Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్‌ శర్మ.. ఉమ్రాన్‌కు బదులు అర్ష్‌దీప్‌! అక్కడ చెరో విజయం

Ind Vs SL 2nd T20: Sanju Ruled Out Jitesh Sharma Replace Pitch Condition - Sakshi

India vs Sri Lanka, 2nd T20I - పుణే: గెలుపుతో కొత్త ఏడాదిని ప్రారంభించిన భారత్‌ వరుస విజయంతో ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. గురువారం జరిగే రెండో టి20లో సిరీస్‌ సొంతం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మరోవైపు తొలి మ్యాచ్‌ ఓటమితో ఒత్తిడిలో కూరుకుపోయిన శ్రీలంక సిరీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉంది.

ఆసియా కప్‌ టి20 చాంపియన్‌ అయిన లంక బౌలింగ్‌లో ఆతిథ్య జట్టును చక్కగా కట్టడి చేసినప్పటికీ బ్యాటింగ్‌లో తడబడింది. దీంతో పటిష్టమైన భారత్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు లోపాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) మైదానంలో ఇరు జట్ల మధ్య రెండో టి20 కూడా ఆసక్తికరంగా జరగనుంది.  

సంజూ అవుట్‌
మోకాలి గాయం కారణంగా సంజూ శాంసన్‌ టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో విదర్భకు చెందిన వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మను జట్టులోకి ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. 

గెలిచింది కానీ...
భారత్‌ సిరీస్‌లో శుభారంభం చేసింది. కానీ అంత గొప్ప విజయమైతే కాదు. ఓపెనింగ్, టాపార్డర్‌ వైఫల్యం జట్టును కంగారు పెట్టించింది. పొట్టి మ్యాచ్‌ల్లో శివమెత్తే ‘మిస్టర్‌ 360 డిగ్రీ’ బ్యాటర్‌ సూర్యకుమార్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. రోహిత్, కోహ్లిలాంటి స్టార్లు లేని ప్రస్తుత టీమిండియాకు సంచలన బ్యాటర్‌ సూర్యకుమారే కీలక ఆటగాడు.

అలాంటి బ్యాటర్‌ బాధ్యతను విస్మరిస్తే మాత్రం జట్టుకు మూల్యం తప్పదు. మిడిలార్డర్‌లో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌ గత మ్యాచ్‌లో ఆదుకున్నారు. ఈ మ్యాచ్‌లో వారిదాకా బ్యాటింగ్‌ రాకుండా భారత టాపార్డర్‌ బ్యాటర్లు రాణించాలి.  

ఉమ్రాన్‌ స్థానంలో అర్ష్‌దీప్‌
గత మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా బరిలోకి దిగలేకపోయిన యువ సీమర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండో టి20కి సిద్ధంగా ఉన్నాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ స్థానంలో అతను ఆడతాడు. దీంతో పేస్‌ విభాగం కాస్త పటిష్టమవుతుంది. శివమ్‌ మావి తొలి మ్యాచ్‌లో సత్తా నిరూపించుకోవడంతో అతని స్థానానికి వచ్చిన ఢోకా అయితే లేదు.

అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌ చహల్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఇబ్బందికర అంశం. స్పిన్‌కు కలిసొచ్చే ఎంసీఏ పిచ్‌పై అతను సత్తా చాటుకోవాలి.  

రేసులో పడాలనే లక్ష్యంతో... 
భారత్‌ సిరీస్‌ వేటలో పడితే... లంక సిరీస్‌ రేసులో ఉండాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఆతిథ్య జట్టులాగే లంక జట్టులోనూ టాపార్డర్‌ విఫలమైంది. మెరుపులు మెరిపించే నిసాంక, ధనంజయ డిసిల్వా పవర్‌ప్లేలోనే డగౌట్‌లో చేరడం, హిట్టర్‌ రాజపక్స వైఫల్యం లంక లక్ష్యఛేదనను భారంగా మార్చింది.

కీలకమైన ఈ పోరులో వీరంతా ఫామ్‌లోకి వస్తే శ్రీలంక మ్యాచ్‌లో గెలిచి రేసులో నిలుస్తుంది. బౌలింగ్‌లో 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్న కసున్‌ రజిత స్థానంలో లాహిరు కుమారను ఆడించాలని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఇది మినహా దాదాపు తొలి మ్యాచ్‌ ఆడిన తుదిజట్టే బరిలోకి దిగుతుంది.  
       
పిచ్, వాతావరణం 
ఎంసీఏ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. పేసర్లకంటే  స్పిన్నర్లకు కలిసొచ్చే పిచ్‌. వర్షం ముప్పు లేదు. మంచు ప్రభావం ఉంటుంది. ఈ మైదానంలో భారత్‌ మూడు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది.

2012లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్లతో నెగ్గగా... 2016లో శ్రీలంక చేతిలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2020లో శ్రీలంకపైనే భారత్‌ 78 పరుగులతో గెలిచింది.    

శ్రీలంకతో మిగిలిన రెండు టీ20లకు భారత జట్టు:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ , ఉమ్రాన్ మాలిక్, శివం మావి, ముఖేష్ కుమార్

చదవండి: IND VS SL 1st T20: సంజూ శాంసన్‌ను ఏకి పారేసిన లిటిల్‌ మాస్టర్‌
Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ..
Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్‌ మాలిక్‌.. త్వరలోనే అక్తర్‌ను కూడా!

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top