IND VS WI 2nd ODI: విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్‌, ధోని సరసన..!

IND VS WI: Virat Kohli To Join Sachin, Dhoni, Yuvraj In Elite List During 2nd ODI - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పరుగులు సాధించినా, సాధించకపోయినా రికార్డులు మాత్రం అతని ఖాతాలో వాటంతట అవే వచ్చి చేరుతుంటాయి. విండీస్‌తో రేపు జరగబోయే రెండో వన్డేలో కోహ్లి ఖాతాలో ఇలాంటి ఓ అరుదైన రికార్డే వచ్చి చేరబోతోంది. కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి సెంచరీ సాధించి రెండేళ్లకుపైగానే అవుతుంది. అయితే రేపటి మ్యాచ్‌లో అతని సెంచరీ దాహం తీరనుంది. అదెట్టా అనుకుంటున్నారా..? ఇది చదవండి.

విండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా రేపు జరగబోయే రెండో వన్డే, విరాట్ కోహ్లికి స్వదేశంలో 100వ వన్డే మ్యాచ్ కానుంది. వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 258 మ్యాచ్‌లు ఆడిన రన్‌ మెషీన్‌.. స్వదేశంలో 99 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్‌ చరిత్రలో ఇలా స్వదేశాల్లో 100 వన్డేలు ఆడిన ఆటగాళ్లు కోహ్లి కంటే ముందు 35 మంది మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా నుంచి సచిన్ టెండూల్కర్(164), ఎంఎస్‌ ధోని(127), అజహారుద్దీన్(113), యువరాజ్‌ సింగ్‌(108)లు ఉన్నారు. రేపటి మ్యాచ్‌లో కోహ్లి వీరి సరసన చేరనున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ కొట్టినా, కొట్టకపోయినా.. పరోక్షంగా అతని ఖాతాలో మరో సెంచరీ చేరడం ఖాయం. ఇదిలా ఉంటే, కోహ్లి స్వదేశంలో ఆడిన 99 మ్యాచ్‌ల్లో 60 సగటుతో 5002 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

కాగా, విండీస్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లు చహల్‌(4/49), వాషింగ్టన్‌ సుందర్‌(3/30), ప్రసిద్ద్‌ కృష్ణ(2/29), సిరాజ్‌(1/26) చెలరేగడంతో విండీస్‌ 176 పరుగుల స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. జేసన్‌ హోల్డర్‌(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్‌ సెంచరీతో రాణించాడు. అనంతరం ఛేదనలో రోహిత్‌ శర్మ(60), ఇషాన్‌ కిషన్‌(28) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి టీమిండియా గెలుపుకు పునాది వేయగా, ఆఖర్లో సూర్యకుమార్‌ యాదవ్‌(36 బంతుల్లో 34; 5 ఫోర్లు), దీపక్‌ హూడా(32 బంతుల్లో 26; 2 ఫోర్లు)తో కలిసి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి కేవలం 8 పరుగులకే పరిమితమైనప్పటికీ.. సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. స్వదేశంలో 5 వేలకు పైగా వన్డే పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
చదవండి: క్రికెటర్ల సంఖ్యను ప్రకటించిన బీసీసీఐ.. జట్టులో కనీసం..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top