
లార్డ్స్ టెస్టులో అనుహ్య ఓటమి తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్‌తో మరో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. జూలై 23 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డు మైదానం వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తుంటే.. భారత్ మాత్రం ప్రత్యర్ధిని ఎలాగైనా ఓడించి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఈ కీలకపోరుకు ముందు మాంచెస్టర్‌లో గత రికార్డులు టీమిండియాను భయపెడుతున్నాయి.
ఇంగ్లండ్‌దే పైచేయి..
ఈ పర్యటనలో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో విజయం సాధించి ఇంగ్లండ్ కంచుకోటను బద్దలు కొట్టిన భారత జట్టు.. ఇప్పుడు మాంచెస్టర్‌పై కన్నేసింది. ఇప్పటివరకు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డు మైదానంలో టీమిండియా ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా గెలవలేదు. ఈ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య మొత్తం తొమ్మిది టెస్టులు జరిగాయి.
అందులో ఇంగ్లండ్ నాలుగింట విజయం సాధించగా.. మరో ఐదు టెస్టులు డ్రాగా ముగిశాయి. ఈ మైదానంలో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ 1936లో ఆడింది. అప్పటి నుంచి భారత జట్టుకు విజయం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. భారత జట్టు చివరసారిగా ఈ వేదికలో 2014లో టెస్టు మ్యాచ్ ఆడింది. మళ్లీ ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక మైదానంలో భారత్ ఆడనుంది.
భారత ఓటమికి కారణమిదే..?
ఇప్పటివరకు ఈ మైదానంలో భారత జట్టు విజయం సాధించికపోవడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఈ మైదానంలో పిచ్ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తోంది. ఈ గ్రీన్ టాప్ వికెట్‌పై పేసర్లు పండగ చేసుకుంటారు. ఇటువంటి పిచ్‌పై ఆసియా జట్లకు ఆడడం చాలా కష్టంగా ఉంటుంది.
బ్యాటర్లు స్వింగింగ్ కండీషన్స్‌కు అలవాటు పడకపోవడంతో ఈ మైదానంలో ఏషియన్ జట్లు ఎక్కువగా ఓటమి చవిచూడాల్సి వస్తోంది. ఈ మైదానంలో ఇంగ్లండ్ జట్టుకు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 84 టెస్టుల్లో ఆతిథ్య జట్టు 33 మ్యాచ్‌ల్లో, 15 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది.
మిగిలిన 36 మ్యాచ్‌లను డ్రాగా ముగిసింది. ఈ మైదానంలో భారత అత్యధిక స్కోర్ 390 పరుగులగా ఉంది. ప్రస్తుతం భారత జట్టులో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ మినహా మిగితా ఎవరూ కూడా మైదానంలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. టీమిండియా తరపున ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సునీల్ గవాస్కర్ ఉన్నారు. ఆయన ఈ మైదానంలో మూడు టెస్టులు ఆడి 242 పరుగులు చేశాడు.
మాంచెస్టర్‌లో భారత రికార్డులు
అత్యధిక స్కోరు: 119.2 ఓవర్లలో 432/10 (ఆగస్టు 1990).
అత్యల్ప స్కోరు: 21.4 ఓవర్లలో 58/10 (జూలై 1952).
అతిపెద్ద ఓటమి (ఇన్నింగ్స్ వారీగా): 1952లో భారత్‌ను ఇంగ్లండ్ ఇన్నింగ్స్ అండ్ 207 పరుగుల తేడాతో ఓడించింది.
అతిపెద్ద ఓటమి (పరుగులు వారీగా): జూలై 1959లో భారత్‌ను 171 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఓడించింది.
అత్యధిక పరుగులు: సునీల్ గవాస్కర్ మూడు టెస్టుల్లో 242 పరుగులు.
అత్యధిక స్కోరు: ఆగస్టు 1990లో మహ్మద్ అజారుద్దీన్ 243 బంతుల్లో 179 పరుగులు.
అత్యధిక సగటు: సచిన్ టెండూల్కర్ 187.00 (ఒక టెస్ట్‌లో 187 పరుగులు).
సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే: సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ మర్చంట్, అబ్బాస్ అలీ బేగ్, పాలీ ఉమ్రిగర్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, మహ్మద్ అజారుద్దీన్ సచిన్ టెండూల్కర్.