గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ స్థానంలో బరిలోకి దిగిన బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్ న్యూజిలాండ్‌ను ఇబ్బంది పెడుతోంది. 14.4 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 112 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయింది. కాన్వే (1), సీఫర్ట్ (12), రచిన్ రవీంద్ర (4), చాప్‌మన్ (32), డారిల్ మిచెల్ (14) ఔట్ కాగా.. గ్లెన్ ఫిలిప్స్ (48), సాంట్నర్ క్రీజ్‌లో ఉన్నారు.
భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, బిష్ణోయ్, బుమ్రా తలో వికెట్ తీశారు. వీరిలో బిష్ణోయ్, బుమ్రా అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండగా.. మిగతా వారు పర్వాలేదనిపిస్తున్నారు. ఇప్పటివరకు బౌలింగ్ చేసిన దాంట్లో కుల్దీప్ యాదవ్ (3-0-32-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దూబే కూడా ఓ ఓవర్ వేసి 13 పరుగులిచ్చాడు.
గాల్లో నాట్యం
ఇన్నింగ్స్ 6వ ఓవర్ తొలి బంతికి బుమ్రా అద్భుతం చేశాడు. ఫుల్ లెంగ్త్ బంతిని డిఫెండ్ చేసుకునే క్రమంలో సీఫర్ట్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి సీఫర్ట్ బ్యాట్‌ను ఆఫ్ స్టంప్‌ను గిరాటు వేసింది. బుమ్రా సంధించిన వేగానికి వికెట్ కాసేపే గాల్లో నాట్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
A PEACH FROM THE BEST BOWLER OF GENERATION - BUMRAH 😍 pic.twitter.com/QyUNGzYLS1
— Johns. (@CricCrazyJohns) January 25, 2026
రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా
ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి స్థానాల్లో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చారు.
మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. జకరీ ఫౌల్క్స్ స్థానంలో కైల్ జేమీసన్ తుది జట్టులోకి వచ్చాడు.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది.
తుది జట్లు..
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ
భారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా


