T20 WC 2022: ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కనందుకు నేనేమీ నిరాశ చెందలేదు! అయినా..

Ind Vs SA 3rd ODI Kuldeep Yadav: Not Disappointed Over T20 WC Snub - Sakshi

T20 World Cup 2022 Indian Squad: ‘‘ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడం పట్ల నేనేమీ నిరాశ చెందలేదు. నా ఆటను మెరుగుపరచుకోవడంపైనే ప్రస్తుతం దృష్టి సారించాను. అందుకు తగ్గట్లుగా రోజురోజుకూ మెరుగవుతున్నాననే అనుకుంటున్నా’’ అని అన్నాడు టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌.

ఉత్తమ ఆటగాళ్లలో అత్యుత్తమ ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కుతుంది.. కాబట్టి తానేమీ నిరుత్సాహపడలేదని వ్యాఖ్యానించాడు. చాలా రోజుల తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు ఈ చైనామన్‌ స్పిన్నర్‌. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

అదరగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా..
మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ అహ్మద్‌లతో కలిసి ప్రొటిస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు కుల్దీప్‌ యాదవ్‌. తద్వారా పర్యాటక సౌతాఫ్రికాను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించి.. టీమిండియా విజయంలో పాలుపంచుకున్నాడు. మొత్తంగా 4.1 ఓవర్లు బౌలింగ్‌ చేసిన కుల్దీప్‌.. 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కుల్దీప్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కకపోవడంపై పైవిధంగా స్పందించాడు. ఇక తాను వన్డేల్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తానన్న కుల్దీప్‌నకు... మరో స్పిన్‌ బౌలర్‌ యజ్వేంద్ర చహల్‌ గురించి ప్రశ్న ఎదురైంది. 

మీ స్పిన్‌ పార్ట్‌నర్‌ను మిస్‌ అవుతున్నారా అడుగగ్గా.. ‘‘ఇది నన్ను ఇరుకున పెట్టే ప్రశ్న(నవ్వుతూ). తను ఇప్పుడు.. టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. తను అక్కడ బాగా రాణించాలని కోరుకుంటున్నా. నేను ఇక్కడ వన్డేల్లో ఆడుకుంటా’’ అంటూ క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. కాగా తొలి మ్యాచ్‌లో సఫారీల చేతిలో ఓటమి పాలైన ధావన్‌ సేన.. ఆఖరి రెండు వన్డేల్లో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 

టీ20 ప్రపంచకప్‌-2022 భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్‌ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.
స్టాండ్‌బై ప్లేయర్స్: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చహర్.

చదవండి: T20 WC: ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా ఓటములకు కారణం అదే! మరీ పిరికిగా.. ఈసారైతే వాళ్లిద్దరు లేరు!
దగా పడ్డ గంగూలీ.. ఐసీసీ పదవి కూడా లేనట్టే..!
సిరాజ్‌తో కుల్దీప్‌ ముచ్చట.. వీడియో షేర్‌ చేసిన బీసీసీఐ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top