Credits: crickettimes
India vs England, 4th Test- Rajat Patidar: టీమిండియా బ్యాటర్ రజత్ పాటిదార్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా అతడు మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు. వరుస ఇన్నింగ్స్‌లో వైఫల్యం చెంది టీమిండియా అభిమానుల విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.
విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్ సందర్భంగా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ అంతర్జాతీయ టెస్టులో అడుగుపెట్టాడు. విరాట్ కోహ్లి జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో అతడి స్థానంలో ఎంట్రీ ఇచ్చిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ చేసిన పరుగులు 32, 9.
రెండు ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లిష్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో పాటిదార్ అవుట్ కావడం విశేషం. ఏదేమైనా.. తొలి మ్యాచ్‌లో కాస్త ఫర్వాలేదనిపించినా రాజ్‌కోట్ టెస్టులో మాత్రం పాటిదార్ పూర్తిగా విఫలమయ్యాడు.
ఐదుసార్లూ వాళ్ల చేతికే చిక్కాడు
తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులకే పరిమితమైన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో రెండు సందర్భాల్లోనూ అతడు ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లే చేతికే చిక్కడం గమనార్హం. తాజాగా నాలుగో టెస్టులోనూ 17 పరుగులకే అవుటయ్యాడు పాటిదార్.
ఈసారి కూడా స్పిన్ బౌలింగ్ ఆడటంలో తన బలహీనతను మరోసారి బయటపెడుతూ 30 ఏళ్ల పాటిదార్.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్‌లో రజత్ పాటిదార్ వైఫల్యాలను ప్రస్తావిస్తూ టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు.
‘‘టీమిండియాలో అరంగేట్రం తర్వాత వరుసగా విఫలమైనా.. తుదిజట్టులో అతడికి చోటు ఇస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.
మరోవైపు.. సంజూ శాంసన్ వంటి ఆటగాడికి 2015లో టీ20లో టీమిండియా తరఫున.. అదీ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయించారు. మళ్లీ అతడు మరో అంతర్జాతీయ టీ20 ఆడటానికి ఐదేళ్లు(2020) పట్టింది.
ఎందుకింత వివక్ష? కేవలం ఐపీఎల్‌లో ఆడిన ఆటగాళ్లకే అవకాశాలు ఇస్తే ఇలాగే ఉంటుంది. కనీసం టెస్టు జట్టుకు ఎంపిక చేసే ఆటగాళ్లనైనా.. రంజీ ట్రోఫీ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లలో ప్రదర్శన ఆధారంగా ఎంచుకోండి’’ అని సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు. ఇక శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
చదవండి: IPL 2024- MI: అడ్జస్ట్ అవ్వాలా?.. ఇది ఎలా తింటాననుకున్నావు? పాండ్యా ఫైర్


