
Ind Vs Sa 2nd Test: ఒక్కటీ ఓడలేదు.. వాండరర్స్‌లో టీమిండియా టెస్టు రికార్డు ఎలా ఉందంటే!
Ind Vs Sa 2nd Test At Wanderers Stadium: సెంచూరియన్ నుంచి జొహన్నస్‌బర్గ్‌కు దూరం కేవలం 41 కిలోమీటర్లు. కానీ... ఈ ప్రయాణంలో టీమిండియా టెస్టు జట్టుకు దక్కిన మధురానుభూతులు మాత్రం వెలకట్టలేనివి. డిసెంబరు 30 వరకు సూపర్‌స్పోర్ట్ పార్కులో ఇంతవరకు ఏ ఆసియా జట్టు సాధించలేని ఘనతను తొలి టెస్టు విజయంతో అందుకుంది కోహ్లి సేన. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు రెండో టెస్టుకు వేదికైన వాండరర్స్‌కు పయనమైంది. ఇక్కడ ఇంతవరకు టీమిండియా ఒక్క టెస్టు కూడా ఓడిపోకపోవడం విశేషం.
జనవరి 3 నుంచి దక్షిణాఫ్రికా- భారత్ మధ్య రెండో టెస్టు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జొహన్నస్‌బర్గ్‌లో ఉన్న రికార్డును గనుక కొనసాగిస్తే సరికొత్త సృష్టించడం ఖాయం. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి టీమిండియా సారథిగా విరాట్ కోహ్లి రికార్డులకెక్కుతాడు.
మరి వాండరర్స్‌లో టీమిండియా టెస్టు రికార్డు ఎలా ఉందంటే!
►ఇప్పటివరకు ఈ మైదానంలో భారత్ ఐదు మ్యాచ్‌లు ఆడింది.
►ఇందులో 2 టెస్టులు గెలవగా.. మూడింటిని డ్రా చేసుకుంది. ఒక్కటి కూడా ఓడిపోలేదు.
►ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కోహ్లికి మంచి మంచి రికార్డు ఉంది. వీళ్లిద్దరికీ ఇది లక్కీ గ్రౌండ్ అని చెప్పవచ్చు.
►1997 నాటి సిరీస్‌లో భాగంగా ద్రవిడ్ ఇక్కడ 148 పరుగులతో అద్భుతంగా రాణించాడు. అదే విధంగా 2006లో టీమిండియా కెప్టెన్‌గా ఇదే మైదానంలో మొట్టమొదటి టెస్టు విజయం నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. సదరు మ్యాచ్‌లో 123 పరుగులతో భారత్ జయకేతనం ఎగురవేసింది.
►ఇక విరాట్ కోహ్లికి కూడా ఈ మైదానం ప్రత్యేకమే. సారథిగా 2018లో వాండరర్స్‌లో గెలుపుతోనే విదేశీ గడ్డమీద విజయపరంపర మొదలైంది.
►ఇక మొదటి టెస్టులో జోరు మీదున్న కోహ్లి సేన... తమకు అచ్చొచ్చిన వాండరర్స్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందనడంలో సందేహం లేదు.
చదవండి: IPL 2022 Auction: వదిలేసినా ఆ జట్టుకే ఆడాలని కోరుకుంటున్నారు... ఇప్పటికే రాయుడు, అశ్విన్...