తమ ఆట చూసిన తర్వాత బంగ్లాదేశ్‌ బహుశా ఇదే అనుకొని ఉంటుంది. 513 పరుగుల భారీ లక్ష్యం కనిపిస్తున్నా... ఆ జట్టు పూర్తిగా చేతులెత్తేయలేదు. 124 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం సహా 324 పరుగుల వరకు పోరాడగలిగింది. ఇదే స్ఫూర్తితో బ్యాటింగ్‌ చేస్తే ఈ టెస్టులో కాస్త మెరుగైన ఫలితం రాబట్టవచ్చు.

ఓపెనర్లు జాకీర్‌ హసన్, నజ్ముల్‌తో పాటు బ్యాటింగ్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌ కూడా రాణించడం సానుకూలాంశం. అయితే ఇద్దరు ప్రధాన బ్యాటర్లు  ముష్ఫికర్‌ రహీమ్,­ లిటన్‌ దాస్‌ తేలిపోయారు. వీరిద్దరు మిడిలార్డర్‌లో నిలబడితేనే జట్టు కుప్పకూలి పోకుండా ఉంటుంది. వన్డే సిరీస్‌ తరహాలో ఆల్‌రౌండర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ నుంచి బ్యాటింగ్‌లో కూడా మంచి ప్రదర్శనను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. బౌలింగ్‌లో బంగ్లా కూడా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతోనే దిగనుంది. షకీబ్‌ పూర్తి ఫిట్‌గా మారాడని, బౌలింగ్‌ చేస్తాడని కోచ్‌ డొనాల్డ్‌ ప్రకటించడం సానుకూలాంశం. గాయంతో ఉన్న పేసర్‌ ఇబాదత్‌ స్థానంతో తస్కీన్‌ తుది జట్టులోకి వస్తాడు.  

తుది జట్ల వివరాలు (అంచనా)  
భారత్‌: రాహుల్‌ (కెప్టెన్‌), గిల్, పుజారా, కోహ్లి, పంత్, శ్రేయస్, అక్షర్, అశ్విన్, కుల్దీప్, ఉమేశ్, సిరాజ్‌.  బంగ్లాదేశ్‌: షకీబ్‌ (కెప్టెన్‌), నజ్ముల్, జాకీర్, యాసిర్, లిటన్‌ దాస్, ముష్ఫికర్, నూరుల్, మెహదీ హసన్, తైజుల్, తస్కీన్, ఖాలెద్‌.

పిచ్, వాతావరణం  
మ్యాచ్‌లో ఎక్కువ భాగం స్పిన్నర్లకే అనుకూలం. అయితే ఆరంభంలో బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తూ స్వేచ్ఛగా పరుగులు చేసేందుకు అవకాశం ఉంది. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకోవడం సరైన నిర్ణయం.  వర్ష సూచన లేదు.

16: పుజారా మరో 16 పరుగులు చేస్తే టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top