IND Vs SA: కోహ్లి ఈగోను పక్కకు పెట్టాడు.. గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

IND Vs SA: కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గౌతమ్‌ గంభీర్‌

Published Wed, Jan 12 2022 5:31 PM

IND Vs SA: Kohli Left His Ego, Gambhir Hail Kohli Disciplined Approach In 3rd Test - Sakshi

Gautam Gambhir Hails Virat Kohli:  దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 79 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లిపై భారత మాజీ ఓపెనర్‌, ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విషయం ఏదైన కోహ్లిపై విమర్శనాస్త్రాలు సంధించే గంభీర్‌.. తొలిసారిగా కోహ్లిని ఉద్దేశించి పాజిటివ్‌గా మాట్లడాడు. కేప్‌టౌన్‌ టెస్ట్‌లో కోహ్లి.. తన ఈగోను బ్యాగ్‌లో పెట్టి బ్యాటింగ్‌ చేశాడని, ఆ కారణంగానే కీలక ఇన్నింగ్స్‌ ఆడగలిగాడని పేర్కొన్నాడు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అహాన్ని పక్కకు పెట్టాలని కోహ్లి తన సహచరులకు సూచించేవాడని, తాజా ఇన్నింగ్స్‌లో కోహ్లి ఆ ఫార్ములాను పక్కాగా  అమలు చేశాడని కితాబునిచ్చాడు. 
 
ఈ ఇన్నింగ్స్‌లో సఫారీ పేసర్లు కవ్వించే బంతులు విసిరినా ఏకాగ్రత కోల్పోకుండా సంయమనంతో బ్యాటింగ్‌ చేసిన కోహ్లి.. జట్టుకు గౌవరప్రదమైన స్కోర్‌ అందించాడని ప్రశంసించాడు. ఓపెనర్ల వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న దశలో క్రీజ్‌లోకి వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడని కొనియాడాడు. తన సహజ శైలికి భిన్నంగా ఎంతో ఓర్పుతో 201 బంతులను ఎదుర్కొని కీలక ఇన్నింగ్స్‌ ఆడాడని ఆ​కాశానికెత్తాడు. చాలా కాలం తర్వాత కోహ్లి.. తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడని ప్రశంసలు కురిపించాడు. కోహ్లి ఆడిన ఈ క్లాసీ ఇన్నింగ్స్‌ శతకంతో సమానమని పేర్కొన్నాడు. 

ఇదిలా ఉంటే, కోహ్లి రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన సఫారీలు తొలి ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 17 పరుగులు చేశారు. కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌(3)ను బుమ్రా ఔట్‌ చేయగా.. క్రీజ్‌లో మార్క్రమ్‌(8), కేశవ్‌ మహారాజ్‌(6) ఉన్నారు.
చదవండి: ICC Test Rankings: దూసుకొచ్చిన ప్రొటిస్‌ కెప్టెన్‌.. టీమిండియా నుంచి అతడొక్కడే!

Advertisement
Advertisement