Team India: ఇలా అయితే వరల్డ్‌కప్‌ కొట్టేది ఎలా?

India Lost ODI Series-Australia-Danger Bells Cannot Win ODI WC In Home - Sakshi

అక్టోబర్‌-నవంబర్‌లో భారత గడ్డపై ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్‌ జరగనుంది. 2011 తర్వాత మళ్లీ పుష్కర కాలానికి మెగా సమరానికి భారత్‌ ఆతిథ్యమిమవ్వనుంది. అప్పుడు ధోని సేన సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ సాధించి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఆ అవకాశం రావడం.. ఈసారి రోహిత్‌ సేన కప్‌ కొట్టడం గ్యారంటీ అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఇలాంటి నాసిరకమైన ఆటతీరుతో అసలు వన్డే వరల్డ్‌కప్‌ గెలుస్తుందా అని సగటు అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ జరుగబోతున్న వేళ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మన లోపాలు బయటపడ్డాయి. అసలు తొలి వన్డేలో మనోళ్లు మొదట బ్యాటింగ్‌ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో. ఏదో అదృష్టం కొద్ది ఆసీస్‌ వాళ్లు తక్కువ స్కోరుకు ఆలౌట్‌ కావడంతో టార్గెట్‌ తక్కువైంది. కానీ ఆ స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమిండియా అష్టకష్టాలు పడి చేధించింది.

సరే ఎలాగోలా తొలి వన్డే గెలిచాం కదా అనుకుంటే రెండో వన్డేలో మన బ్యాటింగ్‌ తీరు తేలిపోయింది. 117 పరుగులకే కుప్పకూలిన టీమిండియా తరపున కోహ్లి, అక్షర్‌ పటేల్‌లు కాస్త మెరుగ్గా రాణించారని చెప్పొచ్చు. ఇక మూడో వన్డేలో చేజింగ్‌ సమయంలో కోహ్లి, కేఎల్‌ రాహుల్‌లు ఉన్నంతవరకు మ్యాచ్‌ టీమిండియా వైపే ఉంది. కానీ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌ ఔటయ్యాకా టీమిండియా పరిస్థితి మారిపోయింది. అయితే పాండ్యా 40 పరుగులతో కాస్త స్థిరంగా ఆడడం.. జడేజా ఉండడంతో మ్యాచ్‌ విజయంపై మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్‌ కావడంతో టీమిండియా ఓటమి ఖరారైంది.

వరల్డ్‌కప్‌ ఆడేది సొంతగడ్డపై అయినప్పటికి ఇలాంటి ఆటతీరుతో టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ కొట్టడం సాధ్యం కాకపోవచ్చు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత జరిగే వన్డే సిరీస్‌లో తమ ఆటతీరును మార్చుకుంటే టీమిండియాకు మేలు. అయితే వన్డే వరల్డ్‌కప్‌కు ఎక్కువగా సమయం కూడా లేదు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత మహా అయితే నాలుగు నెలల సమయం ఉంటుంది. ఆలోగా టీమిండియా తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవడం ఉత్తమం. అలా అయితేనే మరోసారి సొంతగడ్డపై వరల్డ్‌కప్‌ అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

ఇక టెస్టుల్లో, టి20ల్లో ఆస్ట్రేలియా ఆట ఎలా ఉన్నా వన్డేలకు వచ్చేసరికి మాత్రం వారు ఎప్పుడు బలంగానే కనిపిస్తారు. మూడో వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో 20 పరుగులు కేవలం ఫీల్డింగ్‌ వల్ల రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే వన్డేల్లో ఐదుసార్లు ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా అవతరించింది.

చదవండి: బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం.. సిరీస్‌ సమర్పయామి 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top