 
													నేడు భారత్, ఆస్ట్రేలియా రెండో టి20
మధ్యాహ్నం గం. 1:45 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
మెల్‌బోర్న్: తొలి టి20 మ్యాచ్ వర్షంతో రద్దయిన తర్వాత భారత్, ఆ్రస్టేలియా తర్వాతి పోరుకు సిద్ధమయ్యాయి. నేడు ఎంసీజీలో జరిగే రెండో టి20లో ఇరు జట్లు తలపడతాయి. గత మ్యాచ్‌లో ఫలితం రాకపోయినా... ఆట ముగిసేసరికి టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది.
ఈ నేపథ్యంలో అదే జోరును కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు ఆసీస్ కూడా సొంతగడ్డపై విజయంతో ఆధిక్యంలో నిలవాలని భావిస్తోంది. భారత జట్టు ఎంసీజీలో తాము ఆడిన ఆరు టి20ల్లో నాలుగు గెలిచింది. మ్యాచ్‌కు వర్షసూచన ఉంది.
మార్పుల్లేకుండా... 
కాన్‌బెర్రా మ్యాచ్‌లో ఇరు జట్లకు కూడా తమ ఆటగాళ్లను పెద్దగా పరీక్షించే అవకాశం రాలేదు. దాంతో తుది జట్టులో ఎలాంటి మార్పూ లేకుండా టీమ్‌లు బరిలోకి దిగడం ఖాయం. దూకుడుకు మారుపేరైన అభిõÙక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చేందుకు ఇది మరో అవకాశం. గిల్, సూర్య కూడా చక్కటి షాట్లతో ఆకట్టుకున్నారు. తిలక్ వర్మ, సామ్సన్, దూబేలతో భారత బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. సీనియర్ బుమ్రాతో పాటు హర్షిత్ పేస్ బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటాడు. 
కుల్దీప్, వరుణ్‌ల స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఆసీస్ బ్యాటర్లకు అంత సులువు కాదు. మరోవైపు ఆసీస్ బృందంలోనూ హిట్టర్లకు కొదవ లేదు. కెప్టెన్ మార్ష్, హెడ్, టిమ్ డేవిడ్, స్టొయినిస్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించగల బ్యాటర్లు. ఇన్‌గ్లిస్, ఒవెన్, ఫిలిప్ రూపంలో దూకుడుగా ఆడగల ఇతర ఆటగాళ్లూ ఉన్నారు. భారీ స్కోరు సాధించేందుకు, భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు కావాల్సిన బృందం ఆసీస్ వద్ద ఉంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
