తమ 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు అతి భారీ విజయం సాధించింది. ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలవడంతో ఈ ఘనత సాధించింది. ఇన్నింగ్స్ తేడా పరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 1932లో తొలి టెస్ట్ ఆడిన భారత్.. ఇప్పటివరకు ఇన్నింగ్స్ పరంగా ఇంత భారీ విజయం సాధించలేదు.
2018లో రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌పై సాధించిన ఇన్నింగ్స్ 272 పరుగుల విజయం ఈ మ్యాచ్‌కు ముందువరకు వరకు భారత జట్టు అతి పెద్ద విజయంగా ఉండింది. ఇన్నింగ్స్ తేడా పరంగా భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-5 అతి పెద్ద విజయాలు ఇలా ఉన్నాయి.
ఆఫ్ఘనిస్తాన్‌పై, ముల్లాన్‌పూర్ (2026) – ఇన్నింగ్స్ & 300 పరుగులు
వెస్టిండీస్‌పై, రాజ్‌కోట్ (2018) – ఇన్నింగ్స్ & 272 పరుగులు
ఆఫ్ఘనిస్తాన్‌పై, బెంగళూరు (2018) – ఇన్నింగ్స్ & 262 పరుగులు
బంగ్లాదేశ్‌పై, మీర్‌పూర్ (2007) – ఇన్నింగ్స్ & 239 పరుగులు
శ్రీలంకపై, నాగ్‌పూర్ (2017) – ఇన్నింగ్స్ & 239 పరుగులు
భారత గడ్డపై ఇన్నింగ్స్ తేడాతో నమోదైన అతిపెద్ద విజయాల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది. 1958లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌పై వెస్టిండీస్ సాధించిన ఇన్నింగ్స్ మరియు 336 పరుగుల విజయం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.
ఆసియా జట్ల పరంగా చూస్తే, 2002లో లాహోర్‌లో పాక్ న్యూజిలాండ్‌పై సాధించిన ఇన్నింగ్స్ మరియు 324 పరుగుల విజయం తర్వాత, భారత్ తాజా విజయం రెండో అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం.
కాగా, ముల్లాన్‌పూర్ టెస్ట్‌లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చలాయించి, ఏకపక్ష విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126) సెంచరీలతో.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో చెలరేగడంతో భారత్ 564-8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
అనంతరం భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగి ఆఫ్ఘనిస్తాన్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లో (152, 112) అతి స్వల్ప స్కోర్లకే కుప్పకూల్చారు. ఫలితంగా ఆ జట్టు ఘోర ఇన్నింగ్స్ పరాభవాన్ని మూటగట్టుకుంది.
అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 1), వాషింగ్టన్ సుందర్ (1, 4) ఆఫ్ఘన్ల భరతం పట్టారు. వీరికి కుల్దీప్ (3), ప్రసిద్ద్ కృష్ణ (3) జత కలిశారు. తొలి టెస్ట్‌లోనే 7 వికెట్ల ప్రదర్శనతో మెరిసిన మానవ్ సుతార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


