టీమిండియాకు జరిమానా

India Fined For Slow Over Rate In 5th T20I - Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ గెలిచి మంచి జోష్‌లో ఉన్న టీమిండియాకు జరిమానా పడింది. నిన్న(శనివారం) జరిగిన చివరి టీ20లో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసిన టీమిండియాకు జరిమానా విధిస్తూ మ్యాచ్‌ రిఫరీ జవగల్‌ శ్రీనాథ్‌ నిర్ణయం తీసుకున్నారు. టీమిండియా మ్యాచ్‌ ఫీజులో 40 శాతం జరిమానా విధించారు. స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసిన విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంగీకరించడంతో ఎటువంటి విచారణ లేకుండానే జరిమానాతో సరిపెట్టారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) ఓ ప్రకటన విడుదల చేసింది. నాల్గో టీ20లో ఇంగ్లండ్‌ స్లో ఓవర్‌ రేట్‌  నమోదు చేయడంతో ఆ జట్టుకు జరిమానా పడిన సంగతి తెలిసిందే. 

చివరి మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించడంతో సిరీస్‌ను దక్కించుకుంది.  ఫలితంగా వరుసగా ఆరో టీ20 సిరీస్‌ను టీమిండియా ఖాతాలో వేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 224 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్‌ కోహ్లి(80 నాటౌట్‌; 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దుమ్ములేపగా, రోహిత్‌ శర్మ(64; 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసకర ఆటతో అదరగొట్టాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి శుభారంభాన్ని అందించింది. ఆపై సూర్యకుమార్‌ యాదవ్‌(32; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్‌ చేయగా, హార్దిక్‌ పాండ్యా(39 నాటౌట్‌; 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టచ్‌లోకి వచ్చాడు. ఆపై ఇంగ్లండ్‌ను 188 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top