IND Vs Sri Lanka: మార్పులతో బరిలోకి ధావన్‌ సేన.. వరుణ్‌కి చాన్స్‌!

India and Sri Lanka begin three match T20 series - Sakshi

నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టి20

అరంగేట్రానికి వరుణ్‌ చక్రవర్తి సిద్ధం

రాత్రి గం. 8 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్షప్రసారం

కొలంబో: వన్డే సిరీస్‌ ముగిసింది. ధనాధన్‌ షాట్లతో సాగే పొట్టి సమరానికి వేళైంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి వన్డేలో సమష్టిగా రాణించి భారత్‌పై నెగ్గిన శ్రీలంక ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. బ్యాటింగ్‌ లోపాలను సరిదిద్దుకొని టి20 సిరీస్‌లో శుభారంభం చేసేందుకు శిఖర్‌ ధావన్‌ బృందం సిద్ధమైంది. 

వరుణ్‌కు చాన్స్‌!
తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)తో సత్తాచాటి... యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్‌లో తన మిస్టరీ బంతులతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డ వరుణ్‌ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యలతో అరంగేట్రం చేయకుండానే ఇంటిబాట పట్టాడు. అతడికి శ్రీలంక పర్యటన రూపంలో మరో అవకాశం లభించింది. టి20 ప్రపంచకప్‌కు ఎంతో సమయం లేకపోవడంతో 29 ఏళ్ల వరుణ్‌ను పరీక్షించేందుకు ఇదే సరైన సమయం. దాంతో అతడికి తొలి టి20లో చాన్స్‌ దొరికే అవకాశం ఉంది.

జట్టు కూర్పు విషయానికి వస్తే ఓపెనర్లుగా ధావన్, పృథ్వీ షా కొనసాగనున్నారు. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్, సంజూ సామ్సన్, సూర్యకుమార్‌ యాదవ్‌ మిడిల్‌ ఆర్డర్‌ బాధ్యతను మోయనున్నారు. ఆల్‌రౌండర్లుగా పాండ్యా బ్రదర్స్‌... కృనాల్, హార్దిక్‌ బరిలోకి దిగుతారు. దాంతో మనీశ్‌ పాండే బెంచ్‌కే పరిమతం అయ్యే అవకాశం ఉంది. చివరి వన్డేలో విశ్రాంతి తీసుకున్న భువనేశ్వర్, దీపక్‌చహర్‌ మళ్లీ జట్టులోకి రానున్నారు. స్పిన్నర్లుగా వరుణ్‌ చక్రవర్తి, చహల్‌/రాహుల్‌ చహర్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఆత్మవిశ్వాసంతో లంక...
కొత్త సారథి దసున్‌ షనక నాయకత్వంలోని శ్రీలంక నిలకడగా రాణిస్తోంది. రెండో వన్డేలో విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయిన ఆ జట్టు... మూడో వన్డేలో భారత్‌ను ఓడించి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టి20 సిరీస్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. అవిష్క ఫెర్నాండో సూపర్‌ ఫామ్‌లో ఉండటం... గత మ్యాచ్‌తో రాజపక్స కూడా టచ్‌లోకి రావడం ఆ జట్టుకు సానుకూల అంశాలు.

పిచ్, వాతావరణం
వన్డే సిరీస్‌కు వేదికైన ప్రేమదాస స్టేడియంలోనే టి20 సిరీస్‌ కూడా జరగనుంది. పిచ్‌ బ్యాటింగ్‌తో పాటు స్పిన్నర్లకు అనుకూలించనుంది. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం సూచన ఉంది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఉరుములతో కూడిన వాన పడే అవకాశం ఉంది.

జట్ల అంచనా
భారత్‌: ధావన్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్, సంజూ సామ్సన్, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, దీపక్‌ చహర్, భువనేశ్వర్, వరుణ్‌ చక్రవర్తి, చహల్‌/రాహుల్‌ చహర్‌.
శ్రీలంక: దసున్‌ షనక (కెప్టెన్‌), అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భానుక, రాజపక్స, ధనంజయ డిసిల్వా, అసలంక, కరుణరత్నే, అకిల ధనంజయ, జయవిక్రమ, చమీర, రమేశ్‌ మెండిస్‌.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top