ఆసియా క్రీడల్లో తొమ్మిదో రోజు భారత్ ఖాతాలో 8 పతకాలు
4 రజతాలు, 4 కాంస్యాలతో మెరిసిన మన బృందం
ఆరు పతకాలు అందించిన అథ్లెటిక్స్
తెలంగాణ షూటర్ ఇషా సింగ్‌కు రజతం
కురాష్‌లో పింకీకి కాంస్యం
వరుసగా రెండో రోజు స్వర్ణానికి దూరం
45 పతకాలతో 12వ స్థానంలో భారత్
ఎనిమిది పతకాలు... ఆసియా క్రీడల్లో సోమవారం భారత్ ఖాతాలో ఒకేరోజు అత్యధిక పతకాలు చేరాయి. వీటిలో ఆరు పతకాలతో అథ్లెటిక్స్ విభాగంలో అంచనాలను అందుకుంది. తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ఎట్టకేలకు రజత రూపంలో ఈసారి క్రీడల్లో తన తొలి పతకాన్ని అందుకోగా, కురాష్ లో పింకీ బల్హారా కంచు మోత మోగించింది.
జావెలిన్ త్రోలో యశ్విర్ సింగ్, రోహిత్ యాదవ్ సత్తా చాటగా... లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్ మురళీ, 1500 మీటర్లలో గుల్వీర్ సింగ్, 5000 మీటర్లలో పారుల్, 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్య పతకధారులుగా నిలిచారు. మొత్తంగా ఎనిమిది రజతాలు, ఎనిమిది కాంస్యాలు దక్కినా... ఏషియాడ్‌లో వ్యక్తిగత పసిడి పతకం మాత్రం భారత్‌కు అందనంత దూరంగా నిలిచిపోయింది. దాంతో పతక జాబితాలో మన జట్టు ప్రస్తుతం 12వ స్థానంలోనే కొనసాగుతోంది.
ఈసారీ జావెలిన్‌లో రెండు...
పురుషుల జావెలిన్ త్రోలో గత ఆసియా క్రీడల తరహాలోనే ఈసారి కూడా భారత్ రెండు పతకాలు సొంతం చేసుకోవడం విశేషం. అయితే 2023 క్రీడల్లో నీరజ్ చోప్రా స్వర్ణం అందించగా... ఈసారి మన త్రోయర్లు రజత, కాంస్యాలను అందుకున్నారు. యశ్వీర్ సింగ్ జావెలిన్‌ను 85.72 మీటర్లు విసిరి రజతం సాధించగా, 84.35 మీటర్లతో రోహిత్ యాదవ్‌కు కాంస్యం లభించింది.
ఈ సీజన్‌లో అసాధారణ ఫామ్‌లో ఉన్న శ్రీలంక త్రోయర్ రుమేశ్ పతిరగే (88.55 మీటర్లు) ఊహించినట్లుగానే స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 80.29 మీటర్లు) నాలుగో స్థానానికే పరిమితమయ్యాడు. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో నీరజ్ పసిడి గెలవగా, కిషోర్ జెనాకు రజతం లభించింది. ఇటీవలి కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం గెలిచిన యశ్విర్‌కు ఆసియా క్రీడల్లో ఇదే తొలి పతకం కాగా, రోహిత్ యాదవ్‌కు సీనియర్ స్థాయిలో ఇదే తొలి అంతర్జాతీయ పతకం.
గాయంతో తప్పుకొని...
భారత లాంగ్‌జంపర్ శ్రీశంకర్ మురళీ వరుసగా రెండో ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. సోమవారం జరిగిన ఈవెంట్‌లో 8.07 మీటర్లు దూకిన మురళీ రెండో స్థానంతో ముగించాడు. చైనాకు చెందిన షి యుహావో (8.17 మీటర్లు) స్వర్ణం గెలుచుకోగా, అన్వరోవ్ (ఉజ్బెకిస్తాన్–8.06 మీటర్లు)కు కాంస్యం దక్కింది. మరో భారత జంపర్ డేవిడ్ సొలొమన్ (7.70 మీటర్లు)కు ఏడో స్థానం దక్కింది. తన రెండో ప్రయత్నంలో 8.07 మీటర్లు నమోదు చేసిన శ్రీశంకర్ నాలుగో ప్రయత్నంలో గాయపడ్డాడు. మడమకు గాయంతో తప్పుకున్న అతను తర్వాతి రెండు ప్రయత్నాలు చేయకుండానే నిష్క్రమించినా రజతం మాత్రం దక్కించుకోగలిగాడు. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన శ్రీశంకర్‌కు 2023 ఆసియా క్రీడల్లోనూ రజతమే దక్కింది.
ఇషా ‘షూటాఫ్’ క్షణాలను దాటి...
మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ రజత పతకం గెలుచుకుంది. ఫైనల్లో ఇషా సింగ్ (38 పాయింట్లు) సాధించగా, చైనాకు చెందిన జియోవో జియా రిగ్జిన్ కూడా 38 పాయింట్లే స్కోర్ చేసింది. అయితే హోరాహోరీగా సాగిన ఈ పోరులో రెండు ‘షూటాఫ్’లతో ఫలితం తేలింది. తొలిసారి ఇద్దరూ 4 పాయింట్లే సాధించడంతో స్కోరు సమమై మళ్లీ ‘షూటాఫ్’ అవసరమైంది. ఈసారి చైనా ప్లేయర్ 3 పాయింట్లు సాధించగా, 2 పాయింట్లకు పరిమితమైన ఇషాకు రజతం
లభించింది. కిమ్ హ్యోన్ సుక్ (ఉత్తర కొరియా; 34 పాయింట్లు) కాంస్యం గెల్చుకుంది.
టాప్–2కు వెళ్లే క్రమంలో హ్యోన్ సుక్‌తో కూడా ఇషా సింగ్ 3 ‘షూటాఫ్’లలో తలపడి చివరకు పైచేయి సాధించింది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో ఆరంభంలో ఇషా బాగా తడబడింది. ‘ప్రిసిషన్’ రౌండ్‌ల తర్వాత ఆరో స్థానానికి పడిపోయిన ఆమె, ర్యాపిడ్ రౌండ్ తర్వాత ఎనిమిదో స్థానానికి దిగజారిపోయింది. అయితే ఓవరాల్‌గా ఆమె సాధించిన 580 పాయింట్లు ఆఖరి స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించేందుకు సరిపోయాయి. 9వ స్థానంలో నిలిచిన చైనీస్ తైపీ షూటర్ చెంగ్ చింగ్ కూడా 580 పాయింట్లే స్కోర్ చేసినా...ఎక్కువ ‘ఇన్నర్ 10’ పాయింట్లతో ఇషా ముందంజ వేసింది. ఇదే ఈవెంట్‌లో 579 పాయింట్లతో అగ్రశ్రేణి భారత షూటర్ మనూ భాకర్ 11వ స్థానానికే పరిమితమై ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయింది. మరో భారత షూటర్ రాహీ 30వ స్థానంతో ముగించింది.
తల్లి చేసిన ఫోన్ కాల్‌తో..
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్, 25 మీటర్ల పిస్టల్ టీమ్... రెండు ఈవెంట్లలోనూ వైఫల్యంతో ఇషా సింగ్ పతకాలకు దూరమైంది. అంచనాలు అందుకోవడంలో విఫలమైన షూటింగ్ బృందంపై ఇప్పటికే అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇషాపై కూడా తీవ్ర ఒత్తిడి పెరిగింది. సోమవారం పోటీకి ముందు రోజు రాత్రి కూడా ఆమె నిద్రపోకుండా మానసికంగా బాగా ఇబ్బందికర పరిస్థితిలో నిలిచింది. ఈ సమయంలో ఆమె తల్లి చేసిన ఫోన్ కాల్ ఇషాకు కొత్త ప్రేరణను అందించింది. ప్రేమగానే అయినా ఇషాను ఆమె గట్టిగా తిట్టేసింది!
తాను ఏదో చెప్పబోయినా... అనవసరంగా అతిగా ఆలోచించకుండా నోరు మూసుకొని పడుకోమంటూ గట్టిగా చెప్పేసింది. దాంతో మౌనంగా ఉండిపోయిన ఇషా అసలు ఈవెంట్ సమయంలో ప్రశాంతంగా ఆటపై దృష్టి పెట్టింది. వేర్వేరు కారణాలతో ఈవెంట్ సుదీర్ఘంగా సాగడంతో చేతికి, భుజానికి తీవ్రంగా నొప్పి బాధించినా ఇషా తొణకలేదు. పైగా ఏకంగా ఐదు ‘షూటాఫ్’ షాట్‌లు ఆమెను మానసికంగా మరింత తీవ్రంగా అలసిపోయేలా చేశాయి. అయితే సరే వాటిని అధిగమించి రజతంతో వెనుదిరగడం విశేషం. ఆసియా క్రీడల్లో ఇషాకు ఇది ఐదో పతకం. 2023 క్రీడల్లో ఆమె నాలుగు పతకాలు సాధించింది.
గుల్వీర్‌కు రెండో రజతం...
ఆసియా క్రీడల్లో ఈసారి ఇప్పటికే 10,000 మీటర్ల పరుగులో రజతం గెలుచుకున్న గుల్వీర్ సింగ్ ఇప్పుడు మరో వెండి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల 1500 మీటర్ల పరుగును 3 నిమిషాల 36.72 సెకన్లలో పూర్తి చేసిన గుల్వీర్ రెండో స్థానంలో నిలిచాడు. జపాన్‌కు చెందిన ఇజావా కజుటో (3 నిమిషాల 36.35 సెకన్లు) స్వర్ణం అందుకోగా, మోరి నగియా (జపాన్; 3 నిమిషాల 37.92 సెకన్లు) కాంస్యం దక్కించుకున్నాడు.
ఇదే ఈవెంట్‌లో బరిలోకి దిగిన మరో భారత అథ్లెట్ యూనుస్ షా (3 నిమిషాల 43.88 సెకన్లు) 9వ స్థానంతో ముగించాడు. మహిళల డిస్కస్‌త్రోలో సీమా (59.88 మీటర్లు) నాలుగో స్థానంలో, సాన్యా యాదవ్ (49.90 మీటర్లు) ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో సంతోష్ కుమార్ (49.95 సెకన్లు) ఏడో స్థానానికి పరిమితమయ్యాడు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఫైనల్లో అవినాశ్ సాబ్లే (8ని:21.67 సెకన్లు) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 4్ఠ100 మీటర్ల రిలే ఫైనల్లో భారత బృందం (అభినయ, స్నేహ, సుదేష్ణ, తమన్నా) 43.57 సెకన్లతో నాలుగో స్థానం సాధించింది.
పీటీ ఉష రికార్డును బద్దలుకొట్టి...
మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో భారత అథ్లెట్ విత్య రామ్‌రాజ్‌కు కాంస్యం లభించింది. పరుగును 54.75 సెకన్లలో పూర్తి చేసిన విత్య 3వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 42 ఏళ్ల క్రితం 1984 లాస్‌ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెటిక్స్ దిగ్గజం పీటీ ఉష నెలకొల్పిన 55.42 సెకన్ల టైమింగ్ జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఈవెంట్‌లో మరియమ్ కరీమ్ (యూఏఈ; 54.31 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, అడెలినా జెమ్స్ (కజకిస్తాన్; 54.58 సెకన్లు) రజతం సాధించింది. బరిలో నిలిచిన మరో భారత అథ్లెట్ అను రాఘవన్ (55.88 సెకన్లు) ఐదో స్థానానికే పరిమితమైంది. తమిళనాడుకు చెందిన విత్యకు ఈ క్రీడల్లో ఇది రెండో పతకం. 4్ఠ400 మిక్స్‌డ్ రిలేలో రజతం గెలిచిన భారత జట్టులో ఆమె సభ్యురాలు.
పారుల్ వరుసగా రెండో రోజు...
భారత అథ్లెట్ పారుల్ చౌధరీ వరుసగా రెండో రోజు ఆసియా క్రీడల పతకాన్ని గెలుచుకోవడం విశేషం. ఆదివారం మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో కాంస్యం నెగ్గిన ఆమె... సోమవారం మహిళల 5000 మీటర్లు పరుగులో కూడా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ పరుగును పారుల్ 15 నిమిషాల 14.61 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. విన్‌ఫ్రెడ్ యావి (బహ్రెయిన్; 15 నిమిషాల 10.18 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, నొజొమి తనకా (జపాన్; 15 నిమిషాల 14.61 సెకన్లు)కు కాంస్యం దక్కింది. 2023 ఆసియా క్రీడల్లో ఇదే ఈవెంట్‌లో పారుల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
‘కురాష్ ’లో ఖుషీ...
మార్షల్ ఆర్ట్స్‌ను పోలి ఉండే యుద్ధ క్రీడ కురాష్ కు ఉజ్బెకిస్తాన్ తదితర మధ్య ఆసియా దేశాల్లో ఎక్కువ గుర్తింపు ఉంది. జాకెట్‌లు ధరించి బరిలోకి దిగే ఆటగాళ్లు ప్రత్యర్థిని పడగొట్టడంతో పాయింట్లు లభిస్తాయి. ఈ ఆటలో దశాబ్దకాలానికి జూనియర్, సీనియర్ విభాగాల్లో తనదైన ముద్ర వేసి సాగుతున్న పింకీ బల్హారా ఆసియా క్రీడల్లో తన రెండో పతకాన్ని అందుకుంది. మహిళల 78 కేజీల విభాగంలో ఆమె సెమీఫైనల్లో ఓడి కాంస్యం గెలుచుకుంది. దక్షిణ కొరియాకు చెందిన సుమిమ్ మో చేతిలో 0–5తో పరాజయంపాలై పింకీ కంచు పతకాన్ని అందుకుంది. ఢిల్లీకి చెందిన పింకీ 2018 ఆసియా క్రీడల కురాష్‌లో 52 కేజీల కేటగిరీలో రజతపతకం సాధించింది.


